వీటికి దూరంగా ఉండడమే మంచిది!
మధుమేహం ఉన్నవారితో పాటు, అధిక బరువు తగ్గాలనుకునే కొంతమంది చక్కెరకు బదులుగా కృత్రిమ తీపి పదార్థాలను తీసుకుంటుంటారు. అయితే వీటిలో కొన్నిటిలో ఆస్పర్టేమ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటోంది....
మధుమేహం ఉన్నవారితో పాటు, అధిక బరువు తగ్గాలనుకునే కొంతమంది చక్కెరకు బదులుగా కృత్రిమ తీపి పదార్థాలను తీసుకుంటుంటారు. అయితే వీటిలో కొన్నిటిలో ఆస్పర్టేమ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇది క్యాన్సర్ కారకమని ప్రకటించనున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కృత్రిమ తీపి పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని ఆహార పదార్థాల్లాగే కృత్రిమ తీపి పదార్థాలు కూడా అందరికీ పడకపోవచ్చు. కొంతమందిలో వీటిని తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు.
క్యాలరీల విషయంలో..
కృత్రిమ తీపి పదార్థాల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొన్ని పదార్థాల్లో అయితే అసలు క్యాలరీలే ఉండవు. అందుకే కొంతమంది తమ ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి, బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు కూడా కృత్రిమ తీపి పదార్థాలను తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే ఆరోగ్యకరమైన బరువు ఉండాలంటే శరీరానికి అవసరమైన నిర్ణీత క్యాలరీల విషయంలో రాజీ పడకూదంటున్నారు నిపుణులు.
సహజసిద్ధమైనవే..!
కృత్రిమ తీపి పదార్థాలు సహజ సిద్ధంగా లభించే పదార్థాలను ఎప్పటికీ భర్తీ చేయలేవు. కాబట్టి తక్కువ క్యాలరీలు ఉన్న తీపి పదార్థాల కోసం సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించడమే మంచిదంటున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది.
నిపుణులను సంప్రదించాలి..
అలాగే మధుమేహ రోగులు కృత్రిమ తీపి పదార్థాలను వాడే విషయంలో సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
నీటి మోతాదు తగ్గకుండా...
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని నీళ్లు తీసుకోవడం తప్పనిసరి. అయితే కొంతమంది కృత్రిమ తీపి పదార్థాలు ఉన్న పానీయాలు తీసుకున్నప్పుడు నీళ్లు తాగరు. కానీ, ఇలాంటప్పుడు కూడా నీళ్లు తాగాలంటున్నారు నిపుణులు. నీళ్లు శరీరంలోని మలినాలను తొలగించి డీహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాడతాయి. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లు కృత్రిమ తీపి పదార్థాలు ఉండే పానీయాలు, పదార్థాలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.