రెండు రోజులకు మించి బతకనన్నారు!

మరణం అంచుల దాకా వెళ్లి బతకడమే అరుదు. ఒకవేళ బతికారంటే.. వాళ్లు జీవితంలో సాధించాల్సింది ఇంకా ఏదో ఉందనే అర్థం! ఈ మాటలు పదిహేడేళ్ల పారా అథ్లెట్‌ కశిష్‌ లక్రాకు అతికినట్లు సరిపోతాయి. బాల్యం నుంచే ఆటలపై ప్రేమ పెంచుకున్న ఆమె.. వాటిని సాధన చేసే క్రమంలోనే ఓ పెను ప్రమాదానికి గురైంది.

Published : 25 Aug 2021 19:04 IST

(Photo: Twitter)

మరణం అంచుల దాకా వెళ్లి బతకడమే అరుదు. ఒకవేళ బతికారంటే.. వాళ్లు జీవితంలో సాధించాల్సింది ఇంకా ఏదో ఉందనే అర్థం! ఈ మాటలు పదిహేడేళ్ల పారా అథ్లెట్‌ కశిష్‌ లక్రాకు అతికినట్లు సరిపోతాయి. బాల్యం నుంచే ఆటలపై ప్రేమ పెంచుకున్న ఆమె.. వాటిని సాధన చేసే క్రమంలోనే ఓ పెను ప్రమాదానికి గురైంది. ‘48 గంటలకు మించి బతకద’న్న వైద్యుల మాటలకు వెరవకుండా చావుతో మొండిగా పోరాడి గెలిచింది.. ప్రమాదం తర్వాత చక్రాల కుర్చీకే పరిమితమైనా విధిని ఓడించింది. దీని ఫలితంగానే ప్రస్తుతం టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొంటోంది. అంతేకాదు.. ఈ విశ్వ క్రీడల్లో మన దేశం తరఫున పాల్గొంటోన్న అతి పిన్న అథ్లెట్‌గానూ గుర్తింపు సొంతం చేసుకుంది లక్రా. విధి విసిరిన సవాలును తిప్పి కొట్టి జీవితాన్ని గెలిచిన ఈ యువ అథ్లెట్‌ స్ఫూర్తి గాథ ఇది!

కశిష్‌ లక్రా.. దిల్లీలో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచే చదువుతో పాటు ఆటల పైనా ప్రేమ పెంచుకుందామె. పెద్దయ్యాక గొప్ప బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి కావాలని కలలు కంది. అయితే అందుకు ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. ఇదనే కాదు.. షాట్‌పుట్‌, రెజ్లింగ్‌, స్పీడ్‌ బాల్‌, స్కేటింగ్‌.. వంటి క్రీడాంశాల్లోనూ ఆమెకు మంచి పట్టుంది. స్కూల్లో ఈ ఆటల పోటీల్లో పాల్గొంటూ ఎన్నో పతకాలు, బహుమతులు గెలుచుకుంది లక్రా.

మనసు మార్చుకుంది!

తన ఆర్థిక పరిస్థితి రీత్యా బ్యాడ్మింటన్‌ తన వల్ల కాదని నిర్ణయించుకున్న ఆమె.. రెజ్లింగ్‌ వైపు తన మనసు మార్చుకుంది. అయినా నిరాశ చెందకుండా ఏ క్రీడ అయినా బంగారమే అంటూ సాధన చేసింది. అనతి కాలంలోనే ఇందులో రాటుదేలి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశాలు దక్కించుకుంది. ‘ఖేలో ఇండియా ఛాంపియన్‌షిప్‌’ వంటి ప్రతిష్ఠాత్మక పోటీలకూ అర్హత సాధించింది. అయితే తన పదమూడేళ్ల వయసులో పెద్ద ప్రమాదానికి గురైందామె. నజఫ్‌గర్‌లోని సుశీల్‌ కుమార్‌ అకాడమీలో రెజ్లింగ్‌ సాధన చేస్తోన్న సమయంలో రింగ్‌లో ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. దీంతో మెడకు తీవ్ర గాయాలయ్యాయి. దాని ప్రభావంతో వెన్నెముక దెబ్బతింది. 48 గంటలకు మించి బతకడమే గగనమని తేల్చారు డాక్టర్లు. ఒకవేళ బతికినా జీవితాంతం మంచానికి పరిమితం కావాల్సిందేనని చెప్పారు. నిజానికి ఈ మాటలే తనలో మొండిగా పోరాడే శక్తినిచ్చాయంటోంది లక్రా.

