Anushka: ఆ సమస్య ఉంది.. అందుకే నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేను!

అనుష్కా శెట్టి.. ఈ పేరు తలచుకోగానే బాహుబలి సినిమాలో దేవసేన రూపమే కళ్ల ముందు కనిపిస్తుంది. చక్కటి అందం, అభినయం ప్రదర్శిస్తూనే.. రాజసం ఒలికించేలా ఆమె చేసిన ఈ పాత్ర సినీ అభిమానుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇదే కాదు.. తన నటనతో తెరపై విభిన్న పాత్రలకు ప్రాణం పోయడంలో ఆమెకు ఆమే సాటి!

Published : 25 Jun 2024 12:33 IST

(Photos: Instagram)

అనుష్కా శెట్టి.. ఈ పేరు తలచుకోగానే బాహుబలి సినిమాలో దేవసేన రూపమే కళ్ల ముందు కనిపిస్తుంది. చక్కటి అందం, అభినయం ప్రదర్శిస్తూనే.. రాజసం ఒలికించేలా ఆమె చేసిన ఈ పాత్ర సినీ అభిమానుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇదే కాదు.. తన నటనతో తెరపై విభిన్న పాత్రలకు ప్రాణం పోయడంలో ఆమెకు ఆమే సాటి! అయితే ఈ టాలీవుడ్‌ స్టార్‌ నాయిక.. నిజ జీవితంలో ఓ అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు ఇటీవలే వెల్లడించింది. దానివల్ల తనకు ఎదురైన అనుభవాలనూ పంచుకుంది. ఇది విని ఆమె ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. మరి, ఇంతకీ ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఆ సమస్యేంటి? తెలుసుకుందాం రండి..

‘బాహుబలి’ తర్వాత పలు చిత్రాల్లో నటించి అలరించింది అనుష్క. సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ఈ భామ.. తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాల్ని ఈ వేదికగా పంచుకుంటుంటుంది. అయితే ఇటీవలే ఓ సందర్భంలో తనకు ఉన్న ఓ అరుదైన సమస్య గురించి బయటపెట్టింది అనుష్క. దాని కారణంగా ఎదురైన అనుభవాల్ని ఇలా పంచుకుంది.

నాకు మాత్రం అది సమస్యే!

‘నాకు లాఫింగ్‌ డిసీజ్‌ ఉంది. నవ్వడం కూడా ఓ సమస్యేనా అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు మాత్రం అదే పెద్ద సమస్య! ఎందుకంటే నేను నవ్వడం ప్రారంభిస్తే 15-20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటా. కామెడీ సినిమాలు చూసినా, కామెడీ సీన్లు చేస్తున్నప్పుడైనా.. ఒకసారి నవ్వడం మొదలుపెడితే ఆపుకోలేను. ఒక్కోసారి పడీ పడీ నవ్వేస్తుంటా. ఇలా నా నవ్వు కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నిజానికి దీనివల్ల నాకు ఎంతో అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. కానీ చిత్ర బృందం మాత్రం ఈ సమయాన్ని టీ, కాఫీ, స్నాక్స్‌ తీసుకోవడానికి విరామంగా ఉపయోగించుకుంటుంది.. ఇలా వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ నలుగురితో కలిసి మాట్లాడేటప్పుడు ఈ సమస్యతో పలు సవాళ్లు ఎదురవుతుంటాయి..’ అంటూ తన అనుభవాల్ని పంచుకుందీ అందాల తార.


అసలేంటీ పీబీఏ?

అనుష్క లాంటి సమస్యనే కొంతమంది ఎదుర్కొంటుంటారు. ఇలా అనుకోకుండా సడన్‌గా వచ్చే నవ్వును అదుపు చేసుకోలేని ఈ సమస్యనే ‘Pseudobulbar Affect (PBA)’గా పేర్కొంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా నవ్వునే కాదు.. కొందరు ఏడుపునూ ఆపుకోలేరట! అరుదైన నాడీ సంబంధిత సమస్య అయిన ఈ డిజార్డర్‌తో వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఎమోషనల్‌గానూ పలు సవాళ్లు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ సమస్య ఉన్న వారే కాదు.. వారి చుట్టూ ఉన్న వారూ అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువంటున్నారు.

కారణాలివేనా?!

మెదడుకు గాయాలవడం, బ్రెయిన్‌ స్ట్రోక్, కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన Multiple sclerosis (MS), అల్జీమర్స్‌ వ్యాధి, Amyotrophic Lateral Sclerosis (ALS).. వంటి మెదడు సంబంధిత సమస్యల కారణంగా.. భావోద్వేగ వ్యక్తీకరణను నియంత్రించే నాడీ వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడతాయి. ఇదే ఈ సమస్యకు దారితీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో సదరు వ్యక్తి అనుభూతులు, భావోద్వేగాల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా నవ్వు, ఏడుపు వంటి ఎమోషన్స్.. కొన్ని సెకన్లు, నిమిషాల పాటు ఎపిసోడ్స్‌గా కొనసాగుతాయి.

ఎన్నెన్నో సమస్యలు!

పీబీఏ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నవ్వాల్సిన సందర్భంలో ఏడుపు రావడం, బాధతో కూడిన వాతావరణంలో నవ్వు రావడం, ఇది కూడా కొంతమందిలో కొన్ని సెకన్ల పాటే ఉండడం, మరికొందరిలో నిమిషాల పాటు కొనసాగడం జరుగుతుంటుందట! తమ ప్రమేయం లేకపోయినా చాలామంది విషయంలో ఈ సమస్య సామాజిక సంబంధాల్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నట్లు.. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలు, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యల బారిన పడేలా చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల స్క్రీనింగ్‌ టూల్స్‌, చికిత్సల ద్వారా ఈ సమస్యను గుర్తించచ్చంటున్నారు. ఈ అసాధారణ భావోద్వేగాల్ని పూర్తిగా నయం చేయలేకపోయినా.. కొన్ని రకాల మందుల ద్వారా అదుపు చేసుకోవచ్చని చెబుతున్నారు.


ఇవీ మేలు చేస్తాయ్!

 

⚛ అలాగే పీబీఏతో బాధపడే వారు తమ చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

⚛ కించపరచడం కాకుండా తమ సమస్యను అర్థం చేసుకొని మెలిగే వ్యక్తులే చుట్టూ ఉండేలా చూసుకోవాలి.

⚛ సడన్‌గా నవ్వొచ్చినా, ఏడుపొచ్చినా.. ఎపిసోడ్‌ పూర్తయ్యే వరకు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి. దీనివల్ల భావోద్వేగాల్ని కొంతవరకు అదుపు చేసుకునే శక్తి వస్తుంది.

⚛ ఇలా నవ్వే సమయంలో నచ్చిన అంశాల గురించి ఆలోచించడం, అభిరుచులపై దృష్టి పెట్టడం వల్లా సమస్యను కొద్దికొద్దిగా కంట్రోల్‌ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

⚛ ఒత్తిడి తగ్గించుకునేందుకు వ్యాయామాలు చేసినా కొంతవరకు ఫలితం ఉంటుందట!

⚛ ఇలాంటి సమస్యతో బాధపడే వ్యక్తుల్ని కలవడం, వారి అనుభవాలు తెలుసుకోవడం వల్ల ఒంటరితనం, మానసిక ఒత్తిడి దూరమవుతాయి. ఈ క్రమంలో వారు పాటించే చిట్కాలు తెలుసుకొని పాటించచ్చు.

వీటితో పాటు నిపుణుల కౌన్సెలింగ్‌ తీసుకోవడం, వారిచ్చే సలహాలు, సూచనలు పాటించడం వల్ల సమస్యను అదుపు చేసుకోవచ్చు.. నలుగురిలోనూ ఇబ్బంది పడకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్