Published : 15/07/2022 19:39 IST

Teenage Depression: మీ పిల్లల్లో ఈ లక్షణాలు గుర్తించారా?

టీనేజ్‌.. స్వేచ్ఛగా ఉండాలని, తనకంటూ వ్యక్తిగత సమయం కావాలని, తనను తాను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరే దశ. అయితే ఈ క్రమంలో సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు, కొన్ని విషయాల్లో కుటుంబం నుంచి వ్యతిరేకత రావడం, సవాళ్లను తట్టుకునే సామర్థ్యం లేకపోవడం.. ఇలా కారణమేదైనా యుక్తవయసులోకి ప్రవేశించిన చాలామంది ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగని వాళ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. అది వారిని వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా.. రెండు రకాలుగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే తల్లిదండ్రులే చొరవ చూపి.. వాళ్ల ఆందోళనలకు కారణమేంటో తెలుసుకొని.. పరిష్కరించే దిశగా చేయూతనందించాలని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో టీనేజ్‌ వయసులో ఎదురయ్యే ఆందోళనలు, వాటికి పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం రండి..

కారణాలు అనేకం!

🟔 టీనేజ్‌ పిల్లలు పెద్దవారిలా పరిణతితో ఆలోచించలేరు. వారు ఏది కోరుకుంటే అది జరిగి తీరాల్సిందే అన్న మొండితనం వారిలో కనిపిస్తుంటుంది. ఒకవేళ అది జరగలేదంటే మాత్రం మానసికంగా మరింతగా కుంగిపోతారు.

🟔 తోటి వారితో పోల్చుకునే మనస్తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అందం, ఆహార్యం, చర్మ ఛాయ, శరీర బరువు.. వంటి అంశాల్ని మరింత లోతుగా పరిశీలిస్తూ ఆత్మన్యూనతకు, అభద్రతా భావానికి లోనవుతుంటారు. ఇది క్రమంగా వీరిని కుంగుబాటుకు గురి చేస్తుందంటున్నారు నిపుణులు.

🟔 ఇలా పోలికే కాదు.. ఎదుటివాళ్లు తమలోని లోపాల్ని ఎత్తిచూపుతూ వేధించినా, హేళన చేసినా వీళ్లు అస్సలు తట్టుకోలేరు. టీనేజ్‌ దశలో చాలామంది కుంగుబాటుకు లోనవడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నాయి పలు అధ్యయనాలు.

🟔 యుక్త వయసులోకి ప్రవేశించిన వారి శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం, హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు.. వంటివి కూడా వారిలో మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి.

🟔 కొంతమంది చిన్నతనం నుంచే చదువు, కెరీర్‌, ఇతర భవిష్యత్‌ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహనతో ఉంటారు. అయితే ఒక్కోసారి మనం అనుకున్న స్థాయిలో రాణించలేకపోవచ్చు. అలాంటప్పుడు ఓటమిని తట్టుకోలేక మానసిక కుంగుబాటుకు లోనయ్యే వారూ లేకపోలేదంటున్నారు నిపుణులు.

🟔 తెలిసీ తెలియని ఈ వయసులో ప్రేమలో పడడం, ఆకర్షణకు లోనవడం, టీనేజ్  ప్రెగ్నెన్సీ.. ఇవి కూడా వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. తద్వారా ఇతర లక్ష్యాలపై మనసు పెట్టకుండా అడ్డుపడుతున్నాయి.

🟔 ఈ దశలో కొంతమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోవడం, అత్యాచారానికి గురవడం.. ఈ విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయమే వారిని మానసికంగా దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు.

🟔 సోషల్‌ మీడియా.. దీన్ని మితంగా వాడితే ఎంత ఉపయోగకరమో.. అతిగా వాడితే అంతే అనర్థం కూడా! ముఖ్యంగా టీనేజ్‌ పిల్లలు సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగిస్తూ.. వారు పెట్టే పోస్టులకు ఆశించిన కామెంట్లు, లైకులు రాకపోవడం వల్ల కూడా డిప్రెషన్‌కి లోనవుతున్నారని పలు అధ్యయనాలు రుజువు చేశాయి.


ఇలా పసిగట్టచ్చు!

శారీరకంగా, మానసికంగా ఎదిగే ఈ యుక్త వయసులో ఒత్తిడి, ఆందోళనలకు గురవడం వల్ల దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వారు ఈ ఊబిలోకి కూరుకుపోకముందే తల్లిదండ్రులు పిల్లల్లోని డిప్రెషన్‌ను పసిగట్టాలని అంటున్నారు. అదెలాగంటే..!

🟔 ఉన్నట్లుండి అకారణంగా ఏడవడం..

🟔 నలుగురితో కలవకుండా ఎప్పుడూ ఒంటరిగా, ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించడం..

🟔 వారి మాటల్లో వైరాగ్యం, నిరాశానిస్పృహలు కొట్టొచ్చినట్లుగా కనిపించడం..

🟔 చిన్న విషయాలకే కోపం, చిరాకు తెచ్చుకోవడం.. ఎదుటివారిపై అరవడం..

🟔 ఎక్కువగా నిద్రపోవడం,  లేదంటే నిద్రలేమి..

🟔 సరిగా తినకపోవడం..

🟔 చదువులో మెరుగ్గా రాణించకపోవడం..

🟔 విచక్షణ, ఆలోచనా శక్తి కోల్పోయి తమకు తామే హాని చేసుకోవడం..

🟔 ఇలాంటి ప్రతికూల ఆలోచనలు తీవ్రమైతే.. ఒక్కోసారి ఆత్మహత్య ప్రయత్నాలకు కూడా వెనకాడకపోవచ్చు.. కాబట్టి టీనేజ్‌ పిల్లల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెట్టడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.


మీరే అండగా నిలవాలి!

డిప్రెషన్‌లోకి కూరుకుపోయిన పిల్లల్ని అందులో నుంచి బయటికి తీసుకురావడానికి తల్లిదండ్రులే చొరవ చూపాలని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

🟔 పిల్లలదే తప్పైనా సరే.. వారిని మందలించడం, కోప్పడడం, అసహ్యించుకోవడం.. చేయకుండా వారిని దగ్గరికి తీసుకోవాలి. పొరపాటు ఎలా జరిగిందో తెలుసుకొని.. దానికి పరిష్కారం వెతికే దిశగా ఆలోచిస్తే.. వారికి ఎంతో ఊరటగా ఉంటుంది.

🟔 పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటే ఇలాంటి సమస్యలు చాలావరకు తలెత్తవంటున్నారు నిపుణులు. అందుకే ఇప్పటికైనా మించిపోయింది లేదు.. మీరు మీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. మీ పిల్లల కోసం తగినంత సమయం కేటాయించడం, అన్ని విషయాలు పంచుకోవడం-తెలుసుకోవడం ఉత్తమం.

🟔 టీనేజ్‌ వయసుకొచ్చిన అమ్మాయిల్లో జరిగే శారీరక మార్పుల గురించి తల్లులు ముందే వారికి అర్థమయ్యేలా చెప్తే.. వారు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్తపడచ్చు.

🟔 కొన్ని రకాల థెరపీలు కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి వారి సలహా మేరకు ఆదిలోనే మీ పిల్లలకు చికిత్స చేయిస్తే త్వరగా మళ్లీ గాడిలో పడతారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని