Published : 15/02/2023 00:19 IST

ఆ వేలంలో.. ఎవరామె?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలం.. రెండ్రోజులుగా దేశంలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చంతా! అందరూ ఊహించినట్టుగా ఏ ఫ్రాంఛైజీ ఏ క్రికెటర్‌ని దక్కించుకుంది అనేకాదు.. మరొకరి గురించీ నెట్టింట అభిమానులు తెగ వెదికారు. ఆవిడే.. మల్లికా సాగర్‌! ఇంతకీ ఎవరీమె?

తొలిసారి బీసీసీఐ మహిళా ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) నిర్వహిస్తోంది. రూ.కోట్లు చెల్లించి అయిదు ఫ్రాంఛైజీలు మహిళా క్రికెటర్లను చేజిక్కించుకున్నారు. ఆ వేలాన్ని నిర్వహించింది మల్లికా సాగర్‌! దేశ ఫ్రాంఛైజీ క్రికెట్‌ చరిత్రలోనే ఓ మహిళ వేలం నిర్వహించడం ఇదే తొలిసారి. టీవీ ముందు కోట్లమంది ప్రేక్షకులు, వేదిక ఎదుట పెద్ద వ్యాపారవేత్తలు, ప్రముఖులు. అయినా ఏమాత్రం బెరుకు లేకుండా పొరపాటుకు తావివ్వకుండా ఆత్మవిశ్వాసంతో కార్యక్రమం విజయవంతంగా పూర్తిచేసి శభాష్‌ అనిపించుకుంది. దీంతో తన పేరు నెట్టింట మారుమోగిపోయింది.

ముంబయికి చెందిన మల్లిక.. ‘ఆర్ట్‌ ఇండియా కన్సల్టెంట్స్‌’లో పనిచేస్తున్నారు. ఆధునిక, సమకాలీన భారత కళాకృతులను సేకరించడం ఆమె వృత్తి. 48 ఏళ్ల మల్లిక.. 2001లో న్యూయార్క్‌లో ప్రఖ్యాత మోడరన్‌ ఇండియన్‌ ఆర్ట్‌ వేలం నిర్వహించిన తొలి భారత సంతతి మహిళా ఆక్షనీర్‌ కూడా. 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌కు ఆక్షనీర్‌గా వ్యవహరించి, ప్రశంసలు అందుకున్నారు. ‘క్రికెట్‌ ప్రేమికురాలినే అయినా కళాకృతులు, క్రీడ రెండూ భిన్నం. అవగాహన కోసం అనుభవజ్ఞుడు, గతంలో నిర్వహించిన హ్యూగ్‌ ఎడ్మీడ్స్‌ వీడియోలు చూశా. డబ్ల్యూపీఎల్‌ వేలం నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నా. డబ్ల్యూపీఎల్‌ చరిత్ర సృష్టిస్తుందనీ.. ఈ లీగ్‌ మహిళలకు నూతన అవకాశాలు కల్పించడంతోపాటు ఎంతోమందికి ఆటలను కెరియర్‌గా ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నా’నని ఆశాభావం వ్యక్తం చేశారామె.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని