Published : 20/01/2023 20:58 IST

Abortions: జాగ్రత్తగా లేకపోతే ఈ సమస్యలు తప్పవు!

లైంగిక హింస, సురక్షితమైన గర్భనిరోధక సాధనాలు/పద్ధతులు పాటించకపోవడం.. ఇలా కారణమేదైనా అవాంఛిత గర్భం దాల్చడం, సమాజానికి/కుటుంబానికి భయపడి గుట్టు చప్పుడుకాకుండా ఇంట్లోనే తమకు తామే అబార్షన్‌ చేసుకునే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే ఇలాంటి అసురక్షితమైన అబార్షన్ల కారణంగా ఏడాదికి సుమారు యాభై వేల మంది మహిళలు మృత్యువాత పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అంతేకాదు.. ఇలాంటి స్వీయ వైద్యం భవిష్యత్తులో సంతానలేమితో పాటు ఇతర ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకూ కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసురక్షితమైన అబార్షన్ల కారణంగా ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం రండి..

ఇన్ఫెక్షన్‌తో సంతానలేమి!

ఇంట్లోనే అబార్షన్‌ చేసుకునే క్రమంలో మాత్రలు వాడడం, లేదంటే ఇతర పరికరాల్ని ఉపయోగించడం వల్ల గర్భాశయం పూర్తిగా శుభ్రపడకపోవచ్చు. తద్వారా అధిక రక్తస్రావం, జననాంగాల్లో ఇన్ఫెక్షన్‌.. వంటి తీవ్ర సమస్యలు తలెత్తచ్చు. ఇది క్రమంగా గర్భాశయం వరకు పాకి సంతానలేమికి సైతం దారితీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇన్ఫెక్షన్‌ మూలంగా రక్తం కలుషితమవడం, ఇది శరీరమంతా పాకి ప్రాణ సంకటం కూడా కావచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అసురక్షిత గర్భస్రావాలకు పూర్తి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు.

అధిక రక్తస్రావంతో ముప్పు!

స్వీయ అబార్షన్లు అధిక రక్తస్రావానికి దారితీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. దీన్నే Hemorrhageగా పేర్కొంటున్నారు. ఇలాంటి అసురక్షిత పద్ధతుల వల్ల ఒక్కోసారి రక్తనాళాలు డ్యామేజ్‌ అయి అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదమూ ఉందంటున్నారు. ప్రాణాల మీదకు వచ్చే దాకా ఈ సమస్యను గుర్తించలేం.

అలాగే గర్భస్రావం చేసుకోవడమంటే బలవంతంగా నెలసరిని ప్రారంభించడమే! ఈ క్రమంలో అయ్యే బ్లీడింగ్‌ని అదుపు చేయడం కష్టమే అంటున్నారు నిపుణులు. ఇలా ఈ రెండు పద్ధతుల కారణంగా ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోయి రక్తహీనత తలెత్తడంతో పాటు అవయవాలకు రక్తం, ఆక్సిజన్‌ అందక అవి దెబ్బతినడం, ఒక్కోసారి ప్రాణాలకూ ముప్పు వాటిల్లచ్చని చెబుతున్నారు.

మోతాదుకు మించితే విషమే!

స్వీయ అబార్షన్లలో భాగంగా కొంతమంది హెర్బల్‌ పద్ధతుల్ని అనుసరిస్తుంటారు. ఇవి సహజసిద్ధమైనవే కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవన్నది వారి భావన. అయితే వీటివల్ల కూడా పలు తీవ్ర అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. మోతాదుకు మించి వీటిని తీసుకోవడం వల్ల అవి మేలు చేయడానికి బదులు విషపూరితంగా మారే ప్రమాదమే ఎక్కువంటున్నారు. ఈ క్రమంలో వీటిలోని అదనపు టాక్సిన్లు, ఇతర సమ్మేళనాలను వేరుచేసి తొలగించే క్రమంలో కాలేయంపై అధిక ఒత్తిడి పడుతుంది. తద్వారా అది డ్యామేజ్‌ అవడం లేదంటే పూర్తిగా దెబ్బతినే ప్రమాదమూ లేకపోలేదట!

ఇలా గుర్తించచ్చు!

ఒకవేళ తెలిసో తెలియకో ఇంట్లోనే స్వీయ గర్భస్రావ పద్ధతులు ఉపయోగించినా.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా ఇతర దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. ఇంతకీ అవేంటంటే..!

గంటగంటకూ శ్యానిటరీ న్యాప్‌కిన్‌ మార్చుకునేంత రక్తస్రావమవడం..

మూత్ర-మల విసర్జనలో రక్తం కనిపించడం..

పొత్తి కడుపులో తీవ్ర నొప్పి..

విపరీతమైన నీరసం/అలసట, స్పృహ కోల్పోవడం..

జ్వరం, ఎక్కువగా చెమటలు పట్టడం..

చర్మం పాలిపోయినట్లుగా/పసుపు రంగులోకి మారడం..

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించి వెంటనే డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం వల్ల కొంతవరకు ఫలితం ఉండచ్చు.

ఈ ప్రత్యామ్నాయాలు మంచివి!

సమాజానికి భయపడి లేదంటే ఇతర కారణాల రీత్యా స్వీయ అబార్షన్లు చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకునే కంటే వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే గర్భాన్ని తొలగించుకోవడం అత్యుత్తమమైన పద్ధతి అని చెబుతున్నారు నిపుణులు. గర్భం ధరించిన ప్రారంభ వారాల్లో వైద్యుల సలహా మేరకు నోటి మాత్రలు, వెజైనా వద్ద కరిగిపోయే మాత్రలు.. ఉపయోగించచ్చు. కాస్త ఆలస్యమైతే మాత్రం వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స పద్ధతిలో గర్భాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని