Published : 21/05/2022 15:19 IST

Work Life Balance : మా ఎమోషన్స్‌ మీరెందుకు అర్థం చేసుకోరు?!

(Photos: Instagram)

చంటి బిడ్డ తల్లిగా ఇటు ఇంటిని, అటు పనిని బ్యాలన్స్‌ చేయడం మహిళలకు కత్తి మీద సామే! అయితే కెరీర్‌పై మక్కువతో ఎంత కష్టమైనా ఇష్టంతో భరిస్తూ ముందుకు సాగుతుంటారు చాలామంది మహిళలు. తాను కూడా అంతే అంటోంది బాలీవుడ్‌ అందాల తార అనుష్కా శర్మ. ఏడాది పాపకు తల్లైన ఈ ముద్దుగుమ్మ.. సుదీర్ఘ విరామం తర్వాత తన రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించింది. మరోవైపు ఫొటోషూట్స్‌లోనూ ఉత్సాహంగా పాల్గొంటోంది. ఈ క్రమంలో ఇటీవలే ఓ ప్రముఖ పత్రిక కవర్‌ గర్ల్‌గా మెరిసిన అనుష్క.. ఓ న్యూమామ్‌గా వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ విషయంలో తనకెదురైన అనుభవాలను సోషల్‌ మీడియా పోస్టుల రూపంలో పంచుకుంది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

ది మోస్ట్‌ వాంటెడ్‌ సెలబ్రిటీ కపుల్‌గా పేరుగాంచారు అనుష్కా శర్మ – విరాట్‌ కోహ్లీ. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట.. 2021లో వామిక అనే పాపకు జన్మనిచ్చింది. ఇక అప్పట్నుంచి పాప ఆలనా పాలనకే సమయం కేటాయిస్తోన్న ఈ చక్కనమ్మ.. ఇటీవలే ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’తో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టింది. అయితే నిజానికి ఈ ప్రాజెక్ట్‌ కరోనాకు ముందే ప్రారంభించినా.. కొవిడ్‌, తను గర్భం దాల్చడం వల్ల ఆగిదంటూ చెప్పుకొచ్చింది అనుష్క. ఇటీవలే ఓ ప్రముఖ పత్రిక కవర్‌ గర్ల్‌గా మెరిసిన ఆమె.. ఈ విశేషాలతో పాటు తన వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌కు సంబంధించిన విషయాల్ని కూడా పంచుకుంది.

మనసు మాట విన్నా!

‘చక్దా ఎక్స్‌ప్రెస్‌ని కరోనాకు ముందే ప్రారంభించా. అయితే అంతలోనే కొవిడ్‌ ప్రభావం ఎక్కువవడం, ఆపై నేను గర్భం దాల్చడంతో ఈ ప్రాజెక్ట్‌ వాయిదా పడింది. అయితే వామిక పుట్టి ఏడాది గడిచాక దీనిపై మళ్లీ దృష్టి పెట్టాను. ఆ సమయంలో కాస్త నెర్వస్‌గా అనిపించింది. ‘చిన్న పాప తల్లిని.. గతంలోలాగా నా కెరీర్‌ని కొనసాగించగలనా?’ అని నాపై నాకే సందేహం కలిగింది. పైగా 18 నెలల పాటు వ్యాయామాలకూ దూరమవడంతో శారీరక దృఢత్వాన్నీ కోల్పోయాననిపించింది. ఇలాంటి తరుణంలో నా మనసు నాకు పదే పదే ఒకటే చెబుతుండేది.. ‘నువ్వు చేయగలవు!’ అని. ఆ ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగుతున్నా. సినిమాల్ని ఎంచుకునే/నిర్మించే విషయంలో సంతృప్తికే ప్రాధాన్యమిస్తా.. అంతేకానీ నామమాత్రంగా మాత్రం ఏ పనీ మొదలుపెట్టను.

..అయినా ఇష్టమే!

మనం చేసే పని మనకు నచ్చినప్పుడే అదెంత కష్టంగా ఉన్నా ఇష్టంతో చేయగలుగుతాం. నా విషయానికొస్తే నటనను ఆస్వాదిస్తా. ముఖ్యంగా క్రియేటివ్‌గా ఆలోచించే వ్యక్తులు, కొత్త కొత్త ఐడియాస్‌తో సన్నివేశాన్ని ఆసక్తికరంగా మలచగలిగే వారు ఎప్పుడూ నా చుట్టూ ఉండాలనుకుంటా. అలాగే ఫలానా సీన్‌కు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో ముందే ఊహించుకుంటా. నిజానికి సినిమా రంగం ఓ పరుగు పందెం లాంటిది. అందులో అలుపు లేకుండా పరిగెత్తినా ఎంతో సంతోషం, సంతృప్తి దక్కుతాయి. అందుకే ఎన్ని బాధ్యతలున్నా కెరీర్‌ని మాత్రం విడిచిపెట్టను. ఓ చంటి బిడ్డకు తల్లిగా వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవడం నాకే కాదు.. ప్రతి మహిళకూ కష్టమే! అమ్మయ్యాకే ఈ విషయం నాకు మరింత లోతుగా అర్థమైంది.

ఆ మద్దతు కావాలి!

ఈ పురుషాధిక్య ప్రపంచం మాత్రం వర్కింగ్‌ మదర్స్‌ భావోద్వేగాల్ని ఎందుకు గ్రహించదో అర్థం కాదు. వాళ్ల ఎమోషన్స్‌ని అర్థం చేసుకొని వారికి మద్దతిచ్చినప్పుడే అన్నింట్లోనూ సక్సెస్‌ కాగలుగుతారు. ఇలా ఇంటి సభ్యులే కాదు.. పని ప్రదేశంలోనూ మహిళలకు మరింత సపోర్ట్‌ అవసరం. అలాగని మహిళల పరిస్థితుల్ని అర్థం చేసుకొని వారిని ప్రోత్సహించే పురుషులూ కొంతమంది ఉంటారు. అందరూ వారిలా ఆలోచించగలగాలి. మన చుట్టూ మనల్ని ప్రోత్సహించే వారి కంటే విమర్శించే వారే ఎక్కువగా ఉంటారు. వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదు. అయితే ట్రెండ్‌కు తగ్గట్లుగా మనల్ని, మన పనితీరును మార్చుకోవడం మాత్రం చాలా ముఖ్యం. ఆఖరుగా ఒక్క మాట.. పనిని మనం ఎంతగా ప్రేమిస్తామో.. ఈ హడావిడిలో పడిపోయి పిల్లల్ని మాత్రం నిర్లక్ష్యం చేయద్దు. అప్పుడే మనమూ ఎదగగలుగుతాం.. పిల్లలకూ బంగారు భవిష్యత్తును అందించగలుగుతాం..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

<