అందుకే కాసేపు కునుకు తీయాలట!

రోజూ రాత్రిపూట కనీసం ఏడెనిమిది గంటలు సుఖంగా నిద్ర పోవడం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా

Updated : 06 Apr 2022 16:08 IST

రోజూ రాత్రిపూట కనీసం ఏడెనిమిది గంటలు సుఖంగా నిద్ర పోవడం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతుంటారు నిపుణులు. ఇదేవిధంగా మధ్యాహ్నం కాసేపు నిద్రకు ఉపక్రమిస్తే మెదడు ఆరోగ్యం మెరుగుపడి మరింత చురుగ్గా పనిచేసే అవకాశం కూడా ఉందంటున్నారు వారు.

అలాంటప్పుడు ఐదు నిమిషాలు చాలు!

సాధారణంగా వయసు పైబడిన వారు, తమ ఉద్యోగాల నుంచి రిటైర్‌ అయిన వారు ఇంట్లో ఉంటారు కాబట్టి వారికి మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చే సమయం దొరుకుతుంది. కానీ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మధ్యాహ్నం కాసేపు నిద్ర పోదామంటే సమయం ఉండదు. అలాంటప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు కళ్లు మూసుకొని రిలాక్సయినా చాలంటున్నారు మానసిక నిపుణులు. తద్వారా మనసులోని ఒత్తిళ్లన్నీ మటుమాయమైపోతాయట.. ఇక ఆపై పనంతా చురుగ్గా చేసేస్తారంటున్నారు నిపుణులు. అలాగని సమయం దొరికిన వారు గంటల తరబడి పడుకున్నా తిరిగి రాత్రుళ్లు నిద్ర పట్టదు. ఇది క్రమంగా నిద్రలేమికి దారితీస్తుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుందట!

* మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుందంటున్నారు నిపుణులు. అలాగే ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చట!

* ఉదయం నుంచి పనితో సతమతమైనా, డల్‌గా రోజు ప్రారంభమైనా.. మధ్యాహ్నం కొద్దిసేపు కునుకు తీయండి. తద్వారా మనసు ఉత్సాహంతో ఉరకలెత్తుతుందట! పనిలో చురుకుదనం కూడా పెరుగుతుందంటున్నారు నిపుణులు.

* ఒత్తిడి మన రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరి, దాన్ని దూరం చేసుకోవాలన్నా మధ్యాహ్నం కునుకు తీయడం మంచి మార్గమంటున్నారు నిపుణులు. తద్వారా రోగనిరోధక శక్తి క్షీణించకుండా జాగ్రత్తపడచ్చు.

* మధ్యాహ్నం కాసేపు కునుకు తీసే వారిలో రక్తపోటు అదుపులో ఉంటుందని, తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

* మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని, తద్వారా సృజనాత్మకత పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

* వయసు పైబడిన వారు రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, రాత్రుళ్లు హాయిగా నిద్ర పోవాలన్నా అది మధ్యాహ్నం కునుకు వల్ల కూడా సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల్లోపు అరగంట నిద్ర పోవడం, సాయంత్రం నడక, చిన్నపాటి వ్యాయామాలు చేయడం వల్ల రాత్రి నిద్రలేమితో బాధపడే సమస్య తప్పుతుందని కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి. అలాగే అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎలాంటి సమస్యలు తలెత్తవట!

హాయిగా నిద్ర పట్టాలంటే..!

* ఐదు నిమిషాలైనా, అరగంటైనా.. మధ్యాహ్నం హాయిగా కునుకు పట్టాలంటే కెఫీన్‌కు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది నిద్రను దూరం చేసి ఒత్తిడిని పెంచుతుందట!

* అమ్మో ఇప్పుడు పడుకుంటే గాఢ నిద్రలోకి జారిపోతామేమో అనుకునే వారు.. మీరు పడుకోవాలనుకున్న సమయాన్ని బట్టి అలారం సెట్‌ చేసుకుంటే సరిపోతుంది. తద్వారా అటు కునుకు తీసినట్లుంటుంది.. ఇటు సమయానికి నిద్ర లేచి పని మీదా దృష్టి పెట్టచ్చు.

* పగలైనా, రాత్రైనా హాయిగా నిద్ర పట్టాలంటే ధ్యానం చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. కాబట్టి కునుకు తీయడానికి ముందు ఓ పది నిమిషాల పాటు కళ్లు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టారంటే మనసూ రిలాక్సవుతుంది.. హాయిగా నిద్ర కూడా పడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్