ఉద్యోగం పట్ల ఆసక్తి తగ్గుతోందా?

వృత్తిగత జీవితంలో నిరాశానిస్పృహలు ఆవరిస్తున్నాయా..? రోజు రోజుకీ ఉద్యోగ జీవితంలో ఆసక్తి తగ్గిపోతోందా..? అనుకున్నంత ఉల్లాసంగా, ఉత్సాహంగా పని చేయలేకపోతున్నారా..? ఏదో తెలియని ఒత్తిడికి, ఆందోళనకు....

Published : 28 Apr 2023 20:57 IST

వృత్తిగత జీవితంలో నిరాశానిస్పృహలు ఆవరిస్తున్నాయా..? రోజు రోజుకీ ఉద్యోగ జీవితంలో ఆసక్తి తగ్గిపోతోందా..? అనుకున్నంత ఉల్లాసంగా, ఉత్సాహంగా పని చేయలేకపోతున్నారా..? ఏదో తెలియని ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారా..? అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు మీకోసమే..

ఆఫీసులో చేస్తున్న పని మీద ఆసక్తి తగ్గిపోవడానికి మీరు ఏదో విషయంలో ఒత్తిడికి గురవడమో లేక మీరు పని చేస్తున్న రంగం మీద కాకుండా వేరే రంగం మీద ఆసక్తి ఉండడమో కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. లేదంటే మీ కెరీరే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.

రోజూ రొటీన్ జాబ్ చేస్తున్నామనే భావన కలుగుతోందా? పనిలో ఆసక్తి తగ్గడానికి అదే కారణమని భావిస్తున్నారా.. అయితే, ఇటువంటి సమయంలోనే మీ పనిని మీకు తగ్గ విధంగా మలచుకోండి. రోజూ చేసే పనినే విభిన్నంగా చేయడానికి ప్రయత్నించండి. అంతకు మించి మీరు చేస్తున్న పనిలోనే రోజుకో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సంకల్పించండి.

మీ సహచర ఉద్యోగులతో విభేదాలే మీకు ఆఫీసు పనిలో నిరాసక్తతను, నిస్పృహలను కలిగిస్తున్నాయని అనుకుంటున్నారా? అయితే, అలాంటి విభేదాలను సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. స్నేహపూర్వకమైన వాతావరణంలో అందరినీ గౌరవిస్తూ, నిబద్ధతతో పని చేయండి.

ఒక వేళ జీతభత్యాలు, పదోన్నతి విషయాల్లో తగిన ప్రతిఫలం అందడం లేదనే భావనే మీకు పనిలో అనాసక్తిని కలిగిస్తోందా.. అటువంటప్పుడు ఇంకా కష్టపడి పని చేయడానికి ప్రయత్నించండి. మీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోండి. ఇలా చేయడం వల్ల మీకంటూ ఆఫీసులో ఒక గుర్తింపు వస్తుంది. కేవలం కొన్ని విషయాలకే పరిమితమైపోకుండా, ఇతర విషయాల్లో కూడా కంపెనీ పురోభివృద్ధిని కోరుకొనే వారినే సంస్థ ప్రోత్సహిస్తుందని గుర్తుంచుకోండి.

అలాగే మీరు ఏవైనా కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నప్పుడు వాటి గురించి పదే పదే ఆఫీసులో ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. వాటి ప్రభావం మీ పని మీద పడకుండా జాగ్రత్తపడాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా మీరు పని మీద దృష్టి కేంద్రీకరించలేక పదే పదే తప్పులు చేస్తూ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

మీ ఆఫీసులో పద్ధతులకు అలవాటు పడకపోవడం వల్ల కూడా మీకు పని మీద ఆసక్తి తగ్గే అవకాశం ఉంది.. అయితే, ప్రతి కంపెనీకి ప్రత్యేకంగా కొన్ని నియమ నిబంధనలుంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాటికనుగుణంగానే పద్ధతులు ఉంటాయి. అందుకే సాధ్యమైనంత వరకు ఉత్సాహంగా పని చేయాలనుకొంటే వాటికి అలవాటు పడడమే మంచిది.

ప్రణాళికాబద్ధంగా పని చేయకపోవడం కూడా మీ అనాసక్తికి కారణం కావచ్చు. మీకిచ్చిన పనిని నిర్ణీత సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలా చేయడం వల్ల పని ఆలస్యమవుతుందని అనవసర ఆందోళనకు, ఒత్తిడికి గురి కావక్కర్లేదు.

మరో ముఖ్యమైన విషయమేమిటంటే, పని చేయడానికి బద్ధకం పెంచుకున్నా కూడా పనిలో ఆసక్తి తగ్గుతుంది. అందుకే పనులను వాయిదా వేయడం, ఆలస్యంగా పనులను ప్రారంభించడం... వంటివి చేయకూడదు.

కొంతమంది కొన్ని ఫుల్‌టైమ్ కోర్సులు చేస్తూ కూడా, ఎనిమిది గంటల డ్యూటీ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలా చేయడం కూడా ఉద్యోగ జీవితంలో ఒత్తిడికి కారణమవుతుంది. అలాంటి వారు రెండు పడవల మీద ప్రయాణం చేయడం మాని, కెరీర్ మీదే దృష్టి కేంద్రీకరించడం మంచిది. అప్పుడే వారు ప్రొఫెషనల్‌గా ఎదగగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని