‘క్లౌడ్‌ స్కిన్‌’.. మీకూ కావాలా?

ప్రొఫెషనల్‌గానైనా, క్యాజువల్‌గానైనా మేకప్‌ ఇప్పుడు ప్రతి అమ్మాయి బ్యూటీ రొటీన్‌లో భాగమైపోయింది. ఈ క్రమంలోనే వివిధ రకాల మేకప్‌ ట్రెండ్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఒకరితో మరొకరు పోటీపడుతూ మరీ వీటిని ఫాలో అయిపోతున్నారు.

Published : 04 Jun 2024 12:48 IST

ప్రొఫెషనల్‌గానైనా, క్యాజువల్‌గానైనా మేకప్‌ ఇప్పుడు ప్రతి అమ్మాయి బ్యూటీ రొటీన్‌లో భాగమైపోయింది. ఈ క్రమంలోనే వివిధ రకాల మేకప్‌ ట్రెండ్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఒకరితో మరొకరు పోటీపడుతూ మరీ వీటిని ఫాలో అయిపోతున్నారు. అలాంటి ఓ మేకప్‌ ట్రెండే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అదే క్లౌడ్‌ స్కిన్‌. ఎలాంటి చర్మతత్వాల వారికైనా ఇట్టే నప్పే ఈ మేకప్‌ ట్రెండ్‌ను అనుసరించే అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతోందంటున్నారు నిపుణులు. మరి, ఏంటీ క్లౌడ్‌ స్కిన్‌? ఈ మేకప్‌ను ఎలా వేసుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

ఆయా కాలాలకు అనుగుణంగా మేకప్‌ ఉత్పత్తుల్ని ఎంచుకోవడం మనకు అలవాటే! ఈ క్రమంలోనే వివిధ రకాల మేకప్‌ ట్రెండ్స్‌ కూడా పుట్టుకొస్తున్నాయి. గ్లాసీ స్కిన్‌, వెట్‌ స్కిన్, పెర్ల్‌ స్కిన్‌.. వంటి మేకప్‌ ట్రెండ్స్‌ ఇలాంటివే! అయితే తేమ వాతావరణాన్ని తట్టుకుంటూనే.. ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే ‘క్లౌడ్‌ స్కిన్‌’ మేకప్‌ చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు సౌందర్య నిపుణులు. పొడి, జిడ్డుదనం, కాంబినేషన్‌ స్కిన్‌.. ఇలా అన్ని చర్మతత్వాల వారికీ ఈ మేకప్‌ నప్పుతుందంటున్నారు.

ఏంటీ ‘క్లౌడ్‌ స్కిన్’?

పేరుకు తగ్గట్లే మోమును ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుందీ క్లౌడ్‌ స్కిన్‌ మేకప్‌. మొటిమలు, మచ్చలు.. వంటి సౌందర్య సమస్యల్ని దాచిపెట్టి చర్మం మృదుత్వాన్ని పెంచే ఈ మేకప్‌.. ఏ చర్మతత్వానికైనా ఇట్టే నప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ జిడ్డుచర్మతత్వం ఉన్న వారికి ఇదో వరమంటున్నారు. ఎందుకంటే ఇది జిడ్డుదనాన్నే కాదు.. చెమటనూ అదుపు చేసి సహజసిద్ధమైన లుక్‌ని అందిస్తుంది. అందుకే తేమ వాతావరణంలో మేకప్‌ ఎక్కువసేపు నిలిచి ఉండాలంటే క్లౌడ్‌ స్కిన్‌ మేకప్‌ను ఎంచుకోవడం మంచిదంటున్నారు సౌందర్య నిపుణులు. అలాగే గీతల్ని, ముడతల్నీ కనిపించకుండా చేయడంతో పాటు ముఖానికి మ్యాట్‌ తరహా ఫినిషింగ్‌ని అందిస్తుంది.

ఎలా వేసుకోవాలంటే?

మేకప్‌ ఉత్పత్తులు తక్కువ స్థాయిలో ఉపయోగిస్తూ.. మోమును సహజసిద్ధంగా మెరిపించడమే ఈ మేకప్‌ ట్రెండ్‌ ప్రత్యేకత! ఇందులో భాగంగా చర్మతత్వాన్ని బట్టి తేమ స్థాయులు అధికంగా ఉండే మేకప్‌ ఉత్పత్తులు వినియోగించాల్సి ఉంటుంది.

⚛ ముందుగా చర్మతత్వాన్ని బట్టి ఎంచుకున్న హైడ్రేటింగ్‌ సీరమ్‌ను ముఖానికి అప్లై చేసుకోవాలి. పొడి చర్మం ఉన్న వారు సీరమ్‌కు బదులు మాయిశ్చరైజింగ్‌ ఫేస్‌ ఆయిల్‌ను ఉపయోగించాలి. ఆ తర్వాత ఎస్‌పీఎఫ్‌-30 విలువ గల మాయిశ్చరైజర్‌ రాసుకొని.. చర్మ రంధ్రాలు కనిపించకుండా చేసే ‘పోర్‌ బ్లరింగ్‌ ప్రైమర్‌’ అప్లై చేసుకోవాలి. దీంతో ఈ మేకప్‌కు సంబంధించి ప్రాథమిక దశ పూర్తవుతుంది. ఈ క్రమంలో చర్మం తేమగా, ముట్టుకుంటే మృదువుగా అనిపిస్తుంది.

⚛ ఇప్పుడు చర్మతత్వానికి నప్పే ఫౌండేషన్‌ను కొద్దిగా ముఖానికి అప్లై చేసుకొని.. దీని పైనుంచి లైట్‌వెయిట్‌ ఫౌండేషన్‌ను మేకప్‌ బ్రష్‌ సహాయంతో ముఖానికి సమానంగా పరచుకునేలా అప్లై చేసుకోవాలి. ఆపై కన్సీలర్‌తో టచప్‌ ఇస్తే.. ముఖంపై ఉండే మచ్చలు, పిగ్మెంటేషన్‌.. వంటి సమస్యలు కనిపించకుండా ఇది కవర్‌ చేస్తుంది. తద్వారా ముఖం చూడ్డానికి సహజసిద్ధమైన లుక్‌ని సంతరించుకుంటుంది.

⚛ ముఖ భాగాల్లో మేకప్‌ పూర్తయ్యాక బుగ్గలకు బ్లష్‌తో, ముఖం అంచుల్లో బ్రాంజర్‌తో టచప్‌ ఇవ్వడం తెలిసిందే! ఇందుకోసం క్రీమ్‌ ఆధారిత బ్లష్‌, మ్యాట్‌ ఫినిష్‌ బ్రాంజర్‌ను ఎంచుకోమంటున్నారు నిపుణులు. అది కూడా చర్మతత్వానికి నప్పేలా షేడ్స్‌ని ఎంచుకుంటే సహజసిద్ధమైన లుక్‌ని సొంతం చేసుకోవచ్చంటున్నారు. అయితే చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చుకోవాలనుకునే వారు హైలైటర్‌తో టచప్‌ ఇవ్వచ్చు. ఇందులోనూ మెరుపులు లేని న్యూడ్‌ హైలైటర్‌ని ఎంచుకుంటే మరింత న్యాచురల్‌గా కనిపించేయచ్చంటున్నారు.

⚛ పైన చెప్పిన దశలన్నీ చక్కగా పాటించినా.. కంటి మూలలు, ముక్కు, నుదురు-ముక్కును కలిపే టి-ప్రదేశంలో తుది మెరుగులద్దడం తప్పనిసరి. అప్పుడే ముఖంపై మేకప్‌ సమానంగా పరచుకొని లుక్‌ ఇనుమడిస్తుంది. ఇందుకోసం ట్రాన్‌స్లుసెంట్‌ పౌడర్‌ ఉపయోగపడుతుంది. దీంతో ముఖంపై ఆయా మూలల్లో ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తే.. సరిపోతుంది.

⚛ ఇలా క్లౌడ్‌ మేకప్‌ ముఖానికి మ్యాట్‌ తరహా లుక్‌ని అందిస్తుంది. కాబట్టి పెదాలకు కూడా మ్యాట్‌ తరహా లిప్‌స్టిక్‌నే ఎంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. చర్మతత్వానికి నప్పే షేడెడ్‌ లిప్‌స్టిక్‌తో అధరాల్ని తీర్చిదిద్దుకోవడంతో పాటు కళ్లకు కాటుక, ఐలైనర్‌తో కంటినీ తీర్చిదిద్దుకుంటే క్లౌడ్‌ స్కిన్‌ మేకప్‌ పూర్తవుతుంది.

గమనిక : ఈ మేకప్‌లో తక్కువ మొత్తంలో మేకప్‌ ఉత్పత్తుల్ని ఉపయోగించడంతో పాటు చర్మతత్వానికి నప్పేలా హైడ్రేటింగ్‌ ఉత్పత్తుల్ని వాడడం వల్ల చర్మంపై మేకప్‌ వేసుకున్నామన్న ఫీలింగ్‌ రానే రాదంటున్నారు నిపుణులు. అయినా సరే.. సాధారణ మేకప్‌లాగే దీన్ని కూడా పడుకునే ముందు తొలగించుకోవాలని వారు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్