Anshula Kapoor: నెలసరి గురించి అలా మాట్లాడుకునే రోజు రావాలి!
కొత్తగా చూసిన సినిమా గురించి పిచ్చాపాటీగా చర్చించుకుంటాం.. మరుసటి రోజు సీరియల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ముందే ఊహించుకుంటాం.. ఇక క్రికెట్ మ్యాచుల విషయానికొస్తే.. నిపుణుల్నే మించిపోయేలా ఆటను విశ్లేషించగలం! మరి, ‘వీటి గురించి ఇంత సాధారణంగా మాట్లాడుతున్న మనం.. నెలసరి విషయంలో ఎందుకు....
కొత్తగా చూసిన సినిమా గురించి పిచ్చాపాటీగా చర్చించుకుంటాం.. మరుసటి రోజు సీరియల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో ముందే ఊహించుకుంటాం.. ఇక క్రికెట్ మ్యాచుల విషయానికొస్తే.. నిపుణుల్నే మించిపోయేలా ఆటను విశ్లేషించగలం! మరి, ‘వీటి గురించి ఇంత సాధారణంగా మాట్లాడుతున్న మనం.. నెలసరి విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నాం?’ అనడగుతోంది నిర్మాత బోనీ కపూర్ కూతురు, నటుడు అర్జున్ కపూర్ చెల్లెలు అన్షులా కపూర్. మహిళలకు సంబంధించిన అంశాలపై నిర్మొహటంగా తన మనసులోని మాటను వ్యక్తం చేసే ఆమె.. ఈ సమాజంలో నెలసరిపై నెలకొన్న అపోహల్ని మరోసారి దూరం చేసే ప్రయత్నం చేసింది. ‘నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా.. పిరియడ్స్ గురించి అందరూ అతి సాధారణంగా చర్చించుకునే రోజు రావాలని కోరుకుంటూ ఇన్‌స్టాలో ఓ స్ఫూర్తిదాయక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం అది వైరలవుతోంది.
స్టార్ స్టేటస్‌తో సంబంధం లేకుండా..!
అన్షులా కపూర్.. నిర్మాత బోనీ కపూర్ కూతురిగా, నటుడు అర్జున్ కపూర్ చెల్లెలుగానే కాకుండా.. పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. సమాజ సేవ చేయడంలోనూ ముందే ఉంటుందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ‘Fankind’ పేరుతో ఓ సోషల్ మీడియా వేదికను ఏర్పాటుచేసి.. సెలబ్రిటీల నుంచి నిధులు సేకరిస్తోంది అన్షుల. వీటిని ఆయా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తోంది. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా మహిళలకు సంబంధించిన అంశాలపై స్పందిస్తుంటుందామె. బాడీ షేమింగ్, నెలసరి సమస్యలు, మహిళల విషయంలో సమాజంలో నెలకొన్న మూసధోరణులు.. వంటి అంశాలపై తరచూ ఇన్‌స్టా వేదికగా పలు స్ఫూర్తిదాయక పోస్టులు పెడుతుంటుందీ కపూర్ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా మరో ప్రేరణాత్మక పోస్ట్‌తో నేటి యువతుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిందామె. ఈ విషయంలో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలని కోరుకుంటోంది అన్షుల.
రహస్య పేర్లతో పిలవడమెందుకు?!
గతంలో పాపులరైన ‘రెడ్ డాట్ ఛాలెంజ్’ స్ఫూర్తితో నెలసరిపై ఉన్న అపోహల్ని ఇలా దూరం చేసే ప్రయత్నం చేసింది అన్షుల.
‘మహిళల్లో నెలసరి సహజంగా జరిగే ప్రక్రియ. నెలనెలా ఇది మన జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాలన్నీ తెలిసినా చాలామంది దీని గురించి బహిరంగంగా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఇంకొంతమంది దీని పేరునే మార్చేస్తున్నారు. ‘నెలలో ఆ సమయం..’, ‘నా ప్రాణ స్నేహితురాలొచ్చింది..’ ఇలా పిరియడ్స్‌ని ఒక్కొక్కరూ ఒక్కో రహస్య పేరుతో పిలుస్తున్నారు. మన జీవితంలో సర్వసాధారణమైపోయిన ఈ విషయాన్ని అసాధారణంగా ఎందుకు పరిగణిస్తున్నారో? మాట్లాడడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారో, భయపడుతున్నారో? నాకు అర్థం కావట్లేదు. మనం రోజూ చూసే టీవీ షోలు, సీరియల్స్ గురించి అందరితో సరదాగా మాట్లాడతాం.. మన భావాల్ని పంచుకోగలుగుతాం.. ఇంతే సాధారణంగా, నిర్మొహమాటంగా.. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి నెలసరి గురించి మాట్లాడుకునే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నా.
ఇలాంటి ప్రపంచాన్ని కోరుకుంటున్నా!
ప్రతి ఒక్కరికీ ‘నేను ఇలాంటి ప్రపంచంలో జీవించాల’న్న ఆశ ఉంటుంది. ఈ విషయంలో నేనేం కోరుకుంటున్నానంటే.. ‘కిరాణా స్టోర్లలో శ్యానిటరీ న్యాప్‌కిన్లు బయటికి కనిపించేలా.. వాటిని పేపర్/నలుపు రంగు కవర్లలో చుట్టివ్వకుండా ఉండే ప్రపంచంలో నేనుండాలనుకుంటున్నా.. అలాగే నెలసరి విద్యపై అవగాహన కల్పించే క్రమంలో అమ్మాయిల్ని, అబ్బాయిల్ని వేర్వేరు తరగతి గదిలో కూర్చోబెట్టకుండా ఒకే చోట కలిపి పాఠాలు చెప్పే రోజు రావాలి.. పిరియడ్ సమయంలో అమ్మాయిలు మైల పడ్డారు, వారు వంటింట్లోకి వెళ్లకూడదు, పలు ప్రదేశాలకు వెళ్లడం నిషిద్ధం, .. అన్న అపోహలు పూర్తిగా తొలగిపోయే సమాజంలో నేనుండాలనుకుంటున్నా. ఎందుకంటే ఇది శరీర ధర్మం. మనం దీన్ని అదుపు చేయలేం. కాబట్టి ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు.. మనల్ని మనం తక్కువ చేసి చూసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అబ్బాయిల్ని ఈ విషయంలో చైతన్యవంతుల్ని చేస్తూ.. ఈ సమయంలో మహిళలకు మానసికంగా అండగా నిలబడేలా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది..’ అంటోందీ కపూర్ బ్యూటీ. ఇలా అన్షుల పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చాలామంది స్పందిస్తూ.. నెలసరి విషయంలో తమ మనోభావాల్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మరికొందరు తమ పిరియడ్ స్టోరీస్‌ని పంచుకుంటున్నారు.
నాలుగు నెలలకోసారి పిరియడ్ వచ్చేది!
అయితే అన్షుల నెలసరి గురించి మాట్లాడడం ఇది తొలిసారేమీ కాదు.. యుక్త వయసులో తానూ పీసీఓఎస్, ఇతర నెలసరి సమస్యల్ని ఎదుర్కొన్నానంటూ గతంలో ఓ సందర్భంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందీ ముద్దుగుమ్మ.
‘పద్నాలుగేళ్ల వయసులో నాకు పీసీఓఎస్ నిర్ధారణ అయింది. దీనివల్ల మూడు నాలుగు నెలలకోసారి నాకు పిరియడ్స్ వచ్చేవి. ఈ క్రమంలో నెలసరి నొప్పులు మరింత తీవ్రంగా ఉండేవి. పిరియడ్స్ వచ్చినప్పుడల్లా వారాల పాటు కొనసాగేది. దీంతో చాలాసార్లు స్కూల్ కూడా మానేసేదాన్ని. అంతేకాదు.. ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా వచ్చేవి. ఇక పదో తరగతిలో వ్యాక్సింగ్ ద్వారా నా మీసాలు, గడ్డాన్ని తొలగించుకున్న సందర్భం నాకు ఇప్పటికీ గుర్తే. అలాగే కొన్ని వారాలకోసారి బ్లీచింగ్ పద్ధతిలో నా బుగ్గలపై ఉన్న అవాంఛిత రోమాలు తొలగించుకునేదాన్ని. మరోవైపు క్రమంగా బరువూ పెరిగిపోయా. అయితే ఈ దుష్ప్రభావాలన్నీ తొలగించుకొని పీసీఓఎస్‌ను అదుపులోకి తెచ్చుకోవాలంటే బరువు తగ్గాలని సూచించారు నిపుణులు. నిజానికి ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని, నన్ను నేను రియలైజ్ కావడానికి కొంత సమయం పట్టింది. ఒకప్పుడు నేనొక్కదాన్నే ఈ సమస్యతో బాధపడుతున్నానేమోనని అనుకునేదాన్ని. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆ తర్వాత నాకు అర్థమైంది. మన సమస్య మనలోనే ఉంచుకోవడం కంటే నలుగురితో పంచుకున్నప్పుడే వారిలో ధైర్యం, స్ఫూర్తి నింపగలం..’ అంటూ అప్పుడూ అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిందీ కపూర్ వారసురాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.