‘స్టోరీ బాక్స్’.. ఇది కథల ఏటీఎం!
పఠనం ఒక మానసిక వైద్యం లాంటిది. అందుకే కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడు మనకు నచ్చిన పుస్తకం చదివి రిలాక్సవుతుంటాం. అయితే మామూలుగానే అయినా, సబ్జెక్టులో భాగంగానే అయినా.. ఓ పెద్ద పుస్తకం చదవడానికి పిల్లలు నీరసించిపోతారు. విషయమంతా సరళంగా, చిన్న కథ రూపం....
పఠనం ఒక మానసిక వైద్యం లాంటిది. అందుకే కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడు మనకు నచ్చిన పుస్తకం చదివి రిలాక్సవుతుంటాం. అయితే మామూలుగానే అయినా, సబ్జెక్టులో భాగంగానే అయినా.. ఓ పెద్ద పుస్తకం చదవడానికి పిల్లలు నీరసించిపోతారు. విషయమంతా సరళంగా, చిన్న కథ రూపంలో ఉంటే ఎంత బాగుంటుందో అనుకునే వారూ ఎక్కువే! సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేశారు హైదరాబాద్‌కు చెందిన అపర్ణా విశ్వనాథమ్. ఈ క్రమంలోనే తన టీమ్‌తో కలిసి ‘స్టోరీ బాక్స్’(లైబ్రరీ సొల్యూషన్స్)ను రూపొందించారామె. కథలు, గేయాలు, ఆసక్తికర విశేషాలు, పజిల్స్.. ఇలా సమాచారమంతా చిన్న బాక్స్‌లో పొందుపరిచి.. మనకు కావాల్సింది ఎంచుకోగానే క్షణాల్లో ప్రింట్ వచ్చేలా చిన్నారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పిల్లల్లో పఠనాసక్తిని, అదే సమయంలో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతోనే దీన్ని రూపొందించామంటోన్న అపర్ణ.. తన ‘స్టోరీ బాక్స్’ ప్రయాణాన్ని ‘వసుంధర.నెట్’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
నేను పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే! ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశాను. ఆపై ‘ఐఐఎం-కలకత్తా’లో ‘ఫైనాన్స్-ఎకనామిక్స్’ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశా. చదువు పూర్తయ్యాక ‘ఫిలిప్స్ ఇండియా’, ‘ఇక్రా’.. వంటి సంస్థల్లో సుమారు 10 ఏళ్ల పాటు పనిచేశా. ఆపై కొన్నేళ్ల పాటు పలు సోషల్ ఎంటర్‌ప్రైజెస్‌కు కన్సల్టెంట్‌గా విధులు నిర్వర్తించా.
ఎన్జీవోతో మొదలుపెట్టి..!
కొన్నేళ్ల తర్వాత విద్యారంగంలోకి అడుగుపెట్టిన నేను.. 2016లో నా స్నేహితులతో కలిసి ‘బుక్‌మార్క్ ట్రస్ట్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాను. ఇందులో భాగంగానే సంజీవయ్య పార్క్‌లో ‘డూ సైన్స్’ పేరుతో ఓ సైన్స్ సెంటర్‌ను ఏర్పాటుచేశా. పిల్లలకు సైన్స్ మోడల్స్‌ను పరిచయం చేసి.. వాటి ద్వారా ప్రయోగాత్మకంగా ఈ సబ్జెక్టును నేర్పించడమే దీని వెనకున్న ముఖ్యోద్దేశం. సైన్స్ మోడల్స్‌తో మొదలుపెట్టి విండ్స్ స్కల్ప్చర్స్ కూడా డిజైన్ చేశాం. ఏరో డైనమిక్ ఫోర్సెస్ ఉపయోగించి తయారుచేసిన ఈ విండ్స్ స్కల్ప్చర్స్‌తో పిల్లలు సరదాగా ఆడుకుంటూనే.. సైన్స్‌ని సులభంగా నేర్చుకోగలుగుతారు. మరోవైపు ఇవి ఆ ప్రదేశానికి అందాన్నీ జోడించగలుగుతాయి. ప్రస్తుతం హైదరాబాద్, కర్నూలు, ముంబయిల్లో పలు చోట్ల ఇవి అందుబాటులో ఉన్నాయి.
సవాళ్లకు సవాలుగా..!
ఇలా ఎన్జీవో విధుల్లో నిమగ్నమై ఉన్నప్పుడే.. పుస్తక పఠనం విషయంలో పిల్లలు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని గుర్తించగలిగా. చాలామంది పిల్లలకు స్కూళ్లలో గ్రంథాలయాలు అందుబాటులో లేవు. ఒకవేళ ఉన్నా అన్ని రకాల పుస్తకాలు అందులో దొరక్కపోవచ్చు.. అందరూ వాటిని కొనలేకపోవచ్చు.. కొందామనుకున్నా ఏది కొనాలో తెలియని పరిస్థితి.. దీనికి తోడు చిన్నారులకు పెద్ద పెద్ద గ్రంథాల్లాంటి పుస్తకాలు చూస్తే భయం, బోరింగ్! ఇలా ఇవన్నీ వారికి పఠనంపై ఆసక్తి కొరవడేలా చేస్తున్నాయని నాకు అర్థమైంది. ఇలా కాకుండా.. రోజుకో చిన్న కథ చొప్పున వారితో చదివిస్తే.. కొన్నాళ్లకు పఠనం అలవాటవుతుంది.. ఆపై పెద్ద పుస్తకాలు చదవడానికీ పిల్లలు వెనకడుగు వేయరనిపించింది. పైగా పఠనం వల్ల విద్య, సామాజికంగా, కెరీర్ పరంగా వివిధ అంశాల గురించి అవగాహన పెరగడమే కాదు.. తమ చుట్టూ జరిగే ప్రతి విషయాన్నీ సులభంగా అర్థం చేసుకునే నేర్పు పిల్లల్లో పెరుగుతుంది. సరిగ్గా ఈ ఆలోచనలతో ఉన్నప్పుడే ఫ్రాన్స్‌లో ఉన్న ‘స్టోరీ మెషీన్’ గురించి ఓ ఆర్టికల్ చదివాను. ఐడియా నచ్చింది. ఈ ఆలోచనకు మరింత పదును పెట్టగా వచ్చిన అంతిమ ఫలితమే ఈ ‘స్టోరీ బాక్స్’. 2020లో దీనికి అంకురార్పణ చేశాం.
దశల వారీగా..!
ఒక ఉత్పత్తిని అభివృద్ధి చేయాలంటే ఆలోచనొక్కటే సరిపోదు.. దాని డిజైన్, ఫీచర్లనూ రూపొందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మా వద్ద ఉన్న ప్రొడక్ట్ డిజైన్, సాఫ్ట్‌వేర్, ఎడిటోరియల్.. ఇలా వివిధ విభాగాల నిపుణుల ఆలోచనల్ని రంగరించి స్టోరీ బాక్స్ నమూనాను తయారుచేశాం. స్థానిక స్కూల్స్‌కి అందించాం. వారిచ్చిన ఫీడ్‌బ్యాక్, సలహాల ప్రకారం.. దీన్ని వివిధ దశల్లో అభివృద్ధి చేస్తూ తుది ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం నగరవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, బుక్ స్టాల్స్, గ్రంథాలయాలు, సచివాలయం, వ్యవసాయ యూనివర్సిటీ.. ఇలా అనేక చోట్ల మా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
బటన్ నొక్కితే కథ సిద్ధం!
