నాన్న కష్టమే... నన్ను వ్యాపారవేత్తను చేసింది..!

ఏడాదంతా వ్యవసాయానికి పడే కష్టంకన్నా... రైతుకు కూలీల ఖర్చు భరించడమే ఎక్కువ. చిన్నప్పటి నుంచి సేద్యంలో తండ్రి పడే ఇటువంటి ఇబ్బందులెన్నో చూసిందీమె. నాన్నలాంటి రైతులందరికి తన వంతు ఏదైనా చేయాలనే లక్ష్యంతో చదువుకుంది.

Updated : 08 Jul 2024 07:06 IST

ఏడాదంతా వ్యవసాయానికి పడే కష్టంకన్నా... రైతుకు కూలీల ఖర్చు భరించడమే ఎక్కువ. చిన్నప్పటి నుంచి సేద్యంలో తండ్రి పడే ఇటువంటి ఇబ్బందులెన్నో చూసిందీమె. నాన్నలాంటి రైతులందరికి తన వంతు ఏదైనా చేయాలనే లక్ష్యంతో చదువుకుంది. పంట పండించడానికి రైతులకు చేదోడుగా ఉండే పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. కుటుంబంలో తొలి వ్యాపారవేత్తగానూ... నిలిచిన అన్నెపు లక్ష్మీ రాధను ‘వసుంధర’ పలకరించింది.

మాది శ్రీకాకుళంలోని చిన్నహరిశ్చంద్రపురం. మాకున్న నాలుగున్నర ఎకరాలను నాన్న పండించేవారు. అమ్మ గృహిణి. తరగతులన్నింటిలోనూ... మొదటి ర్యాంకు తెచ్చుకునేదాన్ని. హాస్టలు నుంచి సెలవులకు ఇంటికొచ్చినప్పుడు వాళ్ల ఇబ్బందులు చూసేదాన్ని. దుక్కి దున్నడం నుంచి పంట చేతికొచ్చేలోపు ఎంతో కష్టపడేవారు. పంట పండిన తర్వాత అప్పు చేసి, కూలీలిచ్చి కోత కోయించేవారు. ఇంత చేసినా మిగిలేది తక్కువే. దాంతో వారి కష్టమంతా వృథా అయ్యిందనిపించేది. ఎన్నిసార్లు ఆర్థిక కష్టాలెన్నెదురైనా.. తిరిగి వ్యవసాయాన్నే ఎంచుకుంటారు. అది చూసి సేద్యానికి సంబంధించిందే చదవాలని అనకాపల్లిలో ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫ్రీ సీటు దక్కించుకొని డిగ్రీ చేశా.

పరిశోధన..

కోర్సులో భాగంగా ‘ప్రాక్టికల్‌ అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం (పాంప్‌)’ పేరుతో భూమి, విత్తనాలు, ఎరువులిచ్చారు. పండించడం నుంచి ఆ పంటను మార్కెటింగ్‌ చేయడం వరకు మా బాధ్యతే. అలా నేను మొక్కజొన్న పండించినప్పుడు పంటకు వ్యాధి సోకింది. పురుగుపట్టి, కంకులను చాలా తక్కువ ధరకు విక్రయించాను. తీవ్ర నష్టంతోనే నివేదికను సమర్పించా. అప్పుడే ప్రయోగాత్మకంగా వ్యవసాయంలోని కష్టాలు తెలిశాయి. ఆ తర్వాత పీజీ చేయాలంటే ఇంటి ఆర్థికపరిస్థితి మెరుగ్గా లేక, ఉద్యోగంలో చేరా.

రైతులతో..

జర్మనీ సంస్థ ‘ప్లాంటిక్స్‌’లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ విభాగంలో చేరా. ఎరువులు, విత్తనాల దుకాణాల వివరాలు, ఆయా ప్రాంతాలను మ్యాపింగ్‌ చేసేదాన్ని. రైతులకు ఈ యాప్‌ ద్వారా వివరాలు అందేవి. అలాగే పంటకొచ్చే వ్యాధులు, వాడాల్సిన ఎరువుల గురించి రైతులకు అవగాహనందించేదాన్ని. ఆంధ్ర, తెలంగాణల్లో 5వేలమందికిపైగా రైతులను ఈ యాప్‌తో అనుసంధానం చేశా. అలా రైతులను కలిసే అవకాశం వచ్చేది. ఖర్చులు భరించలేని నాన్నలాంటివారే ఎక్కువ కనిపించేవారు. మనదేశంలో వ్యవసాయంపై ఆధారపడేవారిలో ముప్పావు వంతుమంది చిన్న, మధ్యతరగతి రైతులే. దుక్కిదున్నడానికి ట్రాక్టరు అద్దె, ఎరువులు కొనడం, కూలీల ఖర్చులే వీరికి పెనుభారం. గతంలో ఎరువులు తక్కువ. ఎద్దులతో పని పూర్తయ్యేది. సాంకేతికత పెరిగి, యంత్రాల వినియోగం తప్పనిసరైంది. అలాగని ట్రాక్టరుపై పెట్టుబడి పెట్టలేక, గంటకు రూ.1500-2000 అద్దె చెల్లిస్తూ మధ్య, పేదరైతులు అప్పుల పాలవుతున్నారు.

ఆ ఆలోచనే...

ఓ చిన్నరైతుకు చేతి స్ప్రే పంపు, సీడర్, మినీ టిల్లర్, బ్రష్‌ కట్టర్‌వంటివి ఉంటే సొంతంగా పని పూర్తవుతుంది. ఇదే నాకు రైతుకు చిన్న యంత్రాలను అందించాలనే ఆలోచననిచ్చింది. దేశమంతా తిరిగి ఆయా ప్రాంతాల్లో నల్లరేగడి, ఎర్రనేల అంటూ.. భూమి, వాతావరణంతోపాటు ఎటువంటి మెషినరీ ఉపయోగపడుతుందనే వాటిపై అధ్యయనం చేశా. ఆయా నేలలకు తగ్గ యంత్రాలపై అవగాహనతో కరీంనగర్, నందిమేడారానికి చెందిన బొడ్డు వంశీకృష్ణతో కలిసి 2021లో ‘గ్రీన్‌ జోన్‌ అగ్రిమెక్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌’ ప్రారంభించా. తనదీ రైతు కుటుంబమే. రూ.5 లక్షలు బ్యాంకు రుణం తీసుకున్నాం. సేద్యంలో ఉపయోగించే యంత్రాలను తయారుచేసే జర్మనీ సంస్థతో కలిసి పనిచేస్తూ,  మన రైతు అవసరానికి తగిన చిన్నాపెద్ద టూల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. వీటి పనితీరుపై శిక్షణ కూడా తీసుకొన్నాం. కొన్నింటి విడిభాగాలను తెప్పించి టూల్‌గా కూడా బిగించగలం.

సర్వీస్‌ పెంచాలి..

గ్రామీణప్రాంతాల్లోని ‘ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌’ సభ్యులను కలిసి ఈ యంత్రాలపై అవగాహన కల్పిస్తుంటాం. తక్కువ ఖరీదైతే రైతులే సొంతంగా కొనుక్కుంటాడు. ఎక్కువ ధర యంత్రాలను మండల స్థాయిలో ఆర్గనైజేషన్‌ తరఫున కొనుగోలు చేసి అవసరమైనప్పుడల్లా అందరూ వినియోగించుకుంటున్నారు. అలా 60కిపైగా రకాల యంత్రాలను ప్రస్తుతం రైతులకు చేర్చగలుగుతున్నాం. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో వినియోగదారులున్నారు. టూల్స్‌ విక్రయించడంతోపాటు వాటిని సర్వీస్‌ చేసిస్తున్నాం. త్వరలో మా సర్వీస్‌ను దేశవ్యాప్తం చేయాలనేది మా లక్ష్యం. రూ.3 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. మావద్ద 30మంది వరకు ఉపాధిని పొందుతున్నారు. మా కుటుంబంలో చదువుకున్న తొలితరం అమ్మాయిని. ఉద్యోగం నుంచి వ్యాపారవేత్తగా మారినప్పుడు అమ్మ భయపడింది. నాన్న నేను ఉద్యోగం చేయడమే మంచిదనుకుంటారు. భవిష్యత్తులో వారిద్దరినీ గర్వపడేలా చేస్తా. మరెందరికో ఉపాధినీ... కల్పిస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్