Asmi Jain: ఆ యాప్‌.. ‘యాపిల్‌’ అవార్డు తెచ్చిపెట్టింది!

సమస్యేదైనా సాంకేతికతతో పరిష్కారం చూపుతున్నారు నేటి యువత. తమ ప్రతిభకు సృజనాత్మకతను జోడిస్తూ సరికొత్త యాప్స్‌తో సవాలుకే సవాలు విసురుతున్నారు. ఇండోర్‌కు చెందిన అస్మీ జైన్‌ చేసింది కూడా ఇదే! తన స్నేహితురాలి బంధువు ఆరోగ్య సమస్యకు...

Published : 01 Jun 2023 14:18 IST

(Photos: Twitter)

సమస్యేదైనా సాంకేతికతతో పరిష్కారం చూపుతున్నారు నేటి యువత. తమ ప్రతిభకు సృజనాత్మకతను జోడిస్తూ సరికొత్త యాప్స్‌తో సవాలుకే సవాలు విసురుతున్నారు. ఇండోర్‌కు చెందిన అస్మీ జైన్‌ చేసింది కూడా ఇదే! తన స్నేహితురాలి బంధువు ఆరోగ్య సమస్యకు యాప్‌తో పరిష్కారం చూపిన ఆమె.. తన నైపుణ్యాలకు గుర్తింపుగా తాజాగా యాపిల్‌ సంస్థ నిర్వహించిన ‘వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (WWDC) స్విఫ్ట్‌ స్టూడెంట్‌ ఛాలెంజ్‌’ విజేతగా నిలిచింది. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి వందల మంది యువత పాల్గొనగా.. ఇందులో ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేసింది సంస్థ. వారిలో మన దేశం నుంచి అస్మి ఒక్కరే ఉండడం విశేషం. ‘ఏదైనా సరే ఉన్నతంగా చేయాలన్న ఆలోచనే మనల్ని క్రియేటివ్‌గా ముందుకు నడిపిస్తుంది..’ అంటోన్న ఈ యువ టెకీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అస్మికి చిన్న వయసు నుంచి సాంకేతిక పరిజ్ఞానంపై మక్కువ ఎక్కువ. ఈ ఇష్టంతోనే స్కూల్‌లో ఉన్నప్పట్నుంచే కోడింగ్‌పై దృష్టి పెట్టింది. సాంకేతిక పరిజ్ఞానం మన జీవనశైలిపై సానుకూల ప్రభావం చూపుతుందని, ఏ సమస్యనైనా టెక్నాలజీతో పరిష్కరించుకోవచ్చన్నది ఈ యువ ఇంజినీర్‌ నమ్మకం. ప్రస్తుతం ఇండోర్‌లోని ‘మెడి-క్యాప్స్‌ యూనివర్సిటీ’లో ఇంజినీరింగ్‌ చదువుతోన్న అస్మి.. అందులోని ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సెల్‌ (ఈ-సెల్‌)కి టెక్నికల్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉంది.

సమస్య నుంచి పుట్టిన ఆలోచన..!

సాంకేతిక పరిజ్ఞానం/కోడింగ్‌ను ఉపయోగించి.. ఆరోగ్య రంగంలో విశేష మార్పులు తీసుకురావాలన్నది అస్మి ఆశయం. ఈ సంకల్పంతోనే ఈ ఏడాది యాపిల్‌ సంస్థ నిర్వహించిన ‘వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (WWDC) స్విఫ్ట్‌ స్టూడెంట్‌ ఛాలెంజ్‌’లో పాల్గొందామె. ఇందులో భాగంగా ఆరోగ్య రంగానికి సంబంధించి ఓ ఒరిజినల్‌ యాప్‌ ప్లేగ్రౌండ్‌ను సృష్టించింది అస్మి. స్విఫ్ట్‌ కోడింగ్‌ లాంగ్వేజ్‌ సహాయంతో కంటి కండరాలను దృఢం చేసే యాప్‌ను రూపొందించినందుకు గాను ఈ పోటీలో గెలుపొందింది అస్మి. అయితే ఈ యాప్‌ రూపకల్పన వెనుక ఓ ప్రధాన కారణముందంటోందీ యంగ్‌ టెకీ.

‘నా స్నేహితురాలి అంకుల్‌కు బ్రెయిన్‌ సర్జరీ వికటించి మొహానికి పక్షవాతం వచ్చింది. పలు కంటి సమస్యలూ తలెత్తాయి. అయితే వాటిని దూరం చేసి కంటి కండరాలను మెరుగుపరిచేందుకు టెక్నాలజీ సహాయం తీసుకోవాలనుకున్నా. ఈ ఆలోచనతోనే ఈ పోటీలో ఒరిజినల్‌ యాప్‌ ప్లేగ్రౌండ్‌ను సృష్టించా. ఇందులో భాగంగా స్క్రీన్‌పై బాల్‌ కదులుతున్న కొద్దీ.. దాన్ని అనుసరిస్తూ కనుగుడ్లను కదిలించాల్సి ఉంటుంది. ఫలితంగా కంటి లోపలి కండరాలు దృఢమవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇదో కంటి వ్యాయామం లాంటిది. అంతేకాదు.. కంటికి సంబంధించిన ఇతర సమస్యలు, గాయాల్ని కూడా ఈ యాప్‌ సహాయంతో దూరం చేసుకోవచ్చు..’ అంటూ చెప్పుకొచ్చింది అస్మి.

ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి!

టెక్నాలజీ సహాయంతో ఆరోగ్య రంగంలో విశేష మార్పులు తీసుకురావచ్చని, ఇవి ఎన్నో జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయంటోన్న అస్మి.. ఈ లక్ష్యంతోనే యూనివర్సిటీలో తన తోటి విద్యార్థులతో కలిసి ఓ ఫోరమ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగమైన విద్యార్థులంతా కఠినమైన కోడింగ్‌ సమస్యల్ని సులువుగా పరిష్కరించుకునే క్రమంలో ఒకరికొకరు సహాయపడనున్నారు.

‘నేను రూపొందించిన ఈ యాప్‌పై ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని.. దీనిలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి త్వరలోనే యాప్‌ స్టోర్‌లో విడుదల చేసే దిశగా కసరత్తులు ప్రారంభించా. తదుపరి దశలో ఇదే యాప్‌లో ముఖ కండరాల్ని దృఢంగా చేసేందుకు వీలుగా మరిన్ని ఫీచర్లు జోడించాలనుకుంటున్నా. నా స్నేహితురాలి అంకుల్‌ మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటున్న వారందరికీ ఇదో థెరపీ టూల్‌లా పనిచేసేంత సమర్థంగా దీన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నా. టెక్నాలజీ అనే కాదు.. ఏ విషయంలోనైనా మన ఆలోచనలు ఉన్నతంగా ఉన్నప్పుడే.. అవి మనల్ని క్రియేటివిటీ దిశగా ప్రోత్సహిస్తాయి. అప్పుడే మనకంటూ ప్రత్యేకత సాధించగలుగుతాం..’ అంటూ తన మాటలతోనూ నేటి యువతలో స్ఫూర్తి నింపుతోంది అస్మి.


ముగ్గురిలో తానూ..!

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్న విద్యార్థుల కోసం యాపిల్‌ సంస్థ ఏటా ‘వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (WWDC)’ పేరుతో ఓ సాంకేతిక పోటీ నిర్వహిస్తుంది. స్విఫ్ట్‌ కోడింగ్‌ లాంగ్వేజ్‌ సహాయంతో ఒరిజినల్‌ యాప్‌ ప్లేగ్రౌండ్‌ను సృష్టించడం ఈ పోటీ ముఖ్యోద్దేశం. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాలు/ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ ఏడాది పోటీల్లో పాల్గొని.. ఆరోగ్యం, క్రీడలు, వినోదం, వాతావరణం.. తదితర రంగాల్లో సరికొత్త యాప్‌ ప్లేగ్రౌండ్స్‌ని సృష్టించారు. వందల మంది విద్యార్థులు ఇందులో పోటీ పడగా.. అస్మితో పాటు ఇటలీకి చెందిన మరో టెకీ గర్ల్‌ మార్టా, అట్లాంటాకు చెందిన యెమీ అగేసిన్‌ అనే మరో టెకీ ఇంటర్న్‌ ఈ పోటీలో గెలుపొందారు. ఇక మార్టా డైనోసార్‌ శిలాజాల శరీర నిర్మాణ చిత్రాలకు సంబంధించిన మెమరీ గేమ్‌ను యాప్‌ ప్లేగ్రౌండ్‌గా రూపొందించి విజేతగా నిలిచింది. జూన్‌ 5న వర్చువల్‌గా నిర్వహించే కార్యక్రమంలో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. అలాగే వీరితో పాటు ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులంతా వర్చువల్‌గా కలుసుకొని.. ఈ సంస్థ నిర్వహించే వివిధ సెషన్స్‌లో భాగం కానున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్