Sun Poisoning: సన్‌స్క్రీన్‌ రాసుకోవట్లేదా? అయితే ఈమెలా కావచ్చు!

సౌందర్య సంరక్షణలో భాగంగా కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి! సన్‌స్క్రీన్‌ రాసుకోవడం కూడా వీటిలో ఒకటి. బయటికి వెళ్లే ముందు దీన్ని చర్మానికి అప్లై చేసుకుంటే ఎండ వల్ల చర్మం కమిలిపోకుండా ఇది సంరక్షిస్తుంది. కానీ కొంతమంది ఏమవుతుందిలే అని దీన్ని...

Published : 30 Jun 2023 12:33 IST

సౌందర్య సంరక్షణలో భాగంగా కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి! సన్‌స్క్రీన్‌ రాసుకోవడం కూడా వీటిలో ఒకటి. బయటికి వెళ్లే ముందు దీన్ని చర్మానికి అప్లై చేసుకుంటే ఎండ వల్ల చర్మం కమిలిపోకుండా ఇది సంరక్షిస్తుంది. కానీ కొంతమంది ఏమవుతుందిలే అని దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి వారు అమెరికన్‌ అమ్మాయి బెలా చాట్విన్‌ని చూస్తే మనసు మార్చుకోవాల్సిందే! ఎందుకంటే ఇటీవలే ఓ వెకేషన్‌లో భాగంగా ఐదు గంటలు ఎండలోనే గడిపిన ఆమె.. ‘సన్‌ పాయిజనింగ్‌’ బారిన పడింది. అందంగా, కోమలంగా ఉండే ఆమె ముఖం.. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇలా ఆమె పరిస్థితి సన్‌స్క్రీన్‌ను నిర్లక్ష్యం చేసే వారికి ఓ గుణపాఠమైందని చెప్పచ్చు. మరి, ఇంతకీ ఏంటీ ‘సన్‌ పాయిజనింగ్‌’? సన్‌స్క్రీన్‌కు, దీనికి సంబంధమేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

‘ఏలియన్‌’లా ఉన్నావన్నారు!

అమెరికాలోని ఉతాకు చెందిన 21 ఏళ్ల బెలా చాట్విన్‌.. ఇటీవలే శాన్ డీగో పర్యటనకు వెళ్లింది. ఓరోజు సన్‌స్క్రీన్‌ రాసుకోకుండానే బీచ్‌కు వెళ్లిందామె. అలా బీచ్‌ అందాలను చూస్తూ.. ఎండలోనే ఐదు గంటల పాటు నిద్రలోకి జారుకుంది. ఆపై నిద్ర లేచేసరికి విపరీతమైన అలసటకు గురైన బెలా.. తిరిగి రూమ్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకుంది. అయితే ఎండ తాలూకు ప్రభావం మరుసటి రోజుకు గానీ బయటపడలేదంటోందామె.

‘నేను బీచ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉష్ణోగ్రత 18-22 డిగ్రీలుగా ఉంది.. పైగా ఆకాశం మబ్బు పట్టింది. అందుకే సన్‌స్క్రీన్‌ రాసుకోకుండానే బీచ్‌లో గడిపాను.. సుమారు ఐదు గంటల పాటు ఎండలోనే నిద్రపోయాను. లేచేసరికి బాగా అలసటగా అనిపించింది. అయితే మరుసటి రోజు ఉదయానికల్లా ముఖం ఎర్రగా మారిపోయింది. క్రమంగా ముఖం ఉబ్బిపోవడం, బుగ్గలు-గడ్డం దగ్గర దద్దుర్లు రావడం.. వంటివీ గమనించా. వీటికి తోడు ముఖం నొప్పిగానూ అనిపించింది.. ఇలా విచిత్రంగా మారిపోయిన నా ముఖం చూసి ఇంట్లో వాళ్లు కూడా గుర్తుపట్టలేదంటే ఎండ ప్రభావం నాపై ఎంతగా పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక బయటికెళ్లినప్పుడు స్కార్ఫ్‌, మాస్క్తో ముఖం కవర్‌ చేసుకునేదాన్ని. కొంతమంది నా ముఖాన్ని చూసి ఏలియన్‌లా ఉన్నావనీ ఏడిపించారు. ఈ లక్షణాలకు తోడు వికారంగా అనిపించడంతో వెంటనే డాక్టర్‌ని సంప్రదించాను. ఇదంతా సన్‌ పాయిజనింగ్‌ వల్లేనని డాక్టర్‌ తేల్చారు. అయితే ఇదే సమయంలో నాకు ఫొటో-డెర్మటైటిస్‌ అనే దీర్ఘకాలిక చర్మ సమస్య కూడా ఉన్నట్లు తేలింది. ఏదేమైనా ఈ సమస్య నుంచి బయటపడడానికి మూడు వారాల పాటు ఇంటికే పరిమితమయ్యా.. డాక్టర్‌ సలహా మేరకు స్టెరాయిడ్‌ క్రీమ్‌ వాడాను..’ అంటూ తన అనుభవాల్ని పంచుకుంది బెలా.


ఏంటీ ‘సన్‌ పాయిజనింగ్’?

సన్‌స్క్రీన్‌ రాసుకోకుండా ఎండలో గడపడం వల్ల.. సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాల ప్రభావంతో చర్మం ట్యాన్‌కు గురవడం/కందిపోవడం సహజమే! అయితే ఈ ట్యాన్‌ తీవ్రత చర్మంపై సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు తలెత్తే పరిస్థితిని ‘సన్‌ పాయిజనింగ్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు. దీనివల్ల పై సంఘటనలో బెలా మాదిరిగా.. ముఖం ఎక్కువగా ఉబ్బిపోవడం, ఎర్రటి దద్దుర్లు-అలర్జీ ఏర్పడడం, ముఖాన్ని తాకగానే నొప్పిగా అనిపించడం.. వంటివి జరుగుతాయి. దీనికి తోడు శారీరకంగానూ పలు ఆరోగ్య సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. తలనొప్పి, జ్వరం, వికారం, నీరసం, మనసంతా గందరగోళంగా అనిపించడం, మైకం కమ్మినట్లు అనిపించడం, డీహైడ్రేషన్‌కి గురవడం.. వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాలంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఎండగా ఉన్నా, మబ్బు పట్టినా.. బయట అడుగుపెట్టే ముందు సన్‌స్క్రీన్‌ రాసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.


వీరికి ముప్పెక్కువ!

సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కువసేపు ఎండలో గడపడం వల్ల ట్యాన్‌ ఏర్పడడం చాలామందికి అనుభవమే అయినా.. కొంతమందిలో మాత్రం సన్‌ పాయిజనింగ్‌ ముప్పు అధికంగా పొంచి ఉందంటున్నారు నిపుణులు.

ప్రకాశవంతమైన చర్మ ఛాయ ఉన్న వారి చర్మంలో మెలనిన్‌ ఉత్పత్తి తక్కువ. ఫలితంగా ఇది సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాల్ని సులభంగా శోషించుకుంటుంది. తద్వారా చర్మం నల్లగా మారుతుంది. కాబట్టి ఫెయిర్‌ స్కిన్‌ ఉన్న వారికి సన్‌ పాయిజనింగ్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందట!

తమకు చర్మ క్యాన్సర్‌ ఉన్నా.. లేదంటే కుటుంబంలో ఎవరికైనా చర్మ క్యాన్సర్ ఉన్నా.. వంశపారంపర్యంగానూ ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

విటిలిగో, అలొపేషియా.. వంటి చర్మ సమస్యలున్న వారిలోనూ సన్‌ పాయిజనింగ్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందట!

కొన్ని రకాల యాంటీ బయాటిక్స్‌, మొటిమలకు సంబంధించిన మందులు, యాంటీ ఫంగల్‌ ఔషధాలు, గర్భనిరోధక మాత్రలు వంటివి వాడే వారు, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలున్న చర్మ ఉత్పత్తుల్ని ఉపయోగించే వారూ.. ఈ చర్మ సమస్య బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట!

అంతేకాదు.. కొన్ని రకాల విటమిన్‌ సప్లిమెంట్ల వల్ల కూడా సన్‌ పాయిజనింగ్‌ సమస్య ముప్పు పొంచి ఉంటుందంటున్నారు నిపుణులు.

అందుకే ఇలాంటి వారు ఎండలో ఎక్కువ సమయం గడపకుండా జాగ్రత్తపడాలంటున్నారు. అలాగే బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ రాసుకోవడం, చర్మాన్ని కవరయ్యేలా దుస్తులు ధరించడం.. వంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.


ఇవి గుర్తుంచుకోండి!

ట్యాన్‌, సన్‌ పాయిజనింగ్‌.. ఇలా సమస్య ఏదైనా వచ్చాక ఇబ్బంది పడడం కంటే రాక ముందే పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

బయటికి వెళ్లే ముందు SPF 30 లేదా అంతకంటే ఎక్కువ విలువ గల సన్‌స్క్రీన్‌ తప్పనిసరిగా రాసుకోవాలి. అది కూడా పావుగంట ముందే అప్లై చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే పెదాలకూ SPF 30+ లిప్‌బామ్‌ అప్లై చేసుకోవాలి.

ఒక్కసారి రాసుకున్నాం కదా అని వదిలేయకుండా.. ప్రతి రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్‌ రాసుకోవడం ముఖ్యం. ఇక ఈత కొట్టేవారు, చెమట సమస్య ఎక్కువగా ఉన్న వారు ఈ చిట్కా తప్పకుండా పాటించాలి.

యూవీ కిరణాలు చర్మంపై పడకుండా.. దుస్తులు, స్కార్ఫ్‌తో కవర్‌ చేసుకోవాలి. అలాగే తలకు టోపీ, కళ్లకు కూలింగ్‌ గ్లాసెస్‌ తప్పనిసరి!

మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

చర్మం, శరీరం డీహైడ్రేట్‌ కాకుండా.. నీళ్లు ఎక్కువగా తాగాలి.

బయట ఎక్కువ సమయం గడపాల్సి వస్తే.. గొడుగు ఉపయోగించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని