Adventure Couple: శిఖరం అంచున పెళ్లి.. ఆపై స్కై డైవింగ్!

వేల మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరం అంచు నుంచి కిందికి దూకుతూ.. తమ ప్రేమ, పెళ్లిని అందమైన జ్ఞాపకంగా మార్చుకుందీ జంట. ఇలా ఈ న్యూ కపుల్‌ చేసిన సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Published : 31 Jul 2023 12:44 IST

(Photos: Instagram)

పెళ్లంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడడమే కాదు.. ఆ జన్మాంతం గుర్తుండిపోయేలా జరుపుకొంటున్నారు ఈ కాలపు జంటలు. ఈ క్రమంలో కొందరు సాహసాలు చేయడానికీ వెనకాడట్లేదు. శిఖరం అంచున నిల్చొని ఉంగరాలు మార్చుకోవడం, నీటి అడుగున బాసలు చేసుకోవడం, పర్వాతారోహణ చేసి మరీ పెళ్లి చేసుకోవడం.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో వెడ్డింగ్‌ ట్రెండ్‌. ఇలాంటి సాహసోపేతమైన పెళ్లితో తాజాగా వార్తల్లోకెక్కిందో అమెరికన్‌ జంట. అందరికంటే మరో నాలుగాకులు ఎక్కువే చదివిన వీరు.. స్కైడైవ్‌ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. వేల మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరం అంచు నుంచి కిందికి దూకుతూ.. తమ ప్రేమ, పెళ్లిని అందమైన జ్ఞాపకంగా మార్చుకుందీ జంట. ఇలా ఈ న్యూ కపుల్‌ చేసిన సాహసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ప్రిసిల్లా యాంట్‌, ఫిలిప్పో లెక్వెర్స్‌.. టెక్సాస్‌కు చెందిన ఈ జంటకు సాహసాలంటే ఇష్టం. ఈ మక్కువతోనే విభిన్న సాహసకృత్యాల్నే తమ కెరీర్‌గా మలచుకున్నారీ ఇద్దరూ! వీరిలో ప్రిసిల్లా.. స్పీడ్‌ఫ్లైయింగ్‌, బేస్‌ జంపింగ్‌, వింగ్‌ సూటింగ్‌, స్కైడైవింగ్‌, స్టంట్స్‌.. వంటి పలు సాహస క్రీడల్లో రాణిస్తోంది. మరోవైపు ఫిలిప్పో.. నైట్‌ స్పీడ్‌ఫ్లైయర్‌, డిజిటల్‌ క్రియేటర్‌గా కొనసాగుతున్నాడు. స్కైడైవింగ్‌లోనూ ఫిలిప్పోకు అనుభవం ఉంది.

ఆ జన్మాంతం గుర్తు పెట్టుకునేలా..!

అయితే సాహసాల్నే ఊపిరిగా భావించే ఈ జంట.. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఇక తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవాలని భావించిన వీరు.. పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే అందరిలా వేదికపై పెళ్లి చేసుకుంటే అందులో కొత్తేముంది? అనుకున్నారో ఏమో.. సాహసం చేస్తూ మరీ వివాహబంధంలోకి అడుగుపెట్టాలనుకున్నారు ప్రిసిల్లా, ఫిలిప్పో. ఇలా తమ పెళ్లిని ఆ జన్మాంతం గుర్తు పెట్టుకునేలా మలచుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే స్కైడైవింగ్‌ వెడ్డింగ్‌ని ఎంచుకుందీ జంట. ఈ ఆలోచననే ఆహ్వాన పత్రికలో పొందుపరిచి మరీ.. అతిథుల్ని ఆహ్వానించారీ క్యూట్‌ కపుల్‌. ఇక ఈ వేడుక కోసం పెళ్లి దుస్తుల్లో ముస్తాబైన ఈ జంట.. అతిథులతో కలిసి కొన్ని వేల మీటర్ల ఎత్తైన ఓ శిఖరాగ్రానికి చేరుకుంది. అందరి సమక్షంలో తొలుత శిఖరం అంచున నిల్చొని.. ఉంగరాలు మార్చుకున్న ఈ జంట.. ఆపై స్కైడైవ్‌కి సిద్ధపడింది.

అతిథుల్నీ భాగం చేస్తూ..!

అయితే ఈ స్కైడైవ్‌ వెడ్డింగ్‌లో వధూవరులే కాదు.. అతిథుల్నీ భాగం చేయాలనుకున్నారు ప్రిసిల్లా, ఫిలిప్పో. ఈ ఆలోచనతోనే.. తమతో పాటు స్కైడైవింగ్‌లో అనుభవం ఉన్న మరో ఇద్దరు అతిథులతో కలిసి శిఖరాగ్రం అంచున గుండ్రంగా నిల్చొని ఒకరి చేయి మరొకరు పట్టుకున్నారు. ఆపై రడీ.. 1..2..3.. అనే లోపే అందరూ ఒక్కసారిగా దూకేశారు. అలా గాల్లో కొంత సేపు విహరించగానే ప్యారాచూట్‌ తెరుచుకోవడంతో.. ఆ లొకేషన్‌ని మరింత సేపు ఎంజాయ్‌ చేశారు. ఇలా మొత్తానికి తాము అనుకున్నట్లుగానే పెళ్లి సక్సెసవడంతో అటు ఆనందాన్ని, ఇటు బోలెడన్ని మధురానుభూతుల్నీ మూటగట్టుకుందీ కొత్త జంట. ‘మా ప్రత్యేక నైపుణ్యాలే ఈ సాహసం చేసేందుకు ప్రేరేపించాయి. ప్రతి సాహసం వెనుకా ఓ అందమైన జీవితం ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశాయి..’ అంటూ తమ అడ్వెంచర్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయారీ క్యూట్‌ కపుల్.

వీడియో వైరల్!

కాస్త ఎత్తున్న భవంతిపై నిల్చొని కిందికి చూస్తేనే కళ్లు తిరుగుతాయ్‌.. అలాంటిది వేల మీటర్ల ఎత్తున్న శిఖరం అంచు నుంచి ఈ కొత్త జంట స్కైడైవ్‌ చేసిన వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ‘ఈ జంట సాహసం నాకెంతో నచ్చింది.. నా పెళ్లిలోనూ ఇలాంటి సాహసం ప్రయత్నిద్దామనుకుంటున్నా.. కానీ నాకంత ధైర్యం లేదు.. కొత్త జంటకు కంగ్రాట్స్‌!’ అంటూ మరికొందరు సరదాగా స్పందిస్తున్నారు. ఏదేమైనా ప్రిసిల్లా, ఫిలిప్పోకు స్కైడైవింగ్‌ అనుభవం ఉంది కాబట్టి.. వాళ్లు ఈ సాహసం చేయగలిగారు.. అంతేకానీ.. పేరు కోసం ఎలాంటి అనుభవం లేకుండా ఇలాంటి సాహసాలు చేయడం, కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం.. కూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నిజమేగా మరి?!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని