మా ప్రెగ్నెన్సీ గురించి.. మీకెందుకు అంత ఆసక్తి..?

‘కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్‌.. త్వరలోనే లండన్‌లో తన తొలి సంతానానికి జన్మనివ్వబోతోంది..’‘ప్రస్తుతం గర్భవతి అయిన పరిణీతి చోప్రా.. తన బేబీ బంప్‌ని కవర్‌ చేసుకోవడానికే వదులైన దుస్తులు ధరిస్తోంది..’ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఇలాంటి వార్తలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి!  మరి, వాటిలో నిజమెంత? తమ ప్రెగ్నెన్సీ విషయం స్వయంగా ఆ తారలే బయటపెట్టారా?

Published : 01 Jun 2024 15:16 IST

(Photos: Instagram)

‘కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్‌.. త్వరలోనే లండన్‌లో తన తొలి సంతానానికి జన్మనివ్వబోతోంది..’

‘ప్రస్తుతం గర్భవతి అయిన పరిణీతి చోప్రా.. తన బేబీ బంప్‌ని కవర్‌ చేసుకోవడానికే వదులైన దుస్తులు ధరిస్తోంది..’

ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఇలాంటి వార్తలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి!  మరి, వాటిలో నిజమెంత? తమ ప్రెగ్నెన్సీ విషయం స్వయంగా ఆ తారలే బయటపెట్టారా? లేదంటే తమ మెటర్నిటీ షూట్‌ ఫొటోలేమైనా పోస్ట్‌ చేశారా? అంటే.. లేదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే.. ఇవన్నీ కొంతమంది కావాలని సృష్టించే కహానీలు! సోషల్‌ మీడియాలో వ్యూస్‌ కోసమో, ఫాలోయింగ్ పెంచుకోవడం కోసమో.. తారల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి మరీ క్రియేట్ చేసే తప్పుడు వార్తలు.

నిజానికి ఇది సెలబ్రిటీల సమస్యే కాదు.. సగటు మహిళ సమస్య కూడా! ఎంతోమంది మహిళల ప్రైవసీని ఈ సమాజం ఇలా హరిస్తోంది. ఎవరో చెప్పింది, దూరం నుంచి చూసిందే నిజమంటూ వారి విషయాల్లో కట్టు కథలల్లేస్తూ వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోంది. మరి, ఇది ఎంతవరకు సమంజసం?

సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి ఉండడం సహజమే. అలాగని వారికి సంబంధించిన ప్రతి విషయం బయటి ప్రపంచానికి తెలియాలని రూల్‌ లేదు. తమకు మాత్రమే పరిమితమైన వ్యక్తిగత అంశాలు కొన్నుంటాయి. వాటిలో ప్రెగ్నెన్సీ ఒకటి. నిజానికి ఈ విషయం ఎవరికి వారే స్వయంగా బయటపెట్టాలి. కానీ నేటి సమాజం కొందరు తారలకు ఆ స్వేచ్ఛనివ్వట్లేదు. ఏదైనా ఈవెంట్లో పాల్గొనకపోయినా వదులైన దుస్తులు ధరించినా, లేదంటే బిగుతైన దుస్తులు ధరించడం వల్ల పొట్ట కాస్త ఎత్తుగా కనిపించినా.. తను ప్రెగ్నెంట్‌ అంటూ కొంతమంది కథలల్లేస్తుంటారు. ఇవే గాసిప్స్‌ని సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ వ్యూస్‌ కోసం చెత్త ట్రిక్స్‌ ప్లే చేస్తుంటారు. ఈ మధ్య కొందరు బాలీవుడ్‌ తారల విషయంలో ఇలాంటి గాసిప్స్ ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

కత్రినా ప్రెగ్నెంట్‌.. లండన్‌ టూర్!

సెలబ్రిటీలకైనా, సామాన్య మహిళలకైనా.. పెళ్లై ఏడాది గడిచిందంటే ఎదురయ్యే ఏకైక ప్రశ్న ‘గుడ్‌న్యూస్‌ ఎప్పుడు చెబుతారు?’ అని! ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైనా, ఈవెంట్‌లో కనిపించినా ఈ ప్రశ్న అడగకుండా వదిలిపెట్టరు. వాళ్లు దానికి ఔనన్నా, కాదన్నా, మౌనం వహించినా సమస్యే! ఎందుకంటే తమకు తోచింది రాసుకొని సోషల్‌ మీడియాలో వ్యూస్‌ కోసం పోస్టులు పెట్టే వారూ లేకపోలేదు. ఇక దూరం నుంచి చూసిందే నిజమని నమ్ముతుంటారు కొందరు.

ఇటీవల కత్రినా కైఫ్‌ విషయంలో ఇదే జరిగింది. తన భర్త విక్కీ కౌశల్‌ పుట్టినరోజు సందర్భంగా లండన్‌ టూర్‌ వేసుకున్న ఈ జంట.. మరుసటి రోజు అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది. అయితే అందులో కత్రినా నలుపు రంగు దుస్తుల్లో కాస్త బొద్దుగా ఉన్నట్లనిపించింది. దాంతో ‘ప్రస్తుతం కత్రినా ప్రెగ్నెంట్‌ అని, త్వరలోనే లండన్‌లో తన తొలి సంతానానికి జన్మనివ్వబోతోందని, అందుకే ఈ జంట ప్రస్తుతం లండన్‌కు వెళ్లిందని..’ ఇలా ఎవరికి నచ్చినట్లుగా వారు కథలల్లేసుకున్నారు. ఇదే వార్త కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం, పైపెచ్చు ‘ఆమె సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయం’టూ వార్తలు ప్రచురించడంతో.. ఈ వార్త తెగ వైరలైంది.

నిజానికి కత్రినా ప్రెగ్నెంటా? కాదా?, అసలు వాళ్లు ఎందుకు లండన్‌ వెళ్లారు? సాధారణంగానే ఆ దేశంలో చలి ఎక్కువ.. అందుకే క్యాట్‌ లేయర్డ్‌ దుస్తులు ధరించి ఉండచ్చేమో?.. ఇలా ఆలోచించిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ఇలా ఇప్పుడే కాదు.. గతేడాది ఓసారి ఓ జ్యుయలరీ షాపింగ్‌ ఓపెనింగ్‌లో పాల్గొన్న కత్రినా.. తన దుపట్టాను పొట్టకు అడ్డుగా పెట్టుకోవడంతో ఆ సమయంలోనూ ఆమె ప్రెగ్నెన్సీపై రూమర్స్‌ వచ్చాయి. కానీ అవి అసత్యమని తేలింది.

వాళ్లూ బాధితులే!

కత్రినానే కాదు.. గతంలో పరిణీతి చోప్రా, అనుష్కా శర్మ, పాకిస్థానీ నటి మహీరా ఖాన్‌ కూడా తమ గర్భధారణ విషయంలో ఇలాంటి గాసిప్స్‌నే ఎదుర్కొన్నారు. మొన్నామధ్య పరిణీతి ఓ సందర్భంలో పఫ్ఫీగా ఉన్న పొడవాటి జాకెట్‌ను ధరించి కెమెరా కంటికి చిక్కింది. దీంతో కొంతమంది.. ‘ఇంత వేడిలో మందంగా ఉన్న జాకెట్‌ ధరించిందంటే.. తను కచ్చితంగా గర్భవతే!’ అంటూ సోషల్‌ మీడియాలో రూమర్స్ వ్యాప్తి చేశారు.

ఈ వార్త వైరల్‌గా మారడంతో.. స్వయంగా పరిణీతే స్పందించింది. ‘కాఫ్తాన్‌ డ్రస్‌ = ప్రెగ్నెన్సీ, ఓవర్‌సైజ్‌డ్‌ షర్ట్‌ = ప్రెగ్నెన్సీ, సౌకర్యవంతమైన ఇండియన్‌ కుర్తా = ప్రెగ్నెన్సీ’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ పెట్టి.. నవ్వుతోన్న ఎమోజీని జత చేసింది. అంటే.. ‘వదులైన దుస్తులు ధరిస్తే ఇక గర్భవతి అని ఫిక్స్‌ అవుతారా? అవతలి వారు అనౌన్స్‌ చేసే దాకా కూడా ఆగరా?’ అన్నట్లుగా సుతిమెత్తగా లెంపకాయ కొట్టినట్లుగా స్పందించిందీ బాలీవుడ్‌ తార. దాంతో ఆమె ప్రెగ్నెన్సీపై రూమర్స్‌కు చెక్‌ పడినట్లయింది.

మరి, అక్కడితో నెటిజన్లు ఊరుకున్నారా? అంటే.. ఈసారి వారి కన్ను పాకిస్థానీ నటి మహీరా ఖాన్‌పై పడింది. ‘మహీరా ప్రెగ్నెంట్‌ అని, అందుకే తాను ఓ నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ను వదులుకుంద’ని వార్తలొచ్చాయి. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను ప్రెగ్నెంట్‌ని కాదు.. ఏ నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌నూ వదులుకోలేదు..’ అంటూ చెప్పడంతో ఆమెపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది.

ఇక అనుష్కా శర్మ రెండో ప్రెగ్నెన్సీ గురించి వచ్చిన గాసిప్స్‌, వాటిపై దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ నోరు జారడం, ఆపై మాటను వెనక్కి తీసుకోవడం, కొన్ని రోజులకు వారికి నిజంగానే రెండో సంతానంగా మగబిడ్డ పుట్టడం.. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే!


గోప్యత.. అందుకేనేమో!

నిజానికి ప్రెగ్నెన్సీ అనేది అతి సున్నితమైన అంశం. ఆ విషయం గురించి తామే స్వయంగా బయటి ప్రపంచానికి చెప్పే స్వేచ్ఛ ప్రతి మహిళకూ ఉంది. అయితే సోషల్‌ మీడియా వచ్చినప్పట్నుంచి ఇలాంటి ఊహాగానాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీల విషయంలోనే కాదు.. సామాన్య మహిళలకు సంబంధించిన వ్యక్తిగత అంశాలూ కొంతమంది అత్యుత్సాహం కారణంగా నెట్టింట్లో వైరలవుతున్నాయి. ఇలా వారి స్వేచ్ఛను, ప్రైవసీని, ఆత్మాభిమానాన్ని కొందరు హరిస్తున్నారు. నిజానికి ఇలాంటి వ్యక్తుల అత్యుత్సాహం వల్లే.. చాలామంది సెలబ్రిటీలు తమ పెళ్లి, ప్రెగ్నెన్సీ, పిల్లలు, విడాకుల విషయాల్లో అత్యంత గోప్యంగా వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంటుంది. ఉదాహరణకు.. కత్రినా, అనుష్కా శర్మ వంటి తారలు మూడుముళ్లు పడే వరకూ తమ పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఇక అనుష్క రెండో సంతానానికి జన్మనిచ్చిందని వారు స్వయంగా ప్రకటిస్తే తప్ప ఎవరికీ తెలియలేదు. అంతేకాదు.. ఇప్పటికీ వాళ్ల పిల్లలిద్దరినీ కెమెరా కంటికి దూరంగా పెంచుతున్నారు అనుష్క-విరాట్‌ దంపతులు.


ఆ స్వేచ్ఛ లేకపోతే ఎలా?

ఇక మరికొందరు తారలు.. సోషల్‌ మీడియా గాసిప్స్‌కు తట్టుకోలేక.. ఇతర దేశాల్లో పెళ్లి చేసుకోవడం, డెలివరీ కోసం విదేశాలకు వెళ్లడం.. వంటివి చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలు మహిళల స్వేచ్ఛ-స్వాతంత్ర్యాలకు, ఆత్మాభిమానానికి భంగం కలిగిస్తున్నాయన్నది కొంతమంది భావన! ఇలాంటి అనవసర విషయాలపై పెట్టే సమయాన్ని తమ వ్యక్తిగత విషయాలు/కెరీర్‌ అభివృద్ధిపై పెడితే మంచిదన్నది మరికొందరి అభిప్రాయం. కాబట్టి అది పెళ్లైనా, పిల్లలైనా, ఇతర విషయాలైనా.. ఎవరికి వారే స్వయంగా వెల్లడించే స్వేచ్ఛ ఉండాలి. అలాగే సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా.. వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించి ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలి. మరి, దీనిపై మీ అభిప్రాయమేంటి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్