ఆ పరిచయాల్లో ప్రేమ కనిపించలేదు.. ఒంటరితనం వేధిస్తోంది!
నా వయసు 36 సంవత్సరాలు. గత పన్నెండేళ్లుగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. చదువు పూర్తైన కొద్ది రోజుల్లోనే ఉద్యోగంలో చేరాను. అదే సమయంలో అనారోగ్యం వల్ల నాన్న ఇంటికే పరిమితమయ్యారు. దాంతో కుటుంబ బాధ్యతలు నాపై పడ్డాయి.
నా వయసు 36 సంవత్సరాలు. గత పన్నెండేళ్లుగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. చదువు పూర్తైన కొద్ది రోజుల్లోనే ఉద్యోగంలో చేరాను. అదే సమయంలో అనారోగ్యం వల్ల నాన్న ఇంటికే పరిమితమయ్యారు. దాంతో కుటుంబ బాధ్యతలు నాపై పడ్డాయి. దానివల్ల సరైన సమయంలో పెళ్లి చేసుకోలేకపోయాను. తోబుట్టువులు ఉన్నా వారు బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఏడేళ్ల క్రితం పేరెంట్స్ ఇద్దరూ చనిపోయారు. ఆ తర్వాత పెళ్లి సంబంధాలు చూసినా సరైన సంబంధం రాలేదు. ఈమధ్యలో కొంతమంది అబ్బాయిలతో పరిచయం ఏర్పడింది. కానీ వారిలో డబ్బు, శారీరక అవసరాలు వంటి ఆలోచనలే తప్ప ప్రేమ కనిపించలేదు. ఈ వయసులో నన్ను ఒంటరితనం వేధిస్తోంది. దీన్నుంచి బయటపడడానికి ఎవరినైనా దత్తత తీసుకోవాలని ఉంది. కానీ, నిర్ణయానికి రావడం మాత్రం కష్టంగా ఉంది. నా భవిష్యత్తు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి
జ. ఈ రోజుల్లో ఒక వయసుకు వచ్చిన తర్వాత సొంత ప్రయోజనాలే తప్ప కుటుంబం గురించి ఆలోచించేవారు చాలా తక్కువగా ఉన్నారు. కానీ మీరు ఒక మహిళగా ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఇవే బాధ్యతల నడుమ మీరు సరైన సమయంలో పెళ్లి చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఒంటరితనం వేధిస్తోందని అంటున్నారు. ఇలాంటి సమయంలో మీరు బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సానుకూల దృక్పథంతో ఆలోచించి మీ ముందున్న అవకాశాలను పరిశీలించండి. ఒకవేళ మీరు దాంపత్య బంధంలో అడుగుపెట్టాలనుకుంటే.. అందుకు సంబంధించిన ప్రయత్నాలు మరోసారి చేయండి. మీ అభిరుచులకు సరిపడే వ్యక్తి తారసపడే అవకాశం లేకపోలేదు. అలాగే ఒంటరితనం నుంచి బయటపడడానికి దత్తత తీసుకోవాలనే ఆలోచన చేశారు. ఇది మంచి నిర్ణయమే. అయితే దీనివల్ల కొన్ని ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఉంటాయి. వాటికి పూర్తిగా సిద్ధమైనప్పుడే ఒక నిర్ణయానికి రావడం మంచిదేమో ఆలోచించండి.
జీవితంలో స్థిరపడాలంటే పెళ్లి ఒక్కటే మార్గం కాదు. కొంతమంది తమ కలలను సాకారం చేసుకుంటూ అందులోనే సంతోషం వెతుక్కుంటారు. అలాగే మీకు ఏవైనా అభిరుచులు ఉంటే వాటిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. దీనివల్ల ‘ఒంటరి’ అనే భావన దూరమవుతుంది. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. కాబట్టి, మీరు వయసు గురించి ఆలోచించకుండా మీ ముందున్న అవకాశాలను పరిశీలించండి. ఆ తర్వాత అందులోని లాభనష్టాలను అంచనా వేసుకుని ఒక నిర్ణయానికి రండి. తప్పకుండా మీ భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.