అందుకే బతికాననిపించింది!

‘మూడేళ్ల ప్రాయంలోనే స్కేటింగ్‌ సాధన చేశా. రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండో స్థానం దక్కించుకున్నా. ఎనిమిదో తరగతిలో బ్యాడ్మింటన్‌ని నా కెరీర్‌గా మార్చుకోవాలన్న నిర్ణయానికొచ్చా. అయితే ఆర్థిక పరిస్థితుల రీత్యా అది కుదరలేదు. కుటుంబ సభ్యుల సలహా మేరకు రెజ్లింగ్‌పై దృష్టి పెట్టా. అయితే అనుకోని ప్రమాదం నన్ను చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. నేను రెండు రోజులకు మించి బతకనని, ఒకవేళ బతికినా జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సిందేనన్న డాక్టర్ల మాటలు నన్ను ఒక్కసారిగా శూన్యంలోకి నెట్టేశాయి. కానీ చావు అంచు వరకు వెళ్లి బతికానంటే నేను సాధించాల్సింది ఏదో ఉందనిపించింది. ఆ సమయంలోనే వసంత్‌ కుంజ్‌లోని ఇండియన్‌ స్పైనల్‌ ఇంజ్యూరీస్‌ సెంటర్‌లో నన్ను చేర్పించారు. సుమారు ఐదు నెలల పాటు అక్కడ నాకు చికిత్స జరిగింది. ఆటలపై నాకున్న తపన చూసి అక్కడి ఫిజియోథెరపిస్ట్‌ నన్ను ప్రోత్సహించారు. ప్రముఖ రెజ్లర్‌ సత్యపాల్‌ సింగ్‌ సర్‌కి నన్ను పరిచయం చేశారు. ఆయనే పారాలింపిక్స్‌ని నాకు పరిచయం చేశారు. క్లబ్‌ త్రో క్రీడలో నాతో ఓనమాలు దిద్దించారు..’ అంటూ తన గతాన్ని గుర్తు చేసుకుందీ అథ్లెట్.

పడిలేచిన కెరటం!

మంచానికే పరిమితమవుతుందనుకున్న లక్రా.. వైద్యులు సూచించిన మందులు వాడుతూ, ఫిజియోథెరపీ చికిత్స తీసుకుంటూ, యోగా సాధన చేస్తూ.. చక్రాల కుర్చీలో కూర్చోగలిగింది. మెడ కింది శరీర భాగాలన్నీ చచ్చుబడిపోవడంతో చేతులకు పనిచెబుతూ క్లబ్‌ త్రోలో ఆరితేరింది. ‘ప్రమాదం తర్వాత స్విట్జర్లాండ్‌లో జరిగిన జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించా. 2019లో దుబాయ్‌ వేదికగా సీనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఐదో స్థానం సంపాదించా. ఈ ఏడాది ఫజా ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటా. నేను భవిష్యత్తులో నడవలేనన్నది నిజం.. అయితే ఫిజియోథెరపీ చికిత్స కొనసాగిస్తే శరీరం చురుగ్గా ఉంటుందని వైద్యులు చెప్పారు. ఇక ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొంటున్నా..’ అంటోందీ యువ కెరటం.

ఎక్కడున్నా.. అమ్మ నా వెంటే!

ఆశలు పూర్తిగా వదిలేసిన తన జీవితానికి ఓ అర్థం, పరమార్థం చేకూరిందంటే అందుకు తన కుటుంబమే కారణమంటోంది లక్రా. ‘ప్రమాదం తర్వాత నేను అప్పటిదాకా చదివిన స్కూల్లో నన్ను తిరిగి చేర్చుకోలేదు. అయినా వేరే పాఠశాలలో నాకు అడ్మిషన్‌ లభించింది. ఆటలపై నాకున్న తపనతో నన్ను క్రీడల్లోనూ ప్రోత్సహించారు అక్కడి టీచర్లు. ఇక అమ్మానాన్న, అమ్మమ్మ-తాతయ్యలైతే నేను ఏదనుకుంటే అది నాకు సాధ్యమయ్యేలా చేశారు. అమ్మ, అన్నయ్య వ్యాయామాలు సాధన చేసే క్రమంలో నాకు సహకరించేవారు. ఇక అమ్మైతే నేను పోటీల కోసం/శిక్షణ కోసం ఎక్కడికెళ్తే అక్కడికి నా వెంటే వచ్చేది. నాకున్న ప్రతికూల పరిస్థితుల్లోనూ నేను తిరిగి ఆటల్ని కెరీర్‌గా ఎంచుకున్నానంటే అది నా కుటుంబం చలవే! రోజూ ఉదయం 6:30 నుంచి 9:30 దాకా సాధన చేసేదాన్ని. ఈ క్రమంలో కొన్ని తరగతులు మిస్సయినా టీచర్లు మళ్లీ నాకోసం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసేవారు. ఇలా నా విజయాల్లో నా స్కూల్‌ యాజమాన్యం పాత్ర కూడా ఎంతో ఉంది. ఇక లాక్‌డౌన్‌లో సాధన కాస్త కష్టంగానే మారింది. ఎందుకంటే క్లబ్‌ త్రో ప్రాక్టీస్‌ చేసేంత ఖాళీ స్థలం మా ఇంట్లో లేదు. పోనీ ఏదైనా పార్కుకెళ్లి చేద్దామంటే సురక్షితం కాదనిపించింది. అయితే లాక్‌డౌన్‌ ఎత్తేశాక తిరిగి సాధన చేసి నా క్రీడా సామర్థ్యాన్ని మెరుగుపరచుకున్నా..’ అంటోంది లక్రా.

అసలేంటీ క్లబ్‌ త్రో!

బౌలింగ్‌ పిన్‌ ఆకృతిలో ఉండే ఉడెన్‌ క్లబ్‌ను విసరడమే ఈ క్లబ్‌ త్రో! క్రీడాకారులు నిర్దేశించిన ప్రదేశంలో కూర్చొని తమ సామర్థ్యం మేరకు ఈ క్లబ్‌ను విసరాల్సి ఉంటుంది. వాళ్లకున్న అవయవ లోపాన్ని బట్టి F31, F32, F51 కేటగిరీల్లో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్రా F51 కేటగిరీలో పాల్గొననుంది. డిస్కస్‌ త్రో, జావెలిన్‌ త్రో, షాట్‌ పుట్‌లాగే ఇది కూడా ఒక త్రోయింగ్‌ క్రీడ. 1960 పారాలింపిక్స్‌ గేమ్స్‌లో మహిళలు, పురుషుల విభాగాల్లో దీన్ని తొలిసారిగా ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత బార్సిలోనా పారాలింపిక్స్‌లో మహిళల విభాగంలో ఈ పోటీల్ని రద్దు చేసినా.. తిరిగి 2012 లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి ఈ క్రీడను నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుత టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొంటోన్న 54 మంది అథ్లెట్లలో పిన్న వయస్కురాలు లక్రానే కావడం విశేషం.

శరీరం పనిచేయకపోయినా చేతులతోనే తన శక్తిసామర్థ్యాలను ఒడ్డి దేశానికి పతకం అందించాలని ఉవ్విళ్లూరుతోన్న లక్రా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం!

ఆల్‌ ది బెస్ట్‌ లక్రా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్