చూడ్డానికి చిన్న పెట్టెలా ఉండే దీన్ని ‘సమాచార/సాహిత్య ఏటీఎం’గా చెప్పుకోవచ్చు. ఇందులో కొన్ని ఆప్షన్లుంటాయి. కథ/గేయం, బుక్స్ ఇన్ పార్ట్స్ (పెద్ద బుక్స్‌ని చిన్న చిన్న భాగాలు చేసి.. రోజుకో భాగం చొప్పున అప్‌డేట్ చేస్తాం), ఫ్యాక్ట్స్ (ఆయా అంశాలకు సంబంధించిన వాస్తవాలు), పజిల్స్ (నంబర్ పజిల్స్, వర్డ్ పజిల్స్).. అనే నాలుగు ఆప్షన్లుంటాయి. డిఫికల్టీ లెవెల్ (ఈజీ, మీడియం, హై, వెరీ హై) ప్రకారం గ్రేడ్ చేసుకున్నాక.. ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి క్షణాల్లో ప్రింట్ వచ్చేస్తుంది. ఇక ఇందులోని ప్రతి ఆప్షన్‌ని పిల్లల సబ్జెక్టులకు అనుసంధానం చేస్తూ కంటెంట్‌ని రూపొందిస్తున్నాం. అంతేకాదు.. ప్రింట్ కోసం ఉపయోగించే పేపర్ దగ్గర్నుంచి ప్రింటర్ దాకా.. పర్యావరణ హితంగా ఉండేలా జాగ్రత్తపడుతున్నాం. మా ‘స్టోరీ బాక్స్’తో.. మీకు కావాలనుకున్న సమాచారాన్ని/సాహిత్యాన్ని ఏ భారతీయ భాషలోనైనా క్షణాల్లో ప్రింట్ తీసుకోవచ్చు. ఇక నెలరోజులకోసారి రిమోట్ ద్వారా ఆయా చోట్ల ఉన్న స్టోరీ బాక్సుల్ని అప్‌డేట్ చేస్తాం.
స్క్రీన్ టైమ్ తగ్గుతోంది!
స్టోరీ బాక్స్ ద్వారా పిల్లల స్క్రీన్ టైమ్‌ని తగ్గించగలుగుతున్నాం.. అదే సమయంలో సమాచారాన్ని త్వరగా, సులభంగా నేర్చుకునేలా ఇది ఉపయోగపడుతుంది. గతేడాది హైదరాబాద్ బుక్ ఫెయిర్, హైటెక్స్ కిడ్స్ ఫెయిర్, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్, ఇండియా సైన్స్ ఫెయిర్.. వంటి వేదికలపై మా ఉత్పత్తిని ప్రదర్శించగా.. మంచి స్పందన వచ్చింది. ఇక నా వ్యాపార ప్రయాణంలో ‘తెలంగాణ ఇన్నొవేషన్ ఎకో సిస్టమ్’, ‘వీ-హబ్’, ‘టి-వర్క్స్’.. వంటి సంస్థల సహకారం ఎంతో! వీహబ్ మాకు నెట్‌వర్కింగ్, ఇతర సేవల పరంగా ఎంతో సహకరిస్తోంది!
తపన ఉంటే సరిపోదు!
వచ్చే ఆరు నెలల్లో నగర వ్యాప్తంగా మరిన్ని స్టోరీ బాక్సుల్ని అందుబాటులో ఉంచే ప్రయత్నాల్లో ఉన్నాం.. ఇటీవలే లక్నో కూడా పంపించాం. ఆపై దేశవ్యాప్తంగా మా ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నాం. అలాగే వీలైనన్ని ఎక్కువ స్కూల్స్, రద్దీ ప్రదేశాలు, గురుకుల పాఠశాలలు-వసతి గృహాల్లో ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. మరోవైపు ‘వ్యవసాయ యూనివర్సిటీ’కి చెందిన ‘ఆగ్ హబ్’తో కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలో వ్యవసాయానికి సంబంధించిన కంటెంట్‌ను స్టోరీ బాక్స్ ద్వారా అందించే ప్రయత్నాల్లో ఉన్నాం. ఇదనే కాదు.. చేసే ఏ పనిలోనైనా.. ఆసక్తి ఉంటే సరిపోదు.. దానికి మన తెలివితేటలు కూడా తోడవ్వాలి.. దీర్ఘకాలం పాటు దాన్ని కొనసాగించేలా ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.