close
Updated : 11/10/2021 12:54 IST

మనసు గాయాల్ని మాన్పుతోంది!

(Photo: Instagram)

శరీరానికి గాయమైతే ఏ మందో మాకో రాస్తే మానిపోతుంది.. అదే మనసుకు గాయమైతే అది మానడానికి ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలో మానసికంగా కుంగి కృశించి పోకుండా ఎవరో ఒకరు అండగా నిలిస్తే ఆ బాధ నుంచి త్వరగా బయటపడచ్చు. ప్రస్తుతం ముంబయికి చెందిన ఆరుషి సేథి చేస్తోంది కూడా ఇదే! ఒకానొక దశలో మానసిక సమస్యలతో సతమతమైపోయిన ఆమె.. తన తల్లి అండతో నెలల వ్యవధిలోనే కోలుకుంది. ‘అనుభవమే కొత్త మార్గాన్ని అన్వేషిస్తుంద’న్నట్లు.. మానసిక సమస్యలతో సతమతమవుతోన్న ఎంతోమంది బాధితులకు తానున్నాననే భరోసా కల్పించడానికి ఓ సంస్థను సైతం స్థాపించిందామె. చీకటి వెంటే వెలుగున్నట్లు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్పన్నమయ్యే సమస్యలకూ తగిన పరిష్కార మార్గాలుంటాయంటూ అందరిలో స్ఫూర్తి నింపుతోన్న ఆరుషి.. తన మెంటల్‌ హెల్త్‌ ప్లాట్‌ఫామ్‌ గురించి ఇలా చెప్పుకొచ్చింది.

మానసిక సమస్యలు మనిషిని ఎంతలా కుంగదీస్తాయో నాకు తెలియనిది కాదు.. అలాగని ఆ ప్రతికూల ఆలోచనల్లోనే మగ్గిపోతే జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది. Post Traumatic Stress Disorder (PTSD) ను ఎదుర్కొనే క్రమంలోనే నాకు ఈ విషయం అర్థమైంది. నేను పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే. మీడియా, కమ్యూనికేషన్ లో గ్రాడ్యుయేషన్ చేశా. చదువు పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు మార్కెటింగ్ విభాగంలో పనిచేశా.

ఆ దుర్ఘటన నా మనసును దెబ్బకొట్టింది!

ఇలా జీవితం హాయిగా, సంతోషంగా సాగిపోతున్న సమయంలోనే ఓ భయంకరమైన అనుభవం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేమన్నట్లు.. 2015 ఏప్రిల్‌లో నా స్నేహితురాలిని కలవడానికని నేపాల్‌ వెళ్లాను. అదే సమయంలో అక్కడ తీవ్ర భూకంపం సంభవించింది. దాదాపు 9 వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎటు చూసినా మృతదేహాలు, బాధితుల ఆర్తనాదాలతో దేశంలో భీతిగొల్పే పరిస్థితులు నెలకొన్నాయి. అదృష్టకరమైన విషయం ఏంటంటే.. ఆ భయంకరమైన ప్రకృతి విపత్తు నుంచి బతికి బయటపడ్డ వారిలో నేనూ ఒకరిని! అప్పటిదాకా నా మనసులో ఒక బలమైన ఆలోచన ఉండేది.. నేను తలచుకుంటే ఏమైనా చేయగలను అని! కానీ ఆ దుర్ఘటన నా ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని దెబ్బతీసింది. కళ్లు మూసినా, తెరిచినా.. నిద్రపోయినా, మెలకువతో ఉన్నా.. అనుక్షణం ఆ హృదయవిదారక సంఘటన తాలూకు దృశ్యాలే నా కళ్ల ముందు మెదిలేవి. ఈ భయమే నన్ను క్రమంగా Post Traumatic Stress Disorder (PTSD) బారిన పడేలా చేసింది.

అమ్మ అండతోనే..!

ఆ సమయంలో ఎవరు పిలిచినా, ఏ శబ్దం వినిపించినా నేపాల్‌ దుర్ఘటన తాలూకు జ్ఞాపకాలే నా మనసును మెలిపెట్టేవి. ఏదో తెలియని భయం నన్ను వెంటాడేది. ఇక నా మనసు నిండా ప్రతికూల ఆలోచనలే తాండవించేవి. ఇలాంటి మానసిక ఒత్తిడితో మంచానికే పరిమితమైన రోజులెన్నో! నా జీవితంలో నేనెదుర్కొన్న అత్యంత గడ్డు పరిస్థితులేవైనా ఉన్నాయంటే అవి ఇవే! అయితే ఈ సమయంలో నా మానసిక వేదనను మా అమ్మ అనురీత్‌ సేథి గ్రహించింది. తన చేయందించి నాకు అండగా నిలిచింది. ఇలా మానసిక సమస్యలకు చికిత్స చేయడం ఆమెకు కొత్త కాదు. గత 32 ఏళ్లుగా క్లినికల్‌ సైకాలజిస్ట్‌గా పనిచేస్తోన్న మా అమ్మ.. తన కెరీర్‌లో ఇలాంటి కేసులెన్నో డీల్‌ చేసింది. నా ప్రతి కదలికనూ గమనిస్తూ.. నా మనసును పాజిటివ్‌గా మార్చేందుకు తను చేయని ప్రయత్నమంటూ లేదు. నేను ఈ సమస్య నుంచి మూడు నెలల్లోనే బయటపడి పూర్తిగా కోలుకున్నానంటే అదంతా అమ్మ చలవే!

అలాంటి వారికి భరోసా ఇవ్వాలని..

అయితే ఈ సమస్య నుంచి బయటపడే క్రమంలోనే నాలా ఎంతోమంది వివిధ రకాల మానసిక సమస్యలతో సతమతమవుతున్నారన్న విషయం గ్రహించా. మరి, నాకు మా అమ్మ అండగా ఉంది.. కాబట్టి త్వరగా కోలుకోగలిగా! అదే ఎవరి అండ లేని వాళ్ల పరిస్థితేంటి? అన్న ఆలోచన వచ్చింది. అలాంటి వారందరికీ నేనే ఓ భరోసా కావాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా. దీనికి తోడు మానసిక సమస్యలతో సతమతమవుతోన్న ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన మా అమ్మ మంచి మనసు కూడా నాపై సానుకూల ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే అమ్మతో కలిసి ‘Trijog’ పేరుతో ఓ మెంటల్‌ హెల్త్‌ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించా. వయసుతో సంబంధం లేకుండా మానసిక సమస్యల్ని ఎదుర్కొనే ప్రతి ఒక్కరినీ ఆ ప్రతికూలతల నుంచి బయటపడేసి తిరిగి మామూలు మనుషుల్ని చేయడమే మా సంస్థ ముఖ్యోద్దేశం!

కారణానికి చికిత్స చేస్తాం!

ఈ ఆరేళ్లలో మా సంస్థ తరఫున ఎన్నో అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్స్‌ నిర్వహించాం. ముందుగా సమస్యకు గల మూల కారణాల్ని గుర్తించి వాటికి చికిత్స చేస్తే అసలు సమస్య దూరమవుతుందన్న సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. ఇదే సూత్రాన్ని మా వద్దకొచ్చే బాధితులకూ వర్తింపజేస్తున్నాం. నిపుణులతో కౌన్సెలింగ్‌ సెషన్స్‌ నిర్వహిస్తుంటాం.. అలాగే థెరపిస్టులతో ఆయా సమస్యలకు చికిత్సలు చేయిస్తాం. అలాగే చిట్కాల రూపంలోనూ బాధితుల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం. మానసిక సమస్యల్ని దూరం చేసే క్రమంలో ప్రస్తుతం అంతర్జాతీయంగా 54కు పైగా సంస్థలతో మమేకమై ముందుకు సాగుతున్నాం. ఇలా ఇప్పటిదాకా 65 వేల మందికి పైగానే మా వద్ద చికిత్స పొంది వారికున్న మానసిక సమస్యల్ని జయించారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలోనూ మా సేవలు ఎంతోమందికి చేరువయ్యాయి.

అందరికీ మానసిక ఆరోగ్యాన్ని చేరువ చేసే క్రమంలో నేను చేస్తోన్న ఈ చిన్ని ప్రయత్నానికి గుర్తింపుగా ‘World Federation for Mental Health’ సంస్థ బోర్డ్‌ డైరెక్టర్‌గా నన్ను నియమించి గౌరవించింది. అంతేకాదు.. ఆ సంస్థ యువ విభాగానికి ఛైర్‌పర్సన్‌గానూ కొనసాగుతున్నా.

నా స్వీయానుభవంతో ఆఖరుగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. చీకటి వెంటే వెలుతురు ఉన్నట్లు.. ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. కాబట్టి దాన్నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించాలే తప్ప.. దాన్నే తలచుకుంటూ కూర్చుంటే మరింత కుంగిపోవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. నా పూర్వానుభవం నుంచి నేను నేర్చుకున్న విషయం ఇదే!


Advertisement

మరిన్ని