పాత ఫర్నిచర్‌కు కొత్త హంగులద్దుతూ.. లక్షలు సంపాదిస్తోంది!

ఇంట్లో పాతబడిపోయిన ప్రతిదీ వృథాగానే పరిగణిస్తాం. ఫర్నిచర్‌తో సహా! కొంతమంది వీటిని తక్కువ ధరకు అమ్మేసి కొత్తవి కొనుగోలు చేస్తే.. మరికొందరు పాతవి మాకెందుకులే అన్నట్లుగా బయటపడేస్తుంటారు. ఇలాంటి ఫర్నిచర్‌ పీసెస్‌ కొన్నిసార్లు రోడ్డు పక్కన కూడా దర్శనమిస్తుంటాయి.

Updated : 20 Jun 2024 14:33 IST

(Photos: Instagram)

ఇంట్లో పాతబడిపోయిన ప్రతిదీ వృథాగానే పరిగణిస్తాం. ఫర్నిచర్‌తో సహా! కొంతమంది వీటిని తక్కువ ధరకు అమ్మేసి కొత్తవి కొనుగోలు చేస్తే.. మరికొందరు పాతవి మాకెందుకులే అన్నట్లుగా బయటపడేస్తుంటారు. ఇలాంటి ఫర్నిచర్‌ పీసెస్‌ కొన్నిసార్లు రోడ్డు పక్కన కూడా దర్శనమిస్తుంటాయి. దీనివల్ల చెత్త పేరుకుపోవడంతో పాటు పర్యావరణానికీ నష్టం వాటిల్లుతుందని గ్రహించిన ఓ అమెరికన్‌ మహిళ ఓ అద్భుతమైన ఆలోచన చేసింది. పాత ఫర్నిచర్‌ని సేకరించి.. వాటిని రీసైక్లింగ్‌ చేసి కొత్త హంగులద్దుతోంది. వీటిని విక్రయిస్తూ నెల తిరిగే సరికి లక్షలు సంపాదిస్తోంది. అటు వృథాను అరికడుతూనే.. ఇటు ఎకో-ఫ్రెండ్లీగా ఉండడంతో ఆమె ఆలోచన అందరికీ నచ్చేస్తోంది. సోషల్‌ మీడియాలోనూ నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది.

32 ఏళ్ల మోలీ హ్యారిస్‌ ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి. అమెరికాలోని Iowa రాష్ట్రంలో నివసించేదామె. ఇల్లాలిగా, అమ్మగా తన బాధ్యతలు నిర్వర్తించేది. అయితే కొన్ని నెలల క్రితం ఆమె భర్తకు ఫ్లోరిడాలో ఉద్యోగం రావడంతో.. మోలీ కుటుంబం అక్కడికి మకాం మార్చింది. అక్కడి ఫెర్నాండినా బీచ్‌ను ఆనుకొని ఉన్న ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం మోలీ కుటుంబం ఈ ఇంట్లోనే నివసిస్తోంది.

ఆ ఆలోచనతోనే!

అయితే మోలీకి ఏదైనా కొత్తగా చేయాలన్న ఆసక్తి ఎక్కువ. కానీ ఇన్నేళ్లూ పిల్లల బాధ్యతల్లోనే నిమగ్నమైన ఆమె.. వారికి స్కూలుకెళ్లే వయసు రావడంతో తన అభిరుచిపై దృష్టి పెట్టాలనుకుంది. అంతేకాదు.. తాను చేసే పని వృథాను అరికట్టేలా, పర్యావరణహితంగా ఉండాలనుకుందామె. ఇదే తనతో ఫర్నిచర్‌ రీసైక్లింగ్‌ వ్యాపారం ప్రారంభించేలా చేసిందంటోంది మోలీ.

‘Iowaలో ఉన్నప్పుడూ, ఫ్లోరిడాకొచ్చాకా.. నేను గుర్తించిన అంశాల్లో ఫర్నిచర్‌ వృథా ఒకటి. చాలామంది తమ ఇంట్లో పాతబడిపోయిన ఫర్నిచర్‌ను వీధుల్లో పడేయడం చూశా. వాటిలో విరిగిపోయిన బుక్‌షెల్ఫ్‌, డ్రస్సింగ్‌ టేబుల్‌.. వంటి పెద్ద వస్తువులు కూడా ఉన్నాయి. కొంతమంది చిన్న డ్యామేజ్‌ ఉన్నా వాటిని పక్కన పడేసేవారు. దీనివల్ల వృథా పెరిగిపోవడంతో పాటు పర్యావరణానికీ నష్టం వాటిల్లుతుందన్న విషయం నాకు అర్థమైంది. అందుకే వీటిని రీసైక్లింగ్‌ చేసి.. కొన్ని మరమ్మతులు చేసి కొత్తవాటిలా మార్చాలన్న నిర్ణయానికొచ్చా. అయితే నా పిల్లలు పసి వయసులో ఉన్నప్పుడు.. ఖాళీ సమయాల్లో పిల్లలకు సంబంధించిన కొన్ని అలంకరణ వస్తువుల్ని ఇలాగే కొత్తవాటిలా మార్చి విక్రయించేదాన్ని. ఆ ఆలోచనతోనే పెద్ద పెద్ద ఫర్నిచర్‌ పీసెస్‌కూ హంగులద్దాలన్న ఆలోచన వచ్చింది..’ అంటోన్న మోలీ కొన్ని నెలల క్రితం ‘Flipped By Molly’ పేరుతో సోషల్‌ మీడియా వేదికగా ఈ వ్యాపారం ప్రారంభించింది.

సొంతంగా నేర్చుకున్నా!

ఏ పని మొదలుపెట్టినా అందులో నైపుణ్యాలు గడిస్తేనే రాణించగలం. కానీ ఫర్నిచర్‌ను కొత్తవాటిలా మార్చే విషయంలో ఎలాంటి నైపుణ్యాలు, మెలకువలు తెలియకపోయినా.. తనదైన సృజనాత్మకతతో వాటికి హంగులద్దుతోంది మోలీ.

‘పాత ఫర్నిచర్‌కు కొత్త హంగులద్దాలన్న ఆలోచన వచ్చిందే తడవు.. దీనిపై చిన్న పాటి అధ్యయనం చేశా. యూట్యూబ్‌లో వీటికి సంబంధించిన కొన్ని ట్యుటోరియల్‌ వీడియోలు చూసి.. రీవ్యాంప్‌కు సంబంధించిన ప్రాథమిక మెలకువలు నేర్చుకున్నా. 200 డాలర్లు (సుమారు రూ. 16 వేలు) ఖర్చు చేసి శాండర్‌, స్ప్రేయర్‌, డ్రిల్‌ మెషీన్‌.. వంటివి కొనుగోలు చేశా. వీటి సహాయంతో డ్యామేజ్‌ అయిన ఫర్నిచర్‌ ఉత్పత్తుల్ని రిపేర్‌ చేస్తూనే.. పాత వాటికి కొత్త హంగులద్దుతున్నా.. వీటికి ఆధునికత తీసుకొచ్చేందుకు సొంత క్రియేటివిటీతో పలు యాక్సెసరీస్‌నీ జోడిస్తున్నా. ఇలా నేను సేకరించిన పాత ఫర్నిచర్‌ వస్తువుల్లో సెకండ్‌ హ్యాండ్ ధరకు కొన్నవి కొన్నైతే.. రోడ్డు పక్కన పడేసినవి మరికొన్ని! వీటికి అవసరమైన మరమ్మతుల్ని బట్టి.. ఒక్కో ఫర్నిచర్‌ పీస్‌కు కొత్తదనం తీసుకురావడానికి కనీసం ఒక రోజు నుంచి గరిష్టంగా వారం రోజుల సమయం పడుతుంది. మొదట్లో ఆర్థికంగా పలు సవాళ్లు ఎదురైనా.. ఆ తర్వాత నిలదొక్కుకోగలిగాను. ప్రస్తుతం నా వ్యాపారం నాకు సంతృప్తినిస్తోంది.. కుటుంబానికి అదనపు ఆదాయంగానూ ఉపయోగపడుతోంది. ఇక మరోవైపు నా పిల్లలకూ తగిన సమయం కేటాయించగలుగుతున్నా..’ అంటోన్న మోలీ.. తాను రీవ్యాంప్‌ చేసిన ఫర్నిచర్‌ను తన వెబ్‌సైట్‌ వేదికగా, సోషల్‌ మీడియాలో విక్రయిస్తూ నెల తిరిగే సరికి రూ. లక్షన్నర వరకు సంపాదిస్తోందట!

ఏదీ అసాధ్యం కాదు!

పాత ఫర్నిచర్‌కు కొత్త హంగులద్దుతూ లక్షలు సంపాదిస్తోన్న మోలీ.. ఈ వ్యాపారం అంత కష్టమైంది కాదని, అలాగని సులభమూ కాదంటోంది.

‘కొన్ని పనులు సులభంగా పూర్తవ్వచ్చు.. మరికొన్ని కఠినంగా ఉండచ్చు.. కానీ అసాధ్యమైతే కాదు. ఫర్నిచర్‌ రీసైక్లింగ్‌ కూడా అంతే! కొన్ని పీసెస్‌కు కొత్త హంగులద్దడం సులభంగా పూర్తవుతుంది.. మరికొన్ని కష్టంగా అనిపిస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి పాత ఫర్నిచర్‌కే ఆధునిక హంగులద్దుతూ మరింత కొత్తగా మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నా.. అలాగే ప్రస్తుతం మేము ఉంటోన్న ఇంట్లోనూ కొన్ని మార్పులు చేర్పులు చేయాలి.. వాటి పైనా దృష్టి సారిస్తా..’ అంటోంది మోలీ. ఇలా ఆమె రీసైక్లింగ్‌ చేసిన ఫర్నిచర్‌ వస్తువులు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తన సృజనాత్మకతను చూసి చాలామంది నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తద్వారా అమెరికా వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ మోలీ గుర్తింపు సంపాదించుకుంది.

ఆన్‌లైన్‌లో పాఠాలు.. చిట్కాలు!

పాత ఫర్నిచర్‌ను కొత్త వాటిలా మార్చే క్రమంలో తాను తీసిన వీడియోల్ని సోషల్‌ మీడియా, యూట్యూబ్‌లలో పోస్ట్‌ చేస్తూ.. నెటిజన్లనూ ఈ దిశగా ప్రోత్సహిస్తోందామె. అంతేకాదు.. ఫర్నిచర్‌ రీసైక్లింగ్‌, ఇంటి అలంకరణ.. తదితర అంశాల్లో DIY చిట్కాల్నీ అందిస్తోంది మోలీ. ఇలా ఆమె వద్ద మెలకువలు నేర్చుకున్న కొందరు మహిళలు.. తమ ఇంట్లోని పాత ఫర్నిచర్‌ని తామే స్వయంగా కొత్తవాటిలా మార్చుకోవడం మొదలుపెట్టారు. మరికొందరు ఇలాంటి వ్యాపారం కూడా ప్రారంభించారు. ఇలా పరోక్షంగా తోటి మహిళల్లో వ్యాపార మెలకువలూ నేర్పుతోన్న మోలీ.. గతంలో తన భర్త ప్రారంభించిన ఇంటి పునర్నిర్మాణానికి సంబంధించిన వ్యాపారంలోనూ తన వంతుగా సహాయం చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్