Published : 03/12/2021 19:28 IST

ఆ విజయాలన్నీ ఒక్క కిడ్నీతోనే సాధించింది!

శారీరక శ్రమతో కూడిన ఆటల్లో రాణించడం అంత సులభం కాదు.. ఏళ్ల కొద్దీ సహనంతో శ్రమించాలి. వేటినైనా త్యాగం చేసేందుకు సిద్ధపడాలి. మానసికంగా దృఢంగా ఉండడంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా సహకరించాలి. కానీ మాజీ అథ్లెట్‌ అంజూ బాబీ జార్జ్‌ మాత్రం ఒకే కిడ్నీతో మైదానంలో అడుగుపెట్టింది. దీనికి తోడు పలు అనారోగ్యాలు వేధించినా దేశానికి అపురూప విజయాలు అందించింది. కెరీర్‌లో కొనసాగినంత కాలం తన క్రీడా స్ఫూర్తితో ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచిన అంజూ.. ప్రస్తుతం క్రీడల్లో లింగ సమానత్వం దిశగా కృషి చేస్తోంది. ఇందుకు గుర్తింపుగానే తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య నుంచి ‘ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా కీర్తి గడించింది. ఒలింపిక్‌ ఛాంపియన్లను తయారుచేయడమే తన లక్ష్యమంటోన్న ఈ ఐకానిక్‌ అథ్లెట్‌ క్రీడా జీవితాన్ని ఓసారి తరచి చూద్దాం..!

అంజూ బాబీ జార్జ్‌.. కేరళకు చెందిన ఈ మాజీ లాంగ్‌జంపర్‌ 2003లో ప్యారిస్‌ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కాంస్యం గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 2005 ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్‌లో 6.75 మీటర్లు దూకి రజతం సొంతం చేసుకుంది. ఇండియా నుంచి అంజూ మాత్రమే ఈ ఘనత సాధించడం విశేషం. అయితే స్వర్ణం గెలిచిన రష్యా క్రీడాకారిణి డోపీగా తేలడంతో 2014లో అంజూ రజత పతకం.. స్వర్ణంగా మారింది. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన (6.83)తో ఆరోస్థానంలో నిలిచింది. అయితే అమెరికన్‌ అథ్లెట్‌ మరియన్‌ జోన్స్‌ డోపింగ్‌లో పట్టుబడడంతో ఆమెకు ఐదో స్థానం దక్కింది. ఇవే కాకుండా 2002 బుసాన్‌ ఆసియా క్రీడల్లో స్వర్ణం, అదే ఏడాది మాంచెస్టర్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో ఓ కాంస్యం, 2006 దోహా ఆసియా గేమ్స్‌లో రజతం నెగ్గింది.

ఒక్క కిడ్నీతోనే సాధించాను!

ఇలా లాంగ్‌జంప్‌లో ఎన్నో అపురూప విజయాలు, పతకాలు సాధిస్తూ భారత అథ్లెటిక్స్‌కే వన్నె తెచ్చింది అంజు. అయితే ఈ విజయాలన్నీ తాను ఒక్క కిడ్నీతోనే సాధించానంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిందీ మాజీ లాంగ్‌జంపర్‌. 2013లో తన అథ్లెటిక్స్‌ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన ఆమె.. ప్రస్తుతం ‘అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’కు ఉపాధ్యక్షురాలిగా, ‘ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌’లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా.. ఇలా పలు హోదాల్లో కొనసాగుతోంది.
‘ఒక్క కిడ్నీతో ఇన్ని విజయాలు సాధించడం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి. నొప్పులు తగ్గడానికి పెయిన్‌ కిల్లర్‌ తీసుకుంటే అలర్జీ వచ్చేది. అంతేకాదు.. ఒక కాలి భాగమంతా తిమ్మిరిగా ఉండి జంప్ చేసే సమయంలో తీవ్ర అసౌకర్యం కలిగేది. వీటి ప్రభావంతో అపస్మారక స్థితికి గురై ఆస్పత్రిలో చేరిన సందర్భాలూ బోలెడున్నాయి! ఇలా ఎన్నో ఇబ్బందులున్నా వాటన్నింటినీ అధిగమించా..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది అంజూ.

నా భర్తే నాకు కొండంత అండ!

ట్రిపుల్‌ జంప్‌లో నేషనల్‌ ఛాంపియన్‌ అయిన రాబర్ట్‌ బాబీ జార్జ్‌ను వివాహం చేసుకుంది అంజు. కోచ్‌గా అతనికి చాలా అనుభవం ఉంది. ఈ దంపతులకు అరోన్‌ అనే కుమారుడు, ఆండ్రియా అనే కుమార్తె ఉన్నారు. అయితే కెరీర్‌ ఆరంభంలో తన భర్త సహాయంతోనే అథ్లెట్‌గా ఎదిగానంటోంది అంజు. అంతేకాదు.. అనారోగ్యాలతో క్రీడా కెరీర్‌పైనే సందిగ్ధం నెలకొన్న సమయంలోనూ ఆయనే అండగా ఉన్నాడని చెబుతోంది.

‘2001లో కొన్ని కారణాల వల్ల బెంగళూరులో హెల్త్‌ చెకప్‌కు వెళ్లినప్పుడు నాకు ఒక కిడ్నీయే పని చేస్తోందన్న విషయం తెలుసుకొని షాకయ్యా. దీంతో నా క్రీడా కెరీర్‌ గురించి సందిగ్ధంలో పడ్డాను. అయితే ఎలాంటి అనారోగ్యాలు ఎదురుకానంత వరకు క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చని వైద్యులు సూచించడం కాస్త ఉపశమనం కలిగించింది. ఆ సమయంలో నా భర్త నాకు అండగా నిలిచాడు. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే తన కిడ్నీ ఇస్తానన్నాడు. ఇక 2003లో ప్యారిస్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో నేను కాంస్య పతకం నెగ్గాను. అయితే సరిగ్గా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు కిడ్నీ సమస్య మళ్లీ తిరగబెట్టింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. వైద్యులు ఆరు నెలలు విశ్రాంతి అవసరమన్నారు. కానీ నేను పోటీల్లో పాల్గొనడానికే ప్రాధాన్యమిచ్చాను. అనుకున్నట్లే పతకం సాధించాను..’ అంటూ ఆట పట్ల తనకున్న మక్కువను మరో సందర్భంలో చాటుకుందీ మాజీ అథ్లెట్‌.

అదే నా లక్ష్యం!

ఆటల్లో కొనసాగే క్రమంలో తన క్రీడాస్ఫూర్తితో ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచిన అంజూ.. ప్రస్తుతం ఈ రంగంలో లింగ సమానత్వం దిశగా కృషి చేస్తోంది. ఇందుకు గుర్తింపుగానే తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య నుంచి ‘ఉమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం గెలుచుకుంది. ఈ అవార్డు వరించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచిందీ మాజీ ఛాంపియన్‌. అయితే అనారోగ్యాలను అధిగమించి తన జీవితాన్ని ఆటకు అంకితం చేసిన తాను.. భవిష్యత్తులో ఒలింపిక్‌ ఛాంపియన్లను తయారుచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానంటోంది.

‘క్రీడలే నా ఊపిరి. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం నెగ్గిన నాకు ఒలింపిక్స్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అందుకే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం ఛాంపియన్లను తయారుచేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నా. అప్పటికీ ఇప్పటికీ క్రీడాకారులకు సమకూర్చే సౌకర్యాల్లో చాలా మార్పులొచ్చాయి. ఈ రంగంలో ఆసక్తి కనబరిచే వారి సంఖ్యా క్రమంగా పెరుగుతోంది. అమ్మాయిలు కూడా ఆటల్ని కెరీర్‌ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. అలాంటి వారిని మరింత ప్రోత్సహించాలనుకుంటున్నా..’ అంటోంది అంజు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి