వెయ్యేళ్ల కళకు 106 ఏళ్ల ప్రతినిధి!
చాలామంది జీవనం కొనసాగించడం కోసం పనిచేస్తే.. కొంతమంది మాత్రం చేసే పనినే జీవనంగా మార్చుకుంటారు. ఈ క్రమంలో వయసు పైబడినా ఆ పనికి విరామం ప్రకటించకుండా తమ జీవితాన్ని పనికే అంకితం చేస్తుంటారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన అపో వాంగడ్ అనే 106 ఏళ్ల బామ్మ...
(Photos: Instagram)
చాలామంది జీవనం కొనసాగించడం కోసం పనిచేస్తే.. కొంతమంది మాత్రం చేసే పనినే జీవనంగా మార్చుకుంటారు. ఈ క్రమంలో వయసు పైబడినా ఆ పనికి విరామం ప్రకటించకుండా తమ జీవితాన్ని పనికే అంకితం చేస్తుంటారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన అపో వాంగడ్ అనే 106 ఏళ్ల బామ్మ కూడా ఈ కోవకే చెందుతుంది. 16 ఏళ్ల వయసులో తన తండ్రి దగ్గర నేర్చుకున్న ట్యాటూ కళను (మంబాబటొక్) ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ ఆమె చిత్రాన్ని కవర్ ఫొటోగా ఫిలిప్పీన్స్ వోగ్‌లో ప్రచురించింది. తద్వారా ఈ మ్యాగజైన్ కెక్కిన అత్యంత పెద్ద వయసు కలిగిన మహిళగా వాంగ్ పేరు సంపాదించింది. అంతకుముందు ప్రముఖ నటి జుడి డెంచ్ (85) ఫొటోను 2020లో బ్రిటిష్ వోగ్‌లో ప్రచురించారు. ఈ క్రమంలో ఈ ఫిలిప్పీన్స్ బామ్మ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...
ఆ కళకు వెయ్యేళ్ల చరిత్ర..!
అపొ వాంగడ్‌ను మరియా ఒగే అని కూడా పిలుస్తుంటారు. వాంగ్‌ది ఫిలిప్పీన్స్‌లోని కళింగ ప్రావిన్స్‌కు చెందిన బస్కలన్ అనే మారుమూల కొండ ప్రాంతం. ఇక్కడ ‘మంబాబటొక్’గా పిలిచే ట్యాటూ కళకు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి ప్రజలు తమ పూర్వీకులకు చెందిన చిహ్నాలను చర్మంపై వేయించుకుంటారు. అయితే ప్రస్తుత తరంలో ఇలా ట్యాటూలు వేసే వారిలో వాంగ్ ఒక్కరే ఉండడం గమనార్హం. ఆమె ఈ విద్యను 16 ఏళ్ల వయసులో తన తండ్రి దగ్గర నేర్చుకున్నారు. అప్పట్నుంచి ఈ కళలో నైపుణ్యం పొందిన ఆమె ఎన్నో వేల మందికి ట్యాటూలు వేశారు.
ఇవే ఆమె అస్త్రాలు..
వెదురు కర్ర, పొమెలో చెట్టు ముల్లు, నీళ్లు, బొగ్గు.. ఇవే ట్యాటూలు వేయడానికి వాంగ్ ఉపయోగించే అస్త్రాలు. వీటితోటే ఆమె కళింగ తెగకు చెందిన పూర్వీకుల చిహ్నాలను చర్మంపై పచ్చబొట్టు లాగా వేస్తుంటుంది. ఈ చిహ్నాలు ధైర్యం, శక్తి, అందానికి ప్రతీకలుగా అక్కడి తెగ వారు భావిస్తుంటారు. వాంగ్ ట్యాటూలు వేయడం కోసం చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో పాటు కొన్ని సందర్భాల్లో సుదూర ప్రాంతాలకు కూడా వెళుతుంటుంది. అయితే ఈ ట్యాటూలను ఒక వయసుకు వచ్చిన వారు మాత్రమే వేయించుకుంటారట. ఈ ప్రాంతాన్ని సందర్శించే విదేశీయులు కూడా వాంగ్ దగ్గర ట్యాటూలు వేయించుకుంటారని వోగ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీనివల్ల ఫిలిప్పీన్స్‌లో ట్యాటూ టూరిజం పెరిగిందని రాసుకొచ్చింది.
కళ అంతరించిపోకుండా..
ఈ ట్యాటూ కళను రక్తసంబంధీకుల నుంచి ఒకరి ద్వారా ఒకరు నేర్చుకుంటారు. ఇప్పటి తరంలో వాంగ్ ఒక్కరే ఉన్నారు. ఆమెకు పిల్లలు కూడా లేరు. అయితే ఈ కళ తనతో పాటే అంతరించిపోకూడదని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన ఇద్దరు మేనకోడళ్లకు కొన్ని సంవత్సరాలుగా వాంగ్ శిక్షణ ఇస్తోంది. బస్కలన్‌కు వచ్చే పర్యటకులకు వీరే ట్యాటూలు వేస్తుంటారు. అయితే ఆ ట్యాటూలకు ఫినిషింగ్ టచ్ ఇచ్చేది మాత్రం వాంగేనట. వాంగ్ ట్యాటూ వేసిన తర్వాత తన ముద్రగా మూడు చుక్కలను వేస్తుందట. ఈ సందర్భంగా ‘చూపు ఉన్నంత వరకు ఈ ట్యాటూలు వేస్తానని’ చెబుతోందీ బామ్మ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.