నిర్మలమ్మ కట్టిందిమాచీరే

కసూతి.. వందల ఏళ్లనాటి కళ! ఆవిడకి మాత్రం అమ్మ జ్ఞాపకం. కొంతమందికి ఉపాధి చూపిద్దామని చేసిన ప్రయత్నంతో ఏళ్ల నాటి కళను బతికించడమే కాదు..

Published : 16 Feb 2023 00:58 IST

కసూతి.. వందల ఏళ్లనాటి కళ! ఆవిడకి మాత్రం అమ్మ జ్ఞాపకం. కొంతమందికి ఉపాధి చూపిద్దామని చేసిన ప్రయత్నంతో ఏళ్ల నాటి కళను బతికించడమే కాదు.. దేశం మొత్తం దాని గురించి మాట్లాడుకునేలా చేశారు. ఆరతి హిరేమత్‌.. వసుంధరతో ఆ ప్రయాణాన్ని పంచుకున్నారిలా..

డ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఆర్థికమంత్రి నిర్మలమ్మ కట్టిన ఎరుపు రంగు చీర మేం రూపొందించిందే! కేంద్ర చేనేత విభాగం నుంచి కసూతి వర్క్‌ చేసిన చీరలు కావాలని ఫోన్‌ వస్తే.. కొన్ని ఎంపిక చేసి పంపాం. వాటిల్లో రెండు నిర్మలమ్మకి నచ్చాయి. అయితే బడ్జెట్‌ రోజున ఆ చీరలో ఆమె కనిపించే వరకూ ఆ సందర్భం కోసమని తెలియదు. టీవీలో చూశాక చెప్పలేని సంతోషం. చోళుల కాలం నాటి కసూతి కళకు దేశవ్యాప్తంగా గుర్తింపు తేవాలన్న ఆశయం ఆరోజు నాకు నెరవేరినట్లు అనిపించింది. గతంలో మోదీ హుబ్లీ వచ్చినప్పుడూ మా కళాకారులు రూపొందించిన శాలువా పంపాం. అప్పుడు ఆయనిచ్చిన ప్రశంసలూ మా కష్టానికి గుర్తింపే!

అసలు కసూతిపై నా ఆసక్తికి కారణం మాత్రం అమ్మే! తనది బెల్గాం, నాన్నది బెంగళూరు. అమ్మకి చీరలపై ఈ వర్క్‌ చేయించుకోవడం అలవాటు. నాకదో చిన్ననాటి జ్ఞాపకం. డిగ్రీ చదివాక ప్రవీణ్‌తో పెళ్లైంది. ఆయన ఉద్యోగరీత్యా ఎన్నో ప్రాంతాలు తిరిగి చివరికి ధార్వాడ్‌ చేరుకున్నాం. ఓరోజు ఇద్దరు మహిళలు చీరలపై ఎంబ్రాయిడరీ చేసిస్తామంటూ ఇంటికొచ్చారు. నా చిన్నతనంలో కొన్నేళ్లు ధార్వాడ్‌లో ఉన్నాం. అప్పుడు వీళ్లే అమ్మకు వర్క్‌ చేసిచ్చేవారు. గుర్తుపట్టి పలకరించా. ఉపాధి కరవై ఇలా ఇంటింటికీ తిరుగుతున్నారని తెలిసి బాధపడ్డా. వాళ్లకి సాయపడాలని బెంగళూరులోని కొన్ని వస్త్రదుకాణాలకు పరిచయం చేశా. బంధువులు, స్నేహితుల వద్ద చీరలు తెచ్చి వర్క్‌ చేయడానికి ఇచ్చేదాన్ని.

గుర్తింపు తేవాలనీ..

అప్పటిదాకా సాయం చేద్దామన్న ఉద్దేశమే! ఇది చోళుల కాలంనాటిది. మామూలుగా డిజైన్‌ గీసి, ఆపై ఎంబ్రాయిడరీ చేస్తారు కదా! దీనిలో అలా కాదు. మనసులోనే అనుకొని కుట్టడం మొదలుపెట్టి చివరి వరకూ పూర్తిచేస్తారు. ఆలయాలు, రథాలు, పల్లకీలు, తామర పూలు, నెమళ్లే వీటికి స్ఫూర్తి. పైగా వస్త్రానికి ఇరువైపులా ఒకేలా కనిపించడం ఈకళ ప్రత్యేకత. దీని గురించి తెలిశాక, రూపొందించడం వెనుకనున్న కష్టాన్ని చూశాక కసూతిపై గౌరవం పెరిగింది. ఈ సంప్రదాయ కళ అంతరించి పోతోందని తెలిశాక బాధేసింది. దీన్ని కాపాడాలనుకొని 2000లో ‘ఆర్తి క్రాఫ్ట్స్‌’ ప్రారంభించా. బెంగళూరు చుట్టుపక్కల గ్రామాల మహిళలకి ఈ కళ నేర్పించడం మొదలుపెట్టా.


ఉపాధి పెరుగుతోంది

స్త కళాకారులకు చేయూతనిచ్చే ప్రభుత్వ సంస్థ ‘సెమా (సొసైటీ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ మొబిలైజేషన్‌ ఆఫ్‌ ఆర్టిసన్స్‌)’తో కలిశా. కసూతిలో శిక్షణతోపాటు మహిళలకు ఆరోగ్య బీమా, వారి పిల్లలకు ఉపకారవేతనాలూ కల్పించేవాళ్లం. అంతా గాడిలో పడుతోందనగా కొన్నేళ్లకు ప్రభుత్వ నిధులు ఆగిపోయాయి. ఏం చేయాలా అనుకుంటున్నప్పుడు నిఫ్ట్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్థులు మావద్దకు ఇంటర్న్‌షిప్‌కి వచ్చారు. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ పరిచయం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఆర్డర్లు మొదలయ్యాయి. బ్యాగులు, టాప్స్‌, శాలువాలు, బ్లవుజు పీస్‌లపైనా కసూతి ప్రయత్నించాం. అమ్మకాలతోపాటు గుర్తింపూ పెరిగింది. ఇప్పటివరకు వేలమంది మహిళలు మావద్ద శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతున్నారు. 300మంది ఆర్తి క్రాఫ్ట్స్‌లో పని చేస్తున్నారు. అమెరికా, మలేసియా, లండన్‌, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, దుబాయ్‌లకూ ఎగుమతి చేస్తున్నాం. ఇద్దరు పిల్లలు. బాబు శివశరణ్‌ నాకు సహకరిస్తున్నాడు. అమ్మాయి తనుశ్రీ డెంటిస్ట్‌. కసూతి అంతరించి పోకుండా ఉండటంలో భాగస్వామి అవుతుండటం అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్తులోనూ కొనసాగిస్తా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని