Updated : 08/01/2022 19:01 IST

అందుకే నీకు నా ప్రేమ తప్ప ఏమివ్వగలను?

ఎంతసేపూ ‘నేనింత లావుగా ఉన్నానేంటి.. చర్మంపై ఈ స్ట్రెచ్‌మార్క్స్‌ ఏంటి అసహ్యంగా..!’ అంటూ మన శరీరాన్ని మనమే ఆడిపోసుకుంటాం.. ఇతరులతో పోల్చుకుంటూ ఆత్మన్యూనతకు గురవుతుంటాం. కానీ మన కష్టసుఖాల్లో ఎవరు తోడున్నా, లేకపోయినా ఎల్లవేళలా మన వెంట ఉండేది మాత్రం మన శరీరమేనన్న విషయం మాత్రం గ్రహించం.. ఈ నిజాన్ని గ్రహించినప్పుడే ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించగలుగుతామంటోంది సెలబ్రిటీ కిడ్‌ అన్షులా కపూర్‌. ఎప్పుడూ బొద్దుగుమ్మగా కనిపించే ఈ కపూర్‌ బ్యూటీ.. ఇన్నాళ్లూ తన శరీరాన్ని నిర్లక్ష్యం చేసినా.. ఇప్పుడు మాత్రం ఎంతగానో ప్రేమిస్తున్నానంటోంది. ఈ నేపథ్యంలోనే స్వీయ ప్రేమను చాటేలా ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

అన్షులా కపూర్‌.. బాలీవుడ్‌ దర్శకుడు బోనీ కపూర్‌ గారాల పట్టిగా, హ్యాండ్‌సమ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ ముద్దుల చెల్లెలిగా ఈ చక్కనమ్మ అందరికీ సుపరిచితమే! అయితే ఏవైనా ప్రత్యేక సందర్భాలు, ఫ్యామిలీ ఫంక్షన్లు మినహా కెమెరాకు చాలా దూరంగా ఉంటుందీ బబ్లీ గర్ల్‌. తన కుటుంబంతో గడిపే క్షణాల్ని మాత్రం సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతుంటుంది.

నా సుఖదుఃఖాల్లో భాగమైంది!

అన్షుల చిన్నతనం నుంచే కాస్త బొద్దుగా ఉండే అమ్మాయి. అయితే ఇన్నాళ్లూ తనలోని ఈ ప్రతికూలతల్నే లోపాలుగా భావించి నిర్లక్ష్యం చేశానని.. ఆలస్యంగానైనా ఈ నిజాన్ని గ్రహించి శరీరాన్ని ప్రేమించడం నేర్చుకున్నానంటోంది. స్వీయ ప్రేమ వల్లే మనల్ని మనంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసుకోగలమని చెబుతూనే.. బాడీ పాజిటివిటీని ప్రతిబింబించేలా ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది అన్షుల.

ప్రముఖ రచయిత్రి హోలీ హోల్డెన్‌ రాసిన కవితకు సంబంధించిన క్లిప్పింగ్‌ను ఇన్‌స్టాలో పంచుకున్న ఈ బబ్లీ బ్యూటీ.. ‘నల్లటి వలయాలు, స్ట్రెచ్‌ మార్క్స్‌, సెల్యులైట్‌, వదులైన చర్మం, నెరిసిపోయిన జుట్టు, ముడతలు, నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు.. నా శరీరంలో భాగమైన వీటన్నింటినీ ఇప్పుడిప్పుడే నేను ప్రేమించడం నేర్చుకుంటున్నా. నా 30 ఏళ్ల జీవిత ప్రయాణంలో నా శరీరం నాకు ఎన్నో విధాలుగా సహాయపడింది. గాయాల బారి నుంచి నేను కోలుకునేలా చేసింది.. నేను చక్కగా శ్వాసించేలా చేసింది. ప్రేమించడం, ప్రేమను పొందడమెలాగో నేర్పింది. సుఖదుఃఖాల మధ్య బతకడమెలాగో తెలియజేసింది. నేను ఏది పడితే అది, ఎంత పడితే అంత తిన్నా అంగీకరించింది.. బరువు తగ్గాలని కఠినమైన ఆహార నియమాలకు అలవాటు పడ్డా సహించింది. హాయిగా నిద్ర పోయినప్పుడే కాదు.. నిద్రలేని రాత్రులు గడిపినప్పుడూ నా వెంటే ఉంది. అది చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా.. నేను పొందిన ఆనందంలో భాగం పంచుకుంది. శారీరకంగా, మానసికంగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా వాటితో పోరాడిందే తప్ప వెనకడుగు వేయలేదు. ఇలా ఇన్నేళ్ల నా జీవితానికి ప్రతిబింబంలా నిలిచిన నా శరీరానికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది.

ప్రేమ తప్ప ఇంకేమివ్వగలను?!

నా కోసం ఇన్ని చేసిన నా శరీరానికి నేను చేయగలిగింది ఒక్కటే.. అదేంటంటే.. నా శరీరంలో నాకు నచ్చిన, నేను ప్రతికూలతలుగా భావించిన భాగాల్ని సరిసమానంగా ప్రేమించడం! ఒక్కోసారి తను విధించే పరిమితులతో విసుక్కున్నా ప్రేమించడం మాత్రం ఆపను. ఇకపై నా శరీరం మాటే వింటాను. ఇన్నేళ్లూ నా శరీరంలోని ప్రతికూలతల్ని లోపాలుగా భావించి నిర్లక్ష్యం చేశాను. కానీ ఇకపై ఆ పొరపాటు చేయను. నాలో వచ్చిన ఈ మార్పు నాకు కొత్తగా, ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఎన్నో విధాలుగా నన్ను నన్నుగా ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా శరీరాన్ని ప్రేమించడం, గౌరవించడం కంటే ఇంకేం చేయగలను?!’ అంటోంది అన్షుల. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందంటూ అటు ప్రముఖులు, ఇటు నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది.

నటనంటే ఇష్టం!

* బోనీ కపూర్‌, ఆయన మొదటి భార్య మోనా కపూర్‌ల కుమార్తె అయిన అన్షుల తన క్యూట్‌ స్మైల్‌తో అందరినీ కట్టిపడేస్తుంటుంది. కాస్త బొద్దుగా ఉన్నా తను ఎంత చలాకీగా ఉంటుందో.. అన్ని విషయాల్లోనూ అంతే చురుగ్గా ఉంటుంది.

* అన్షుల చిన్నతనం నుంచీ చదువులో చాలా చురుకు. న్యూయార్క్‌లోని బార్నార్డ్‌ కాలేజ్‌లో ఆర్ట్స్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆమె.. వరుసగా మూడేళ్ల పాటు ‘Academic Excellence’ సర్టిఫికెట్స్‌ అందుకుంది.

* చదువు పూర్తి చేశాక వివిధ కంపెనీల్లో పనిచేసిందీ కపూర్‌ బ్యూటీ. ఈ క్రమంలోనే గూగుల్‌లో ఐదు నెలల పాటు ‘AdWords Representative’గా విధులు నిర్వర్తించింది.

* అన్షులకు చిన్నతనం నుంచే నటన అంటే ఇష్టం. ఇందులో భాగంగానే ‘Bhagwat Ajjukam’, ‘Oedipus’, ‘A Midsummer Night’s Dream’.. వంటి పలు స్టేజ్‌ షోలలో భాగమైందామె.

* మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ (MUN) సొసైటీలో సభ్యురాలిగా రెండేళ్ల పాటు (2006, 2007) పనిచేసింది అన్షుల. అంతర్జాతీయ చట్టం, బహుపాక్షిక సంబంధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే MUN ముఖ్యోద్దేశం.

* హృతిక్‌ రోషన్‌ ఫిట్‌నెస్‌ బ్రాండ్‌ HRX కు ఆపరేషన్స్‌ మేనేజర్‌గా ఏడాది పాటు పనిచేసిందీ బబ్లీ బ్యూటీ.

* అన్షులకు పెట్స్‌ అంటే ప్రాణం. ముఖ్యంగా తన పెంపుడు కుక్క Maximus Kapoorతో దిగిన ఫొటోల్ని తరచూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుందీ క్యూటీ.

* సమాజ సేవ చేయడంలోనూ ఈ కపూర్‌ వారసురాలు ముందే ఉంటుంది. ఈ క్రమంలోనే Fankind పేరుతో ఓ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటుచేసి.. దీని వేదికగా సెలబ్రిటీల నుంచి నిధులు సమీకరిస్తూ.. వాటిని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తోంది.

ఇక ఇటీవలే కరోనా బారిన పడిన అన్షుల ప్రస్తుతం హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి