కృత్రిమ కాలితో.. ఐదు నెలల గర్భంతోనే వాలీబాల్ ఆడేస్తోంది!

నెలలు నిండుతున్నా మారథాన్‌లు, పరుగు పందేల్లో పాల్గొనే పలువురు మహిళల గురించి మనం వింటుంటాం. కానీ ఐదు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళ ఏకంగా వాలీబాల్‌ ఆడుతోంది. పారాలింపిక్స్‌లో పతకం కోసం పాదరసంలా కదులుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమే అమెరికాకు చెందిన పారా అథ్లెట్‌ లోరా జెస్సికా వెబ్‌స్టర్.

Updated : 03 Sep 2021 19:14 IST

నెలలు నిండుతున్నా మారథాన్‌లు, పరుగు పందేల్లో పాల్గొనే పలువురు మహిళల గురించి మనం వింటుంటాం. కానీ ఐదు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళ ఏకంగా వాలీబాల్‌ ఆడుతోంది. పారాలింపిక్స్‌లో పతకం కోసం పాదరసంలా కదులుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమే అమెరికాకు చెందిన పారా అథ్లెట్‌ లోరా జెస్సికా వెబ్‌స్టర్.

ఐదు నెలల గర్భంతో!

నెలలు నిండుతున్న కొద్దీ సుకుమారంగా మారిపోతుంటారు గర్భిణులు. కడుపులోని బిడ్డకు అసౌకర్యం కలుగుతుందేమోనని ఎక్కువ సమయం విశ్రాంతికే ప్రాధాన్యమిస్తుంటారు. కానీ 35 ఏళ్ల లోరా ఐదు నెలల గర్భంతో టోక్యోలోకి అడుగుపెట్టింది. ఐదో పారాలింపిక్స్‌ పతకాన్ని సాధించడం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఇలా గర్భంతో ఆటల పోటీల్లో పాల్గొనడం లోరాకు కొత్తేమీ కాదు. గతంలో ఓసారి పారాలింపిక్స్‌లో, మరోసారి ఓ అంతర్జాతీయ క్రీడా పోటీల్లోనూ ఇలాగే గర్భంతోనే పాల్గొంది.

బోన్‌ క్యాన్సర్‌ బారిన పడి!

ఇప్పటికే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన లోరాది అరిజోనాలోని ఫీనిక్స్‌. ఆస్టియోజెనిక్ సర్కోమా (ఎముకల క్యాన్సర్‌) కారణంగా 11 ఏళ్ల వయసులోనే ఆమె ఎడమ కాలు దెబ్బతింది. దీనికి ‘రొటేషన్ ప్లాస్టీ’ అనే శస్త్రచికిత్స చేయించుకుంది. దీని చికిత్సలో భాగంగా తన ఎడమ కాలి మధ్యలో భాగాన్ని తీసేసి చీలమండ కీలును పైకి జరిపి దాన్ని 180 డిగ్రీల కోణంలో తిప్పుతారు. అప్పుడది మోకాలి స్థానంలో ఉంటుంది. దీనివల్ల ఆమె ఎడమ కాలు కుచించుకుపోయినట్లు కనిపిస్తూ పాదం వెనక్కి తిరిగి ఉంటుంది.

పతకాల వేట కొనసాగిస్తూ!

ఇలా కృత్రిమ కాలుతోనే పాఠశాలకు వెళ్లిన లోరా అక్కడే వాలీబాల్‌పై ఆసక్తి పెంచుకుంది. ఆ తర్వాత కాలేజీ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. 2003 వరకు ప్రోస్థటిక్ కాలుతో నిలబడి వాలీబాల్‌ ఆడిన లోరా ఆ తర్వాత కూర్చొని ఆడే వాలీబాల్‌పై దృష్టి సారించింది. అదే ఏడాది ‘పారపన్‌ అమెరికన్‌ గేమ్స్‌లో’ బంగారు పతకం గెల్చుకుని తన క్రీడా ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది. ఆ మరుసటి ఏడాదే ఏథెన్స్ పారాలింపిక్స్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. 2008, 2012 పారాలింపిక్‌్బలలో రజత పతకాలు గెల్చుకుంది. 2016 రియో పారాలింపిక్స్‌లో పసిడిని ముద్దాడింది. 2018 పారా వాలీబాల్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రజతం మెడలో వేసుకుంది.

18 ఏళ్లుగా ఆడుతున్నా!

ఇలా ఇప్పటికే నాలుగు పారాలింపిక్స్‌ పతకాలను మెడలో వేసుకున్న లోరా ఇప్పుడు ఐదో పతకం కోసం కృషి చేస్తోంది. అది కూడా ఐదు నెలల గర్భంతో. ‘వాలీబాల్‌ కోర్టులో ఉంటే పాయింట్లు సాధించినప్పుడు వచ్చే కిక్‌ తప్ప...నేను గర్భవతినన్న విషయం చాలావరకు గుర్తుండదు. నేను 18 ఏళ్లుగా ఈ ఆట ఆడుతున్నాను. అందుకు తగ్గట్టుగా నా శరీరాన్ని, మైండ్‌ను మార్చుకున్నాను. అందుకే గర్భంతో ఆడుతున్నప్పుడు కూడా పెద్ద కష్టమనిపించదు. అయితే కోర్టులో డైవింగ్‌ చేస్తున్నప్పుడు నేరుగా కడుపుపై భారం పడకుండా జాగ్రత్త పడతాను. నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకు నా కడుపులోని బిడ్డకు ఏమీ కాదని నాకు తెలుసు’ అంటుందీ సూపర్‌ మామ్.

నేను నా వైకల్యాన్ని దాచుకోలేను!

ఇక తన వైకల్యాన్ని అధిగమించడం గురించి మాట్లాడుతూ ‘కొన్నేళ్ల క్రితం నేను ఓ బీచ్‌కు వెళ్లాను. అక్కడ ఓ మహిళను కలిశాను. సాధారణంగా బీచ్‌ అంటే అందరూ షార్ట్స్‌లో కనిపిస్తారు. కానీ ఆమె మాత్రం పూర్తి దుస్తులు ధరించి ఉంది. అసలు కారణం అడిగితే ఆమె కూడా నాలాగే దివ్యాంగురాలని తెలిసింది. కానీ అది నలుగురికీ తెలియడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే సుమారు 35 ఏళ్లుగా అసలు షార్ట్స్‌నే ధరించడం లేదట. అయితే ఆమెలా నేను నా వైకల్యాన్ని దాచుకోలేను. మన శారీరక లోపం మన ఆశయాలు, లక్ష్యాలను ప్రభావితం చేయకూడదు. శారీరకంగా ఎలాంటి వైకల్యాలు లేని వ్యక్తులకు ఎలాంటి కలలు ఉంటాయో దివ్యాంగులకు కూడా అలాంటి ఆశయాలే ఉంటాయి. అయితే వాటిని ఎలా అందుకుంటామన్నదే ఇక్కడ ప్రధాన తేడా. మన ప్రయత్నాలు ఎంత బలంగా ఉంటే అంత త్వరగా మన లక్ష్యాన్ని అందుకుంటాం’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది లోరా.

ఇక లోరా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే... 2010లో పాల్‌ బార్గెలినిని ఆమె వివాహం చేసుకుంది. వీరికి మడి(10), కోల్‌ (8), కైల్‌ (6) అనే ముగ్గురు పిల్లలున్నారు. త్వరలోనే నాలుగోసారి అమ్మగా ప్రమోషన్‌ పొందనుందీ సూపర్‌ మామ్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్