Telephonophobia : ఫోన్‌లో మాట్లాడాలంటే భయమా?
మన దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు టెలిఫోనోఫోబియా సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయి. దీని ప్రభావం.. ప్రత్యక్షంగా మానసిక ఆరోగ్యంపై, పరోక్షంగా రోజువారీ పనులపై పడుతుందంటున్నారు. మరి, అసలు టెలిఫోనోఫోబియా ఎందుకొస్తుంది? దీన్నెలా గుర్తించాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
స్మార్ట్‌ఫోన్ చేతిలో లేనిదే క్షణమైనా గడవదు చాలామందికి. కాల్ మాట్లాడాలన్నా, సందేశాలు పంపాలన్నా, ఇంటర్నెట్ సెర్చింగ్, సోషల్ మీడియా.. ఆఖరికి కొన్ని ఆఫీస్ పనులు కూడా ఫోన్‌తోనే ముడిపడి ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది మన బెస్ట్ ఫ్రెండ్‌తో సమానం! అయితే కొంతమంది మాత్రం కాల్ చేయాలన్నా, అవతలి వారి కాల్ స్వీకరించాలన్నా ఒక రకమైన భయాందోళనలకు గురవుతుంటారు. ఒకవేళ కాల్ స్వీకరించినా.. కుదురుగా మాట్లాడలేక ఇబ్బంది పడిపోతుంటారు. దీన్నే ‘టెలిఫోనోఫోబియా’గా పేర్కొంటున్నారు నిపుణులు. మన దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయి. క్రమంగా దీని ప్రభావం.. ప్రత్యక్షంగా మానసిక ఆరోగ్యంపై, పరోక్షంగా రోజువారీ పనులపై పడుతుందంటున్నారు. మరి, అసలు టెలిఫోనోఫోబియా ఎందుకొస్తుంది? దీన్నెలా గుర్తించాలి? ఈ సమస్య నుంచి బయటపడే మార్గాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!
అపరిచిత ఫోన్ నంబర్లు, తెలియని వ్యక్తుల దగ్గర్నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు కాల్ స్వీకరించడానికి, వారితో మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫోన్ చేసినా స్వీకరించకపోవడం.. వాళ్లకు ఫోన్ చేయడానికి నిరాకరించడం.. వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే దాన్ని ‘టెలిఫోనోఫోబియా’గా పరిగణించచ్చంటున్నారు నిపుణులు. ‘ఫోన్ యాంగ్జైటీ’గా పిలిచే ఈ అనవసరమైన భయాందోళనల వల్ల కొంతమందిలో వ్యక్తిగత, కెరీర్ పరమైన సమస్యలొస్తాయంటున్నారు.. కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు. అయితే ఈ సమస్యను కొన్ని లక్షణాలతో గుర్తించచ్చంటున్నారు.
ఈ లక్షణాలుంటే..!
⚛ తెలిసిన వారికైనా, కొత్త వ్యక్తులకైనా కాల్ చేయడానికి/ వాళ్ల కాల్‌ని స్వీకరించడానికి నిరాకరించడం..
⚛ అవతలి వాళ్ల కాల్ స్వీకరించాలా? వద్దా? అన్న సందిగ్ధం.. మరోవైపు ఫోన్ చేయాలన్నా ఏదో తెలియని డైలమాలో పడిపోవడం..
⚛ తప్పనిసరిగా చేయాల్సిన కాల్ అయినా.. అవతలి వారితో ఏ మాట్లాడాలో స్పష్టత లేక ఇబ్బంది పడిపోవడం..
⚛ కాల్ పూర్తయ్యాక కూడా మాట్లాడిన విషయాల గురించే పదే పదే ఆలోచించడం.. సరిగ్గా మాట్లాడానో, లేదోనని తమలో తామే మథన పడిపోవడం..
⚛ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా.. ఇటు మీరు గాబరా పడిపోవడం, అవతలి వారినీ ఇబ్బంది పెట్టడం..
⚛ మాటల మధ్యలో అవతలి వారు మిమ్మల్ని జడ్జ్ చేస్తారేమోనన్న భయం..
⚛ గత ఫోన్ కాల్ సంభాషణల వల్ల ఎదురైన ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో ఇప్పుడు కాల్ చేయడానికి/స్వీకరించడానికి ఇబ్బంది పడిపోవడం..
⚛ ఫోన్ చేయాలన్నా, కాల్ స్వీకరించాలన్నా.. ఉన్నట్లుండి గుండె దడ పెరిగిపోవడం..
⚛ అవతలి వారితో ఫోన్ మాట్లాడేటప్పుడూ ఏకాగ్రత పెట్టలేకపోవడం..
⚛ ఇలాంటి మానసిక ఒత్తిళ్లతో పాటు వికారం, కాళ్లు-చేతులు వణకడం, చెమట రావడం.. వంటి భౌతిక లక్షణాలు కూడా కొంతమందిలో కనిపిస్తాయంటున్నారు నిపుణులు.
⚛ అయితే వీరు కాల్స్ మాట్లాడడానికి భయపడినా, సందేశాలు-మెయిల్స్ ద్వారా అవతలి వారితో సౌకర్యవంతంగా కనెక్ట్ అవుతారని నిపుణులు చెబుతున్నారు.
అసలెందుకిలా..?
మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించిన పలు అంశాలు, పరిస్థితులు టెలిఫోనోఫోబియాకు కారణమవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.
⚛ చాలామంది సామాజిక ఒత్తిడి వల్లే ఫోన్ యాంగ్జైటీకి గురవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. నలుగురితో కలవలేకపోవడం; మనం మాట్లాడే విధానం అవతలి వారికి నచ్చుతుందో, లేదోనన్న భయం.. ఇతరులు మనల్ని జడ్జ్ చేస్తారేమోనన్న ఆందోళన.. ఇందుకు కారణమవుతుంటుంది.
⚛ సన్నిహితులు, మిత్రుల.. మరణాలు, ప్రమాదాలు, తీవ్రమైన అనారోగ్యాలకు సంబంధించిన వార్తలు ఫోన్ కాల్స్ ద్వారా విన్నప్పుడు మానసిక వేదనకు గురవుతుంటాం. అప్పట్నుంచి ఎవరి నుంచి కాల్ వచ్చినా ఇలాంటి వార్తలు వినాల్సొస్తుందేమోనని కొంతమంది భయపడుతుంటారు. దీన్ని కూడా ‘టెలిఫోనోఫోబియా’గా చెబుతున్నారు నిపుణులు.
⚛ ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) సమస్యతో బాధపడుతున్న వారిలోనూ ఫోన్ యాంగ్జైటీ ఉండే అవకాశం ఉంటుందట!
⚛ ఫోన్లో అపరిచిత వ్యక్తుల వేధింపులు, ప్రాంక్ కాల్స్.. వంటి గత చేదు జ్ఞాపకాలు కూడా కొంతమందిలో టెలిఫోనోఫోబియాకు కారణమవుతాయట!
⚛ ఆందోళన, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యలు ఎదుర్కొనే వారిలోనూ ఫోన్ యాంగ్జైటీ కామన్ అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. జన్యుపరంగానూ ఈ సమస్య రావచ్చట!
⚛ మరికొంతమందిలో.. థైరాయిడ్ సమస్యలు, మెదడుకు దెబ్బ తగలడం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్.. వంటివీ ఫోన్ యాంగ్జైటీని తీవ్రతరం చేస్తాయట!
⚛ కొంతమంది ఇతరులతో అంత సులభంగా కలిసిపోలేరు.. రిజర్వ్‌డ్‌గా ఉంటారు.. ఇలాంటి వారిలోనూ టెలిఫోనోఫోబియా ఉంటుందంటున్నారు నిపుణులు.
థెరపీ మేలు చేస్తుంది!
టెలిఫోనోఫోబియా వంటి మానసిక సమస్యలు అటు కుటుంబ బంధాల్ని, ఇటు వృత్తిపరమైన సంబంధాల్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. అందుకే దీన్నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మేలంటున్నారు. ఇందుకోసం కొన్ని నియమాలు పాటించాలంటున్నారు.
⚛ చాలావరకు మానసిక సమస్యల్ని దూరం చేయడానికి థెరపీ ఇవ్వడం మనకు తెలిసిందే! ఈ క్రమంలో ‘కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ’తో టెలిఫోనోఫోబియా నుంచి విముక్తి పొందచ్చంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. సమస్యకు గల కారణాల్ని, లక్షణాల్ని గుర్తించి.. వాటిని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేస్తారు.
⚛ ఈ రోజుల్లో ఎవరితోనూ మాట్లాడకుండా రిజర్వ్‌డ్‌గా ఉంటామంటే కుదరదు. అందుకే ఈ భయాన్ని నెమ్మదిగా దూరం చేసుకోవాలంటే.. మనసుకు బాగా దగ్గరగా అనిపించిన వారితో రోజూ కాసేపు ఫోన్లో మాట్లాడమంటున్నారు నిపుణులు. ఇలా సాధన చేస్తున్న కొద్దీ క్రమంగా ఈ ఫోబియా దూరమవుతుందంటున్నారు.
⚛ కొంతమంది కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుండచ్చు.. మరికొందరు వృత్తిరీత్యా అధికారిక కాల్స్ మాట్లాడలేకపోవచ్చు.. ఏదేమైనా ఈ భయాన్ని దూరం చేసుకోవాలంటే.. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో ఆ పాయింట్స్‌ని ముందే నోట్ చేసుకోమని ప్రిపేర్ అవడం వల్ల ఫోన్ యాంగ్జైటీని కొంత వరకు తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
⚛ ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు, ఏ విషయం గురించైనా అతిగా ఆలోచించకపోవడం.. వంటివి సాధన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా ఫోన్ యాంగ్జైటీకి గురికాకుండా జాగ్రత్తపడచ్చు.
⚛ ఫోన్‌లో మాట్లాడడానికి మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లయితే.. అత్యవసరమైన కాల్స్ మాత్రమే అటెండ్ అవడం.. మిగతా విషయాలన్నీ సందేశాలు, మెయిల్స్, చాటింగ్స్ ద్వారా పంచుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. తద్వారా ఈ భయాన్ని క్రమంగా దూరం చేసుకోవడంతో పాటు మానసిక ప్రశాంతతా సొంతమవుతుంది. ఫలితంగా వ్యక్తిగత, వృత్తిపరమైన పనులకు అంతరాయం కలగకుండా జాగ్రత్తపడచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.