కాబోయే భాగస్వామిని తొలిసారి కలుస్తున్నారా?

దాంపత్య బంధం నిండు నూరేళ్లు సాఫీగా సాగాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఒకరి గురించి మరొకరికి తెలియాలి. అయితే పెళ్లికి ముందే ఒకరినొకరు కలుసుకోవడం మన దగ్గర ఎక్కువగా జరగదు. దానివల్ల అవతలి వ్యక్తి గురించి.....

Published : 04 Jun 2022 17:53 IST

దాంపత్య బంధం నిండు నూరేళ్లు సాఫీగా సాగాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఒకరి గురించి మరొకరికి తెలియాలి. అయితే పెళ్లికి ముందే ఒకరినొకరు కలుసుకోవడం మన దగ్గర ఎక్కువగా జరగదు. దానివల్ల అవతలి వ్యక్తి గురించి సరిగా తెలియక పెళ్లైన కొన్ని రోజులకే ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి, కాబోయే జీవిత భాగస్వామిని  మొదటిసారి కలిసినప్పుడే కొన్ని విషయాలు చర్చించమంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. దీనివల్ల అవతలి వ్యక్తి అభిప్రాయాలు సాధ్యమైనంత వరకు తెలుసుకోవచ్చంటున్నారు. ఈ క్రమంలో కాబోయే జీవిత భాగస్వామితో మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి అంశాలు చర్చించాలో తెలుసుకుందాం రండి...

దినచర్యతో మొదలు...

కాబోయే జీవిత భాగస్వామితో మొదటిసారి మాట్లాడాలంటే చాలామంది ఇబ్బందిపడుతుంటారు. ఏం మాట్లాడాలో తెలియక సతమతమవుతుంటారు. కానీ, అది చాలా ముఖ్యమైన సమయం. ఆ సమయంలో ఒకవైపు అవతలి వ్యక్తితో పరిచయం పెంచుకుంటూనే వారి గురించి తెలుసుకోవాలి. కాబట్టి, మొదటగా మీ దినచర్య ఏంటని అడగండి. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తి ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వారి జీవనశైలి ఎలా ఉంటుంది? ఖాళీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారా? వంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల వారి జీవనశైలికి మీరు ఫిట్‌ అవుతారా? లేదా? అని తెలుసుకోవచ్చు.

వారాంతాల్లో ఎలా?

ఈ రోజుల్లో చాలామంది దంపతులు ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి వారు వారం మొత్తం క్షణం తీరిక లేకుండా గడుపుతారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటి పని, ఆఫీసు పనితోనే వారికి సరిపోతుంటుంది. కపుల్స్ కాస్త ఫ్రీగా మాట్లాడుకోవాలంటే అది వారాంతాల్లోనే. అయితే వారాంతాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా గడుపుతుంటారు. కొంతమంది వివిధ ప్రాంతాలకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటారు. మరికొందరు ఇంట్లోనే నచ్చిన వంటకాలు చేసుకుని కానిచ్చేస్తుంటారు. ఇంకొందరు బంధువులతో గడుపుతుంటారు. కాబట్టి, కాబోయే జీవిత భాగస్వామిని కలిసినప్పుడు వారాంతాల్లో ఎలా గడుపుతారని అడగండి. ఈ క్రమంలో మీ అభిప్రాయాలు అవతలి వ్యక్తితో మ్యాచ్‌ అవుతున్నాయా? లేదా? గమనించండి.

సాహసాలు చేశారా?

దినచర్య, వారాంతాల.. గురించి చర్చించేసరికి ఇద్దరి మధ్య ఉన్న బిడియం కొంచెం పొయే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఇప్పుడు కొంచెం సరదాగా ఉండే అంశాల గురించి మాట్లాడుకోండి. ఈ క్రమంలో ఎప్పుడైనా ధైర్యసాహసాలు ప్రదర్శించారా? లేదా? అని అడగండి. ఎందుకంటే చాలామంది ఏదో ఒక సమయంలో ధైర్యసాహసాలను ప్రదర్శిస్తుంటారు. వాటిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. దాని గురించి వారిని ఎప్పుడు కదిలించినా ఉత్సాహంగా తమ స్టోరీని చెప్పే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఇద్దరూ సరదాగా మాట్లాడుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ క్రమంలో అవతలి వ్యక్తి ఎంత ధైర్యంగా ఉంటారు? ఆపద సమయాల్లో ఎలా ప్రవర్తిస్తారు? వంటి విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

స్నేహితుల ప్రస్తావన...

ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబ సభ్యుల పాత్ర ఎలా ఉంటుందో స్నేహితుల పాత్ర కూడా అంతే ఉంటుంది. కాబట్టి, చుట్టూ ఉండే స్నేహితులను బట్టి వారి మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు. కొంతమంది మంచి వారితో స్నేహం చేస్తే.. కొంతమంది చెడు అలవాట్లు ఉన్న స్నేహితులతో తిరుగుతుంటారు. మరికొంతమంది బాల్య స్నేహితులతోనే తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. కాబట్టి, ఈ వివరాలను అడిగే ప్రయత్నం చేయండి. అలాగే వారి బెస్ట్‌ ఫ్రెండ్స్‌ పేర్లు చెబితే వారి గురించి అడగండి. వారి స్నేహితుల గురించి తెలుసుకోవడం వల్ల వారి చుట్టూ ఉండే వాతావరణం, వారి అలవాట్లను పరోక్షంగా తెలుసుకునే వీలుంటుంది.

ఆహారపు అలవాట్లు...

పెళ్లికి ముందే ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఇవి తెలుసుకోకపోవడం వల్ల దంపతుల మధ్య పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తుంటారు. ఇందులో భాగంగా జంక్‌ ఫుడ్‌, ఫ్రై చేసిన పదార్థాలకి దూరంగా ఉంటారు. మరికొంతమంది దీనికి పూర్తి వ్యతిరేకమైన ఆహార శైలిని పాటిస్తుంటారు. ఇలా వ్యతిరేక ఆహారపు అలవాట్లు ఉన్న దంపతుల మధ్య తరచూ గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, మొదటి పరిచయంలోనే వీటి గురించి అడగడం ఎంతో మంచిది.

ఆఫీస్‌ కబుర్లు...

మీ సంభాషణ ఇంకాస్త సరదాగా ఉండాలంటే ఆఫీస్‌ గురించి చర్చించాల్సిందే. ఎందుకంటే చాలామందికి వృత్తిగత జీవితం మొదలైన దగ్గర్నుంచి అధిక సమయం ఆఫీసులోనే గడుపుతుంటారు. కాబట్టి, ఆఫీసు గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి. ఆఫీసులో జరిగే మీటింగ్స్‌, పార్టీలు, గెట్ టుగెదర్, ట్రెడిషనల్‌ డే, వార్షికోత్సవాలు వంటి వాటి గురించి చర్చించండి.

ఇవి కూడా...

* విహారయాత్రలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరికీ ఏవో ఒక జ్ఞాపకాలు ఉంటాయి.  వీటి గురించి కూడా మొదటి పరిచయంలో చర్చించవచ్చు.

* ఎంత ఎంటర్‌టైన్‌మెంట్‌కు దూరంగా ఉన్నా.. ఎప్పుడో ఓసారి సినిమా చూసేవారూ ఉంటారు. కాబట్టి, చివరిగా చూసిన సినిమా గురించి చర్చించండి. అలాగే ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో తెలుసుకోండి. ఇందులో కూడా భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం ఉంటుంది. వాటిని చెక్‌ చేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని