అక్కడికెళ్లిన అమ్మాయిలు ‘బ్రా’ వేలాడదీస్తారు.. ఎందుకో తెలుసా?!
మన దగ్గర లోదుస్తుల గురించి మాట్లాడడానికి, వాటిని ఆరుబయట నలుగురికీ కనిపించేలా ఆరేయడానికి మొహమాటపడుతుంటాం. అల్మరాలోనూ ఎవరికీ కనిపించకుండా రహస్యంగా భద్రపరుస్తుంటాం. కానీ ఆ ప్రాంతంలో మాత్రం బ్రాలను అందరికీ కనిపించేలా రోడ్డు పక్కనుండే...
(Photos: Facebook)
మన దగ్గర లోదుస్తుల గురించి మాట్లాడడానికి, వాటిని ఆరుబయట నలుగురికీ కనిపించేలా ఆరేయడానికి మొహమాటపడుతుంటాం. అల్మరాలోనూ ఎవరికీ కనిపించకుండా రహస్యంగా భద్రపరుస్తుంటాం. కానీ ఆ ప్రాంతంలో మాత్రం బ్రాలను అందరికీ కనిపించేలా రోడ్డు పక్కనుండే ఫెన్సింగ్‌కు వేలాడదీస్తుంటారు. ఇలా ఒకటి, రెండు కాదు.. వేలాది బ్రాలు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. మొదట్లో కొందరు దొంగలు వీటిని దొంగిలించినా.. ఆ మరుసటి రోజుకే అంతకు రెట్టింపు బ్రాలు తిరిగి అక్కడ ప్రత్యక్షమయ్యేవి. నిజానికి ఇది ఎవరు, ఎందుకు ప్రారంభించారో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇదో పర్యటక ప్రాంతంగా అలరారుతోంది. అక్కడికెళ్లిన ప్రతి అమ్మాయీ తమ బ్రాను వేలాడదీయడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదండోయ్.. ప్రస్తుతం దీని వెనుక ఓ సేవా కార్యక్రమం కూడా కొనసాగుతోంది. మరి, ఇంతకీ ఎక్కడుందీ ప్రాంతం? బ్రాలు వేలాడదీయడం వెనకున్న అసలు కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..
కొన్ని సంప్రదాయాలు ఎవరు, ఎందుకు ప్రారంభించారో.. వాటి వెనకున్న అసలు అంతరార్థమేంటో మనకు తెలియదు.. కానీ ఓ నమ్మకంగా భావించి వాటిని ఫాలో అయిపోతుంటాం.. బ్రా వేలాడదీసే సంప్రదాయం కూడా అలాంటిదే! న్యూజిలాండ్‌లోని కార్‌డ్రోనా అనే ప్రాంతంలో 40 మీటర్ల పొడవాటి ఫెన్సింగ్ ఉంటుంది. దానికి వేల సంఖ్యలో బ్రాలు వేలాడదీసి ఉంటాయి. విభిన్న రంగులు, సైజుల్లో ఉన్న బ్రాలు దర్శనమిచ్చే ఆ చోటును బ్రా ఫెన్స్/కార్‌డ్రోనా బ్రా ఫెన్స్‌గా పిలుస్తుంటారు.
నాలుగు బ్రాలతో మొదలై..!
అయితే అసలు ఇదెలా మొదలైందో తెలుసుకోవాలంటే.. సుమారు పాతికేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే! అది 1999వ సంవత్సరం. అందరూ క్రిస్మస్-న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఓ రోజు రోడ్డు పక్కనుండే ఈ ఫెన్స్‌కు నాలుగు బ్రాలు వేలాడదీసి కనిపించాయి. ఇలా ఎవరు, ఎందుకు వేలాడదీశారో కారణం తెలియదు కానీ.. ఈ వార్త ఆ నోటా, ఈ నోటా స్థానిక ప్రజలకు పాకింది.. ఆపై అక్కడి మహిళలు ఒక్కొక్కరుగా ఇక్కడికి రావడం, తాము ధరించిన బ్రాను తొలగించి ఇక్కడ వేలాడదీసి వెళ్లిపోవడం మొదలైంది. కొన్ని రోజుల్లోనే ఈ బ్రాల సంఖ్య వందలు దాటింది. ఎన్ని తొలగించినా.. అంతకు రెట్టింపు సంఖ్యలో బ్రాలు అక్కడ కనిపించేవి. కొన్నిసార్లు వందల సంఖ్యలో బ్రాలను దొంగలు దోచుకెళ్లేవారట! అయినా వాటి సంఖ్య పెరిగిందే కానీ తరగలేదు. నిజానికి ఇలా దొంగతనం జరిగాక ఈ ప్రదేశం మరింత పాపులర్ అయిందని చెబుతారు స్థానికులు. అప్పట్నుంచి ఇక్కడికి పర్యటకుల తాకిడీ ఎక్కువైందట! ఇక్కడికొచ్చే అమ్మాయిలు కచ్చితంగా తాము ధరించిన బ్రాను విప్పి.. ఇక్కడి ఫెన్స్‌కు వేలాడదీయందే వెనుదిరగరట! ఇలా ఈ ప్రాంతానికి వచ్చిన పాపులారిటీతో కార్‌డ్రోనాగా ఉన్న ఈ ప్రాంతం పేరు కాస్తా బ్రాడ్రోనాగా మారిపోవడం గమనార్హం!
ప్లేస్ మారినా పాపులారిటీ తగ్గలేదు!
అయితే ఈ ఫెన్స్ రోడ్డు పక్కనే ఉండడం, దీనికి వేలాది సంఖ్యలో బ్రాలు వేలాడుతుండడంతో.. ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఆపి మరీ ఫొటోలు, వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టారట! మరికొంతమంది కాసేపు అక్కడే ఆగి సేదదీరేవారట! దీంతో అక్కడ ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయని, అందుకే ఈ ఫెన్స్‌ను అక్కడ్నుంచి ఆ పక్క వీధికి మార్చినట్లు స్థానికులు చెబుతారు. అయినా దీని పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదంటున్నారు. ఏదేమైనా కాలక్రమేణా ఈ పర్యటక ప్రదేశాన్ని గుర్తించిన ‘న్యూజిలాండ్ బ్రెస్ట్‌క్యాన్సర్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఇదే వేదికగా రొమ్ముక్యాన్సర్ నిధుల సేకరణ కార్యక్రమాన్నీ చేపట్టడం మొదలుపెట్టింది. ఇందుకోసం ఈ ఫెన్స్ మధ్యలో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ఫ్లెక్సీని ఏర్పాటుచేసి.. ఆ పక్కనే ఓ గులాబీ రంగు డొనేషన్ బాక్స్‌నీ ఏర్పాటుచేసింది. అక్కడికెళ్లిన పర్యటకులు.. తమ బ్రాలను వేలాడదీయడంతో పాటు తమకు తోచినంత డబ్బును ఈ బాక్స్‌లో వేయచ్చు. ఇలా పోగైన డబ్బును అక్కడి రొమ్ము క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం వినియోగిస్తోందీ ఎన్జీవో.
నిజానికి ఎవరు, ఎందుకు ఈ బ్రా ఫెన్స్ ప్రారంభించారో తెలియదు కానీ.. ప్రస్తుతం ఓ మంచి పనికి ఈ పర్యటక ప్రాంతం వేదికైంది.. అంటున్నారు అక్కడికి వెళ్లొచ్చిన వారు. ఈ బ్రా ఫెన్స్ లాగే.. షూ ఫెన్స్, టూత్‌బ్రష్ ఫెన్స్.. వంటివీ న్యూజిలాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొలువుదీరాయట! అయినా బ్రా ఫెన్స్‌కు వచ్చినంత పాపులారిటీ మాత్రం వీటిలో దేనికీ దక్కలేదంటున్నారు స్థానికులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.