నోరూరించే పానీపూరీ.. దీని కథ మీకు తెలుసా?
స్ట్రీట్ ఫుడ్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది పానీపూరీ. అందుకు అది పంచే అద్భుతమైన రుచే ముఖ్య కారణం అనడం అతిశయోక్తి కాదేమో! అది ఏ కాలమైనా మన వీధిలో పానీపూరీ బండి కనిపిస్తే చాలు.. వెంటనే అక్కడికి పరుగులు పెట్టి దాని...
స్ట్రీట్ ఫుడ్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది పానీపూరీ. అందుకు అది పంచే అద్భుతమైన రుచే ముఖ్య కారణం అనడం అతిశయోక్తి కాదేమో! అది ఏ కాలమైనా మన వీధిలో పానీపూరీ బండి కనిపిస్తే చాలు.. వెంటనే అక్కడికి పరుగులు పెట్టి దాని రుచి ఆస్వాదించే దాకా మనసు వూరుకోదు. అంతలా అది మన రుచుల్లో ఒక భాగమైంది. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల వారికీ ఇది ఎంతో ఇష్టమైన స్నాక్. అయితే దీన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. అంతేకాదు.. వాటి రుచీ భిన్నమే.
ఇంతకీ ఇప్పుడు దీని గురించి ఎందుకంటే.. 2015 జులై 12న మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఒక రెస్టారెంట్ 51 రకాల రుచికరమైన పానీపూరీలను అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ప్రముఖ సెర్జ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. దీంతో పాటు పానీపూరీ ఆకృతులతో ఓ ఇంటరాక్టివ్ గేమ్‌ను తీసుకొచ్చింది. నెటిజన్లను ఈ గేమ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో- పానీపూరీని ఏయే రాష్ట్రాల్లో ఎలా పిలుస్తారు? దాని అమోఘమైన రుచితో అక్కడి వారిని ఎలా కట్టిపడేసింది? తదితర విషయాలు తెలుసుకుందాం రండి..
అక్కడా పానీపూరీనే!
పానీపూరీ.. తెలుగు రాష్ట్రాల్లో అది కూడా హైదరాబాద్‌లో ఈ వంటకం ఎంత ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. రవ్వ, గోధుమపిండితో తయారు చేసిన చిన్న చిన్న పూరీల్లో కాబూలీ శెనగల కూర పెట్టి, దాన్ని చింతపండు, నిమ్మరసం, ఇతర మసాలాలన్నీ కలిపి తయారుచేసిన రసంలో ముంచుకొని తాగితే.. అటు పుల్లపుల్లగా, ఇటు కారంకారంగా.. అబ్బో ఆ రుచి వర్ణనాతీతం! మరి, అలాంటి పానీపూరీని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ అదే పేరుతో పిలుస్తుంటారు. అయితే అక్కడ వాటి రుచే కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
ముంబయిలో అయితే పూరీల్లో వేడివేడి కాబూలీ శెనగల కూర, చింతపండు చట్నీ వేసి అందిస్తారు. అదే మధ్యప్రదేశ్‌కి వెళ్లినట్లయితే అక్కడ శెనగల కూరకు బదులుగా బాగా మెదిపి తయారుచేసిన బంగాళాదుంప కూర పూరీల్లో పెట్టి, దాన్ని పుల్లపుల్లటి చింతపండు రసంలో ముంచి ఇస్తుంటారు. గుజరాత్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వండిన బంగాళాదుంప కూర, తియ్యగా-పుల్లగా ఉండే చింతపండు రసంతో పాటు వడ్డిస్తారు. అదే మన పొరుగు రాష్ట్రం కర్ణాటకకు వెళ్లినప్పుడు అక్కడ ఎక్కువగా ఉల్లిపాయలతో సర్వ్ చేసిన పానీ పూరీ రుచిని ఆస్వాదించవచ్చు. ఇలా పేరు ఒకటే అయినా కొన్ని రాష్ట్రాల్లో విభిన్న రుచులతో అక్కడి ప్రజలకు చవులూరిస్తోందీ వంటకం. అంతేకాదు.. నేపాల్‌లోనూ ఇది అత్యంత ప్రఖ్యాతి గడించిన స్నాక్‌గా పేరొందింది.
ఉత్తరం వారిని అలా ఊరిస్తోంది!
మనం పానీ పూరీగా పిలుచుకునే ఈ పాపులర్ వంటకం ఉత్తర భారతదేశపు వాసులకు 'గోల్ గప్పే' అనే పేరుతో దగ్గరైంది. ఆయా రాష్ట్రాల్లో ఏ వీధిలోకి, ఏ సందు చివరకు వెళ్లినా అక్కడ కచ్చితంగా గోల్ గప్పే బండ్లు, వాటి చుట్టూ గుమిగూడిన జనం కనిపిస్తారంటేనే అర్థమవుతుంది.. అక్కడి వారికి ఇదంటే ఎంత ప్రీతో!
అయితే పేరుతో పాటు దీని రుచీ భిన్నంగానే ఉంటుంది. పూరీ తయారీలో ఏమాత్రం తేడా లేకపోయినా.. అందులో స్టఫ్ చేసే పదార్థాలన్నీ పానీ పూరీ కంటే కాస్త వేరుగానే ఉంటాయి. ఇందులో స్టఫ్ చేయడానికి ఉపయోగించే పదార్థాన్ని కాబూలీ శెనగలు, బంగాళాదుంపల మిశ్రమంతో తయారుచేస్తారు. దాంతో పాటు పుదీనా, ఇతర మసాలాలు కలిపి చేసిన రసాన్ని పానీగా అందిస్తారు.. మరికొన్ని చోట్ల రెడ్-గ్రీన్ చట్నీని కూడా సర్వ్ చేస్తారు. అయితే ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో పూరీలు గుండ్రంగా ఉంటే.. మరికొన్ని చోట్ల కాస్త పొడవుగా ఉండేలా తయారుచేయడం అక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
'పకోడీ'లు భలే స్పైసీ!
పకోడీ పేరు వినగానే మనం వర్షాకాలంలో వేడివేడిగా చేసుకొని తినే ఓ స్నాక్ ఐటమే గుర్తొస్తుంది. కానీ గుజరాత్‌లోని చాలా ప్రాంతాల్లో పానీ పూరీని 'పకోడీ'గా పిలుస్తారన్న విషయం అక్కడి వారికి తప్ప మిగతా వారికి అంతగా తెలియకపోవచ్చు. సేవ్, స్వీట్ చట్నీ, ఉల్లిపాయలతో పాటు పుదీనా-పచ్చిమిర్చితో తయారుచేసిన పానీని 'పకోడీ'లుగా స్వీకరిస్తారు అక్కడి ప్రజలు. ఇలా తియ్యతియ్యగా, కారంకారంగా, ఎంతో స్పైసీగా ఉండే ఈ పకోడీలను చూడగానే నోట్లో నీళ్లూరుతాయనడంలో సందేహం లేదు. ఇక ఆ స్పైసీనెస్‌ని ఆస్వాదిస్తే ఆ మజాయే వేరు!
స్నాక్స్ రారాజు..!
పానీ పూరీ ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బంగ, అసోంలలో 'పుచ్కా లేదా ఫుచ్కా'గా ప్రాచుర్యం పొందింది. బంగ్లాదేశ్ వాసులూ దీన్ని ఇష్టంగా తింటారు. ఇది పంచే అద్భుతమైన రుచే ఇందుకు కారణం. అయితే ఇది ఇతర రాష్ట్రాల పానీ పూరీలకన్నా కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఎక్కడైనా పూరీలు కాస్త లేత రంగులో ఉంటే, ఇక్కడ మాత్రం కాస్త పెద్దగా, ముదురు వర్ణంలో కనిపిస్తాయి. ఇక వీటిలో స్టఫింగ్ కోసం ఉడికించిన శెనగలు, మెదిపిన బంగాళాదుంపలు, మసాలాలు, చింతపండు గుజ్జు, మిర్చి, ఉప్పు తదితర పదార్థాలతో తయారుచేసిన మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. చింతపండు రసం, మసాలాలు, ఉప్పు వంటివి నీటిలో కలిపి కాస్త చిక్కగా పానీని తయారుచేస్తారు. దీన్ని ఇక్కడి వారు 'తేటుల్ జోల్'గా పిలుస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈ రెసిపీని పుల్లటి పెరుగుతోనూ వడ్డిస్తారు. ఇలా విభిన్న రుచులతో నోరూరిస్తోంది కాబట్టే అక్కడి స్నాక్స్ అన్నింట్లోకెల్లా ఇది అత్యంత పాపులారిటీని సంపాదించింది.
ఇవీ అద్భుతమైన రుచులే..!
⚛ హరియాణా వాస్తవ్యులు 'పానీ కే పటాషె'గా పిలుచుకునే ఈ స్నాక్ ఐటమ్ రుచి అచ్చం గోల్ గప్పేను పోలి ఉంటుంది. అయితే ఈ రెండింటి కోసం తయారుచేసే రసాల్లో కాస్త తేడా కనిపిస్తుంది. గోల్ గప్పే కోసం పుదీనా, మసాలాలతో కూడిన పానీ తయారుచేస్తే.. ఈ హరియాణా రుచి కోసం ఆమ్‌చూర్ పొడిని ఉపయోగిస్తారు. దీన్నే రాజస్థాన్‌లో 'పటాషి'గా పిలుచుకుంటారు.
⚛ ఈ పానీ పూరీ ఉత్తరప్రదేశ్‌లో 'పానీ కే బటాషె'గా పాపులర్ అయింది. ఇందులో భాగంగా స్టఫింగ్ కోసం మెదిపిన బంగాళాదుంపలు, కాబూలీ శెనగలతో తయారుచేసిన కూరను ఉపయోగిస్తారు. మసాలాలు, పుదీనా, కారం, ఉప్పు, చింతపండు రసం, మిరియాల పొడి.. తదితర పదార్థాలతో తయారుచేస్తారు. ఇన్ని రుచుల మిళితం కాబట్టే అక్కడి వారు 'పాంచ్ స్వాద్ కే బటాషె'గానూ దీని రుచిని ఆస్వాదిస్తారు.
⚛ ఒడిశా ప్రజలు పానీ పూరీ రుచిని 'గప్ చుప్'గా ఆస్వాదిస్తారు. మెదిపిన బంగాళాదుంపలు, ఉడికించిన బఠానీ, ఉల్లిపాయల మిశ్రమంతో కూడిన పదార్థాన్ని స్టఫింగ్ కోసం ఉపయోగిస్తారు. ఇక పానీ కోసం చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, చింతపండు రసం, జీలకర్ర పొడి, ఇతర మసాలాలు.. వంటివన్నీ నీటిలో కలిపి కాస్త చిక్కగా రసాన్ని తయారుచేస్తారు. ఇలా విభిన్న రుచులతో చవులూరిస్తోందీ యమ్మీ యమ్మీ రెసిపీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.