Master Dating: ఈ ప్రేమలో భాగస్వామితో పనిలేదు!
డేటింగ్.. ఈ కాలం ప్రేమికులు ప్రేమకు పెట్టిన కొత్త పేరిది! అయితే ప్రేమించుకోవాలన్నా, డేటింగ్‌కు వెళ్లాలన్నా ఇద్దరు వ్యక్తులు తప్పనిసరి! కానీ ‘మాస్టర్ డేటింగ్’లో భాగస్వామితో పని లేదు. ఎంచక్కా ఒంటరిగానే నచ్చిన చోటికి వెళ్లచ్చు.. నచ్చిన పని చేయచ్చు.
డేటింగ్.. ఈ కాలం ప్రేమికులు ప్రేమకు పెట్టిన కొత్త పేరిది! అయితే ప్రేమించుకోవాలన్నా, డేటింగ్‌కు వెళ్లాలన్నా ఇద్దరు వ్యక్తులు తప్పనిసరి! కానీ ‘మాస్టర్ డేటింగ్’లో భాగస్వామితో పని లేదు. ఎంచక్కా ఒంటరిగానే నచ్చిన చోటికి వెళ్లచ్చు.. నచ్చిన పని చేయచ్చు. ఇలా మనకు నచ్చినట్లుగా ఉండడం వల్ల మనపై మనకు ప్రేమ పెరుగుతుంది. సూటిగా చెప్పాలంటే.. స్వీయ ప్రేమను పెంచుకోవడమే ఈ డేటింగ్‌లోని అంతరార్థం! అందుకే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు ఈ తరహా డేటింగ్ సంస్కృతిని పాటిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. శాశ్వతమైన పెళ్లి బంధంలోకి అడుగుపెట్టే ముందు ఇలా స్వీయ ప్రేమను పెంచుకోవడమూ మంచిదంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలొచ్చినా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలిగే పాజిటివిటీ పెరుగుతుందంటున్నారు. మరి, ఈ సోలో డేటింగ్ ట్రెండ్‌ని ఎలా పాటించాలి? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..
ప్రేమలో విఫలమయ్యో లేదంటే భాగస్వామి చేసిన మోసాన్ని భరించలేకో, భర్త నుంచి శారీరక/మానసిక వేధింపుల్ని ఎదుర్కొనో.. ఇలా కారణమేదైనా కుంగిపోయే వారు కొందరుంటారు. ప్రేమ/అనుబంధం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్ని పదే పదే తలచుకొని కుమిలిపోతుంటారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందే వారూ లేకపోలేదు. ఇలాంటి నెగెటివిటీ దరిచేరకుండా ఉండాలంటే.. ప్రేమలో పడకముందే/పెళ్లికి ముందే స్వీయ ప్రేమను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటున్నారు నిపుణులు. ఇందుకు ‘మాస్టర్ డేటింగ్’ను మించినది లేదంటున్నారు.
మన జీవితం.. మన ఇష్టం!
ఈ సోలో డేటింగ్ ట్రెండ్‌లో భాగంగా.. ప్రేమను ఇచ్చేదీ మనమే.. పుచ్చుకునేదీ మనమే! అంటే.. మనకు నచ్చిన పనులు చేస్తూ స్వీయ ప్రేమను పెంపొందించుకోవడమన్న మాట! అవేంటంటే..!
⚛ సాధారణంగా డేటింగ్‌లో భాగంగా.. కొంతమంది తమ భాగస్వామితో కలిసి ట్రెక్కింగ్, హైకింగ్.. వంటి సాహసాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. మీకూ ఇలాంటి సాహసాలంటే ఇష్టమైతే.. ఒంటరిగానే చేసేయచ్చు. అయితే ఈ క్రమంలో ముందుగా నిపుణుల గైడెన్స్ తీసుకోవడం, పలు జాగ్రత్తలు పాటించడం వల్ల.. హ్యాపీగా ట్రెక్కింగ్/హైకింగ్.. వంటివి పూర్తి చేయచ్చు. ఇలా మనసుకు నచ్చిన పని అనుకున్న వెంటనే పూర్తయితే ఆ ఫీలింగే వేరు.. కదండీ!
⚛ కొంతమంది సంగీతం, డ్యాన్స్.. వంటివి ఇష్టపడుతుంటారు. అలాగని ఎప్పుడూ ఫోన్లో పాటలు వినడం, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూడడం కాకుండా.. మీకు వీలు చిక్కినప్పుడల్లా లైవ్ కన్సర్ట్స్‌కి వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. లేదంటే ఈ రోజుల్లో వర్చువల్‌గానూ కొన్ని ప్రదర్శనలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. వాటినీ ఫాలో అవ్వచ్చు. సినిమాలు ఇష్టపడే వారు థియేటర్‌కి వెళ్లచ్చు.. వీలు కాకపోతే ఇంట్లోనే నచ్చిన సినిమాను ఎంజాయ్ చేయచ్చు.. ఇలా ఒంటరిగా నచ్చిన ప్రోగ్రామ్‌ని ఆస్వాదిస్తే మనసు ఉత్సాహంతో నిండిపోతుందనడంలో సందేహమే లేదు.
⚛ షాపింగ్‌కి వెళ్లడమంటే అమ్మాయిలకు మహా ఇష్టం. అప్పుడప్పుడూ సరదా కోసమూ షాపింగ్‌కి వెళ్లే వారుంటారు. అయితే భాగస్వామితోనో/ఫ్రెండ్స్‌తోనో వెళ్తే.. అది బాలేదంటారు, ఇది నచ్చలేదంటారు.. ధర ఎక్కువైందంటారు. ఇలా మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటారు. దీంతో ఏది కొనాలో అర్థం కాదు. అందుకే షాపింగ్‌ని ఇష్టపడే వారు సోలోగానే వెళ్లి చూడండి.. ఎవరి అభిప్రాయాలతో పని లేకుండా నచ్చినవి కొనుక్కోండి. ఇలా నచ్చినట్లుగా రడీ అయినా స్వీయ ప్రేమను పెంచుకోవడమే అంటున్నారు నిపుణులు.
⚛ డేటింగ్‌లో భాగంగా భాగస్వామితో లాంగ్‌డ్రైవ్స్, టూర్లు.. వంటివి ప్లాన్ చేసుకోవడం సహజమే! అదే మాస్టర్ డేటింగ్‌లో సోలోగా మీకు నచ్చిన ప్రదేశానికి టూర్ ప్లాన్ చేసుకోండి. ఇలా ఒంటరి ప్రయాణాల్ని ప్రోత్సహించే సంస్థలు, కమ్యూనిటీలు ప్రస్తుతం బోలెడున్నాయి. వాళ్ల సలహాలు తీసుకుంటే యాత్ర సాఫీగా పూర్తి చేసుకోవచ్చు.. నచ్చినట్లుగా ఎంజాయ్ చేయచ్చు.
⚛ ఓ కప్పు కాఫీ అయినా, నచ్చిన రెసిపీ అయినా.. సొంతంగా తయారుచేసుకొని తీసుకుంటే ఆ ఫీలింగే వేరు. అందుకే సోలో డేటింగ్‌లో భాగంగా అప్పుడప్పుడూ మీ మనసుకు నచ్చిన వంటకాలు ప్రయత్నిస్తూ వాటి రుచి చూడచ్చు. అలాగే ఇంట్లోనే సోలో డేట్ నైట్‌నీ ఏర్పాటుచేసుకోవచ్చు. ఇందులోనూ బోలెడంత సంతోషం దొరుకుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
⚛ డేటింగ్‌లో ఉన్న కపుల్ ఎక్కువగా డిన్నర్‌కు వెళ్లడం చూస్తుంటాం. సింగిల్‌గానూ ఇది ట్రై చేయచ్చు. సాయంత్రాలు అలా బయటికి వెళ్లినప్పుడో లేదంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడో మధ్యలో దగ్గర్లోని హోటల్‌లో ఆగి.. డిన్నర్ చేసి ఇంటికి రావచ్చు. ఇదీ నచ్చిన పని చేయడంలో ఓ భాగమే!
⚛ ఈ బిజీ లైఫ్‌స్టైల్లో మనకంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికే వీలు పడదు. కానీ మాస్టర్ డేటింగ్‌లో ఇదీ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు వాయిదా వేస్తున్న పనుల్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టచ్చు. ఇక పని పూర్తయ్యాక మనసూ రిలాక్సవుతుంది.
⚛ కొంతమంది చక్కటి శరీరాకృతిని మెయింటెయిన్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలో జిమ్‌లో చేరడం, లేదంటే ఇంట్లోనే వ్యాయామాలు సాధన చేయడం.. వంటివి చేస్తుంటారు. అయితే ఇలా ఒంటరిగా జిమ్ చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాల్నీ సులభంగా చేరుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇలా ఫిట్‌నెస్ పరంగా, స్వీయ ప్రేమను పెంచుకోవడానికీ.. ఇలా రెండు విధాలుగా సోలో వర్కవుట్స్ ఉపయోగపడతాయంటున్నారు.
వారానికి ఒక్క రోజు!
ఇలా మనతో మనం సమయం గడపడం, నచ్చిన పనులు చేయడం, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. మనతో మనకు విడదీయరాని బంధం ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. ఈ స్వీయ ప్రేమ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని అందిస్తుందంటున్నారు. అయితే ఇలా రోజూ మనకు నచ్చినట్లుగానే ఉండడం, నచ్చిన పనులే చేయడం కుదరకపోవచ్చు.. అంత సమయమూ దొరక్కపోవచ్చు. అందుకే వారానికోరోజు ఫిక్స్ చేసుకొని ఈ డేటింగ్ ట్రెండ్‌ని పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఒక కచ్చితమైన జీవనశైలి అలవడడంతో పాటు.. క్రమంగా స్వీయ ప్రేమనూ పెంచుకోవచ్చంటున్నారు. ఇలాంటి ప్రేమ మనల్ని మానసికంగానూ దృఢం చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.