Updated : 26/09/2022 21:02 IST

Vaginismus: అక్కడి కండరాలు బిగుతుగా మారుతుంటే...

లైంగికంగా ఎలాంటి సమస్యల్లేకుండా ఉన్నప్పుడే దాంపత్య బంధం దృఢమవుతుంది. అయితే కొన్ని సమస్యలు ఎలా, ఎటు నుంచి దాడి చేస్తాయో తెలియదు.. కానీ వాటిని మనం నియంత్రించుకోలేం..! ‘వెజైనిస్మస్‌’ కూడా అలాంటి సమస్యే అంటున్నారు నిపుణులు. వెజైనా దగ్గర కండరాలు వాటంతటవే బిగుతుగా మారే స్థితి ఇది! స్వయంగా నియంత్రించుకోలేని ఈ సమస్య మహిళల శృంగార జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి, దీనికి కారణాలేంటి? ఈ సమస్యకు పరిష్కారముందా?

తాకినా సమస్యే!

సాధారణంగానే వెజైనా కాస్త బిగుతుగా ఉంటుంది. అవసరమైనప్పుడు సాగుతుంటుంది. కానీ కొంతమందిలో ఇక్కడ తాకినా, కలయికలో పాల్గొన్నా, ట్యాంపూన్లు-మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ వాడినా.. అక్కడి కండరాలు మరింత బిగుతుగా మారుతుంటాయి.. ఫలితంగా విపరీతమైన నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి స్థితిని ‘వెజైనిస్మస్‌’ అంటారు.

భయమే కారణమా?

మన ప్రమేయం లేకుండా ఉన్నట్లుండి ఇలా వెజైనా కండరాలు బిగుతుగా మారడానికి వివిధ కారణాలుంటాయంటున్నారు నిపుణులు.

లైంగిక వేధింపులు, అత్యాచారం.. వంటివి జరిగినప్పుడు మనసులో ఒక రకమైన భయం నెలకొంటుంది. ఇది కూడా వెజైనా బిగుతుగా మారడానికి ఓ కారణం కావచ్చంటున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించి.. తామెదుర్కొన్న పరిస్థితి గురించి వివరించడంతో పాటు తగిన చికిత్స తీసుకోవడం మంచిదంటున్నారు.

కొన్ని కేసుల్లో బలవంతంగా శృంగారంలో పాల్గొన్నా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందట!

కలయిక సమయంలో నొప్పి వల్ల కొంతమంది భయాందోళనలకు గురవుతుంటారు. ఇదిలాగే కొనసాగితే కొన్ని రోజులకు వెజైనిస్మస్‌ సమస్యకు దారి తీస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఆపరేషన్లు/వెజైనా దగ్గర సర్జరీ కావడం.. ఇలాంటప్పుడు ఆయా అవయవాలు పూర్తిగా నయమయ్యే దాకా శృంగారం చేయకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఒకవేళ బలవంతంగా చేస్తే వెజైనా కండరాలు బిగుతుగా మారే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు.

సహజ ప్రసవం జరిగేటప్పుడు.. కొంతమందికి వెజైనాకు ఇరువైపులా కట్‌ చేయడం సహజమే! ఇలాంటప్పుడు భయాందోళనలకు గురవడం, పూర్తిగా నయం కాకముందే శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుందట!
ఇవనే కాదు.. కొంతమందిలో ఇలాంటి ప్రత్యక్ష కారణాలు లేకుండానే ఈ సమస్య వస్తుందట! అందుకే లైంగిక సమస్యల గురించి డాక్టర్‌కి వివరించడంతో పాటు సంబంధిత పరీక్షలు చేయించుకుంటేనే అసలు కారణమేంటో తెలుస్తుందంటున్నారు నిపుణులు.

ఆ థెరపీ తీసుకోవాల్సిందే!

కారణమేదైనా వెజైనిస్మస్‌ సమస్య శృంగార జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుదంటున్నారు నిపుణులు. ఇలాంటప్పుడు కపుల్‌ థెరపీ/సెక్సువల్‌ థెరపీ మేలు చేస్తుందంటున్నారు. దీన్ని ఒంటరిగా లేదంటే జంటగా తీసుకోవచ్చు. ఈ క్రమంలో మీ సమస్యను నిర్మొహమాటంగా నిపుణులకు తెలియజేయడం మాత్రం తప్పనిసరి!

మీ సమస్యను బట్టి.. వెజైనా దగ్గర నొప్పి లేకుండా ఉండేందుకు కొన్ని క్రీములు కూడా సూచిస్తారు వైద్యులు.

ఈ సమస్య నుంచి బయటపడి లైంగిక జీవితాన్ని ఆస్వాదించడానికి వెజైనల్‌ డైలేటర్స్‌ కూడా మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. వీటిని వైద్యుల సూచనతో వాడడం వల్ల అక్కడి కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారి.. నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చుట.

కటి వలయంలోని కండరాలు వదులుగా, ఫ్లెక్సిబుల్‌గా మారడానికి నిపుణుల సలహా మేరకు కొన్ని రకాల వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది.

శృంగారంతోనే అనుబంధం దృఢమవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలను, ఇతర లైంగిక అనారోగ్యాల్ని నిర్మొహమాటంగా వైద్యులకు వివరించి.. తగిన చికిత్స తీసుకోవడం వల్ల ఇటు ఆరోగ్యం, అటు అనుబంధం.. రెండూ దృఢమవుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని