Anita Hassanandani : డైటింగ్‌ చేయకుండానే అలా బరువు తగ్గా!

బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాలి.. కఠినమైన వ్యాయామాలు చేయాలి.. అనుకుంటారు చాలామంది. ఇక ప్రసవానంతరం బరువు తగ్గాలంటే మాత్రం మరింత చెమటోడ్చాల్సిందే అనుకుంటారు. కానీ అంత కష్టపడాల్సిన అవసరం లేదంటోంది బాలీవుడ్‌ బ్యూటీ అనితా హస్సానందాని. గతేడాది ఫిబ్రవరిలో తల్లైన ఈ ముద్దుగుమ్మ.. ఆపై కొన్నాళ్లకు బరువు తగ్గి తిరిగి...

Published : 12 Nov 2022 14:13 IST

(Photos: Instagram)

బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాలి.. కఠినమైన వ్యాయామాలు చేయాలి.. అనుకుంటారు చాలామంది. ఇక ప్రసవానంతరం బరువు తగ్గాలంటే మాత్రం మరింత చెమటోడ్చాల్సిందే అనుకుంటారు. కానీ అంత కష్టపడాల్సిన అవసరం లేదంటోంది బాలీవుడ్‌ బ్యూటీ అనితా హస్సానందాని. గతేడాది ఫిబ్రవరిలో తల్లైన ఈ ముద్దుగుమ్మ.. ఆపై కొన్నాళ్లకు బరువు తగ్గి తిరిగి ఫిట్‌గా మారే ప్రక్రియను ప్రారంభించింది. అయితే బరువు తగ్గడమనేది సుదీర్ఘ ప్రక్రియే అయినా.. పట్టుదలతో ప్రయత్నిస్తే అదనంగా పెరిగిన కిలోల్ని సునాయాసంగా తగ్గించుకోవచ్చని చెబుతూ తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది అనిత. తాను ప్రసవానంతరం బరువు తగ్గడానికి దోహదం చేసిన ఓ చిట్కానూ ఇందులో భాగంగా పంచుకుందీ అందాల అమ్మ. అదేంటో మనమూ చదివేద్దామా మరి!

మహిళలు గర్భం ధరించాక కొంత బరువు పెరగడం సహజమే! అయితే ప్రసవం తర్వాత ఈ అదనపు బరువును తగ్గించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అందులోనూ కచ్చితమైన ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలం అనుకుంటారు. కానీ ఇలా కడుపు మాడ్చుకోకుండానే డెలివరీ తర్వాత బరువు తగ్గేశానంటోంది అనిత.

‘జీరో డైట్‌’తో తగ్గా!

ప్రసవం తర్వాత తీసుకున్న వీడియోకు, తాజాగా బరువు తగ్గాక తీసుకున్న వీడియోను జతచేసి రూపొందించిన షార్ట్‌ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న అనిత.. ఈ క్రమంలో తాను పాటించిన ఓ చిట్కాను క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. ‘స్థిరత్వంతోనే ఎలాంటి సుదీర్ఘ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు.. బరువు తగ్గే క్రమంలోనూ ఇదే కీలకం. నా విషయంలోనూ ఇది పని చేస్తోంది. నేను జీరో డైట్‌తో నా ప్రసవానంతర బరువును తగ్గించుకుంటున్నా. నోరు కట్టేసుకోకుండా అన్ని పదార్థాలూ తింటున్నా..’ అంటూ తన సీక్రెట్‌ని బయటపెట్టిందీ ముద్దుగుమ్మ. ఈ చక్కనమ్మ పోస్ట్‌కు చాలామంది స్పందిస్తున్నారు. ‘పట్టుదల, కృషితోనే మీకు ఇది సాధ్యమైంది..’ అంటూ అటు నెటిజన్లు, ఇటు సెలబ్రిటీలు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ప్రసవానంతర బరువు గురించి అనిత ఇలా పోస్టు పెట్టడం ఇది తొలిసారేమీ కాదు.. గతంలోనూ పలు ఫొటోలు, వ్యాయామం చేస్తోన్న వీడియోల్ని ఇన్‌స్టాలో పంచుకుంటూ.. ‘బరువు తగ్గడం అంత సులభం కాదు.. అలాగని అసాధ్యం కూడా కాదు.. సానుకూల దృక్పథంతో ప్రయత్నించాలి..’ అంటూ క్యాప్షన్ జత చేసిందీ బాలీవుడ్‌ మామ్.


డైటింగ్‌ చేయకుండానే ఇలా తగ్గచ్చు!

పాపాయి పుట్టాక బరువు తగ్గాలంటే నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు  నిపుణులు. నచ్చినవి తింటూనే అదనపు క్యాలరీలు ఇలా కరిగించుకోవచ్చంటున్నారు. దీన్నే ‘జీరో డైట్‌’గా పేర్కొంటున్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని నియమాలు పాటించడం మాత్రం తప్పనిసరి అని చెబుతున్నారు. అవేంటంటే..!

♣ చనుబాలివ్వడం వల్ల కూడా ప్రసవానంతర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఇలా బిడ్డ ఆకలిని బట్టి నిర్ణీత వేళల్లో పాలివ్వడం వల్ల నెలకు కిలో చొప్పున తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ క్రమంలో పాల ఉత్పత్తిని పెంచే మెంతులు, సోంపు, వాము.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

♣ చక్కెర పేరుతో తీపి పదార్థాలు తినాలన్న కోరికను చంపుకోకుండా.. దానికి ప్రత్యామ్నాయాల్ని వెతుక్కోవడం ఉత్తమం. ఈ క్రమంలో బెల్లం, డేట్స్‌.. వంటివి ఉపయోగించి తయారుచేసిన స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకోవాలి.

♣ త్వరగా బరువు తగ్గాలన్న ఆతృత పనికి రాదు. కాబట్టి సాధ్యమయ్యే లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలి. ఈ క్రమంలో వారానికి అరకిలో చొప్పున తగ్గేలా ప్రణాళిక పెట్టుకోవాలి. దాన్ని చేరుకునే దిశగా ప్రయత్నం చేయాలి.

♣ కొత్తగా తల్లైన మహిళలు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. ప్రసవానంతరం బరువు తగ్గడానికి ఇది పరోక్షంగా దోహదం చేస్తుంది. అలా కాకుండా అవిశ్రాంతంగా ఉండి ఒత్తిడికి లోనైతే దాని ప్రభావం ఇటు మీ శరీరంపై, అటు మీ బుజ్జాయి ఆరోగ్యంపై పడుతుంది.

♣ బీన్స్‌, బ్రకలీ, బెర్రీస్‌, డ్రైఫ్రూట్స్‌, ముడి ధాన్యాల్లో.. పీచు ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా ఆకలేయదు.. దీనివల్ల సులభంగా బరువు తగ్గచ్చు.

♣ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, కాయధాన్యాలు, పప్పులు, నట్స్‌, గింజలు, పాలు-పాల ఉత్పత్తులు.. వంటివి తీసుకుంటూ, వ్యాయామాలు చేయడం వల్ల.. కండరాల చుట్టూ పేరుకున్న కొవ్వులు కరుగుతాయి. తద్వారా అటు బరువూ తగ్గచ్చు.. ఇటు చక్కటి శరీరాకృతినీ సొంతం చేసుకోవచ్చు.

♣ సుఖ ప్రసవమైనా, సిజేరియన్‌ డెలివరీ అయినా.. ఆరు వారాల తర్వాత నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయడం వల్ల కూడా శరీరాన్ని తిరిగి ఫిట్‌గా మార్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని