Body Positivity : బరువు తగ్గమని ఉచిత సలహాలిచ్చేవారు!

కాస్త బొద్దుగా ఉంటే చాలు అదేదో మన తప్పైనట్లుగా చూస్తారు.. బరువు తగ్గమంటూ ఉచిత సలహాలిస్తుంటారు.. నిజానికి ఇలాంటి దెప్పి పొడుపులు మన మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఒకానొక దశలో మన శరీరాన్ని మనమే అసహ్యించుకునేలా చేస్తాయి.

Updated : 13 Jan 2022 21:15 IST

(Photo: Instagram)

కాస్త బొద్దుగా ఉంటే చాలు అదేదో మన తప్పైనట్లుగా చూస్తారు.. బరువు తగ్గమంటూ ఉచిత సలహాలిస్తుంటారు.. నిజానికి ఇలాంటి దెప్పి పొడుపులు మన మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఒకానొక దశలో మన శరీరాన్ని మనమే అసహ్యించుకునేలా చేస్తాయి. చిన్నతనంలో తానూ ఇలాంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది ముంబయికి చెందిన ప్లస్‌-సైజ్‌ మోడల్‌, బెల్లీ డ్యాన్సర్‌ అంజనా బాపట్‌. ఇలాంటి అవహేళనలకు ముందు కుంగిపోయినా.. ఆ తర్వాత తన శరీరాన్ని తాను ప్రేమించుకోవడం నేర్చుకున్నానంటోంది. అందమంటే బయటికి కనిపించేది కాదు.. మనలోని ఆత్మవిశ్వాసమే అంటోన్న ఈ బబ్లీ బ్యూటీ సెల్ఫ్‌ లవ్‌ స్టోరీ మనమూ తెలుసుకుందాం రండి..

మనం లావున్నా, సన్నబడ్డా, అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా.. మన ఇంట్లో వాళ్లు, స్నేహితులు పెద్దగా పట్టించుకోరు.. కానీ ఇలాంటి విషయాల్లో ముక్కూ-మొహం తెలియని వాళ్ల నుంచే విమర్శలు ఎదురవుతుంటాయి. ముంబయిలో పుట్టి పెరిగిన అంజనా బాపట్‌దీ ఇదే పరిస్థితి. చిన్నతనం నుంచీ ఎంతో బొద్దుగా ఉండే ఆమె.. తన శరీరాకృతి విషయంలో స్కూల్లో, కాలేజీలో ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే స్కూల్లో తోటి విద్యార్థి ఒకరు ప్రతి విషయాన్నీ తన బరువుతో ముడిపెట్టి తన మనసును గాయపరిచే వాడని చెబుతోంది.

అతని చేష్టలు బాధపెట్టేవి!

‘నేను చిన్నతనం నుంచే బొద్దుగా ఉండేదాన్ని. అయితే ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులెవరూ పెద్దగా పట్టించుకోలేదు.. కానీ స్కూల్లో చేరాకే ఇది నాకు పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే మా స్కూల్లో ఒకబ్బాయి నా అధిక బరువుపై కొత్తగా ఎలా జోక్‌ చేయాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు. స్కూల్‌ తరఫున విహారయాత్రలకు వెళ్లినా ఏదో ఒకలా అవమానించాలని చూసేవాడు. బస్సులో అందరూ ఎక్కాక నన్ను ఏడిపించేలా పాటలు పాడేవాడు. ఇవన్నీ నా మనసులో బలంగా నాటుకుపోయాయి. ప్రతి క్షణం అతని మాటలే నా మెదడులో ప్రతిధ్వనించేవి. ఇదిలా ఉంటే మా బంధువొకరు.. ‘నీలా లావున్న అమ్మాయిని నేనెక్కడా చూడలేదు.. బరువు తగ్గు!’ అంటూ ఆటపట్టించేవాడు. దీని గురించి గంటలకు గంటలు లెక్చర్‌ ఇచ్చేవాడు. ఇలా వీళ్ల మాటలు, చేష్టలు నా మనసును గాయపరిచాయి. నన్ను నేను అద్దంలో చూసుకొని అహస్యించుకునేలా చేశాయి. ఇదొక ఎత్తైతే.. షాపింగ్‌కి వెళ్లినప్పుడల్లా నేను పడిన మానసిక వేదన మరో ఎత్తు. ఎందుకంటే నాకు నచ్చిన డ్రస్‌ ఏది ఎంచుకున్నా అది నా శరీరాకృతికి ఫిట్‌ అవ్వకపోయేది. ఇదీ నా మనసుపై ప్రతికూల ప్రభావం చూపింది.. ఇలా మానసిక ఒత్తిడిలోకి కూరుకుపోయిన సమయంలో నా కుటుంబమే నాకు అండగా నిలిచింది..’ అంటూ తనకు ఎదురైన వేధింపుల గురించి చెప్పుకొచ్చింది అంజన.

ఆమె వల్లే మార్పు మొదలైంది!

కాలేజీలో ఉన్నప్పుడు కూడా తన అధిక బరువు తనకు శత్రువుగా మారిందంటోన్న ఈ ముంబయి అమ్మాయి.. తన స్నేహితురాలు, ఆమె కుటుంబం వల్లే తిరిగి మామూలు మనిషిని కాగలిగానంటోంది. అప్పట్నుంచే తనను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టానంటోంది. ‘స్కూలింగ్‌ దశ నుంచి 23 ఏళ్ల దాకా ఇవే ప్రతికూల మధ్య గడిపిన నేను.. ఆ తర్వాత పైచదువుల కోసం పుణేలోని మా స్నేహితురాలి ఇంటికి వెళ్లాను. తనను, తన కుటుంబాన్ని చూస్తే ముచ్చటేసేది. ప్రతి విషయంలో వాళ్లు ప్రదర్శించే ఆత్మవిశ్వాసం, తమను తాము గౌరవించుకునే తీరు చూసి నేను ఆలోచనలో పడిపోయాను. ఇలా వాళ్లతో కలిసుండడం వల్ల నాలో క్రమంగా మార్పు మొదలైంది. ఎలా ఉన్నా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే ప్రశాంతంగా ఉండగలం అన్న విషయం అర్థమైంది. అప్పట్నుంచి నా చుట్టూ ఉండే వాతావరణాన్ని పాజిటివ్‌గా మార్చుకుంటూ ముందుకు సాగాను. నిర్మొహమాటంగా ప్లస్‌-సైజ్‌ దుస్తులు ధరించడం మొదలుపెట్టాను.. స్ఫూర్తి కలిగించే కథనాలు చదవడం ప్రారంభించాను..’ అంటూ తనను తాను అంగీకరించిన విధానం గురించి చెప్పుకొచ్చిందీ బెల్లీ క్వీన్‌.

డ్యాన్స్‌తో కొత్త ప్రయాణం!

ఇలా తనని తాను ఇష్టపడడం ప్రారంభించాక.. వ్యాయామాలు, యోగా సాధన.. వంటివి కూడా మొదలుపెట్టింది అంజన. అయితే మొదట ఎక్సర్‌సైజ్‌ల విషయంలో కాస్త ఇబ్బంది పడినా.. క్రమంగా వాటికి అలవాటు పడింది. సాధారణంగా లావుగా ఉన్న వారు బెల్లీ డ్యాన్స్‌ చేయలేరనుకుంటారు. కానీ ఇలాంటి ఆలోచనలకు చెక్‌ పెడుతూ ఈ నృత్యం కూడా నేర్చుకుందామె. అదెంతలా అంటే.. సన్నజాజి తీగలా ఉన్న వారు ఎంత అలవోకగా నడుమును బొంగరంలా తిప్పగలుగుతారో.. తన డ్యాన్స్‌తోనూ అంతలా కట్టి పడేస్తుంటుందామె. వీటికి సంబంధించిన వీడియోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. మొదట తన అధిక బరువు పట్ల మళ్లీ విమర్శలొచ్చాయి. అయితే ఈసారి వాటిని స్వీకరించే అవకాశం తన మనసుకు ఇవ్వలేదామె. నిజానికి ఇలా తనలోని డ్యాన్స్‌ ట్యాలెంటే ఓ ప్లస్‌-సైజ్‌ బ్రాండ్‌ ఆమెకు మోడలింగ్‌ ఆడిషన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందించింది. ఇందులో ఎంపికవడమే కాదు.. బెల్లీ డ్యాన్సర్‌గా కొన్ని ప్రకటనల్లోనూ నటించింది అంజన. మరికొన్ని మ్యూజిక్‌ వీడియోలతోనూ అలరించింది.. లాక్మే ఫ్యాషన్‌ వీక్‌.. వంటి ప్రతిష్ఠాత్మక వేదికలపైనా ప్లస్‌-సైజ్‌ మోడల్‌గా ర్యాంప్‌వాక్‌ చేసింది. ఇలా వచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ ప్లస్‌-సైజ్‌ మోడల్‌గా, బెల్లీ డ్యాన్సర్‌గా ఎదిగింది అంజన. ఈ క్రమంలో తన అధిక బరువు వల్ల తన శరీరంపై పడిన మచ్చల్ని, ముడతల్ని ప్రదర్శించడానికి కూడా వెనకాడదీ బ్రేవ్‌ బ్యూటీ.

అందమంటే అదే!

ఒకప్పుడు లోపంగా భావించిన అధిక బరువే ఇప్పుడు తననో సెలబ్రిటీగా మార్చిందంటోన్న అంజన.. ఎలా ఉన్నా తమను తాము అంగీకరించుకోవడం ముఖ్యమంటోంది. ‘మనలోని ప్రతికూల ఆలోచనలే మనల్ని అభద్రతా భావానికి గురయ్యేలా చేస్తాయి. అందుకే ఇతరుల మాటలు పట్టించుకోవడం మానుకోండి. ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు అంగీకరించడం నేర్చుకోండి. మోడల్‌గా, బెల్లీ డ్యాన్సర్‌గా నేను ప్రదర్శించే ప్రతి వేదికపైనా ఇదే సందేశం ఇస్తుంటా. అందానికి శరీరాకృతి, చర్మ ఛాయ కొలమానాలు కావు.. ఆత్మవిశ్వాసమే అసలైన అందం.. నా జర్నీలో నేను తెలుసుకున్న అతి ముఖ్యమైన విషయమిది!’ అంటూ తన మాటలతోనూ మహిళలందరిలో స్ఫూర్తి నింపుతోంది అంజన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్