అమ్మ ఐడియా ఆ గుర్తింపు తెచ్చిపెట్టింది!

పని సులువవుతుందని ఎన్నో రకాల వస్తువుల్ని మనం ఒకసారి వాడి పడేస్తుంటాం.. దీనివల్ల పర్యావరణానికి ఎంత నష్టం అన్న విషయం గురించి ఆలోచించం! కానీ ఇలాంటి వస్తువుల్ని రీసైకిల్‌ చేసి మంచి పనుల కోసం వాడుకోవచ్చని, అందమైన క్రాఫ్ట్‌్వగా తీర్చిదిద్దచ్చని నిరూపించింది అసోంకు చెందిన పొల్లబి దెబ్రోయ్‌.

Updated : 04 Sep 2021 16:46 IST

(Photo: Instagram)

పని సులువవుతుందని ఎన్నో రకాల వస్తువుల్ని మనం ఒకసారి వాడి పడేస్తుంటాం.. దీనివల్ల పర్యావరణానికి ఎంత నష్టం అన్న విషయం గురించి ఆలోచించం! కానీ ఇలాంటి వస్తువుల్ని రీసైకిల్‌ చేసి మంచి పనుల కోసం వాడుకోవచ్చని, అందమైన క్రాఫ్ట్స్‌గా తీర్చిదిద్దచ్చని నిరూపించింది అసోంకు చెందిన పొల్లబి దెబ్రోయ్‌. తద్వారా పర్యావరణాన్నీ సంరక్షించచ్చన్న సందేశాన్ని అందరికీ అందించింది. రీసైకిల్‌ చేసిన వస్తువుల్ని అందమైన కళాకృతులుగా తీర్చిదిద్దే అలవాటున్న ఆమె.. అలాంటి వస్తువులతోనే ఆరడుగుల అతిపెద్ద దుర్గామాత విగ్రహాన్ని రూపొందించింది. ఈ ప్రతిభే ఆమెను తాజాగా ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించేలా చేసింది. అమ్మ చెప్పిన ఐడియానే ఈ అరుదైన ఘనత సాధించేలా చేసిందంటోన్న దెబ్రోయ్‌.. తన రికార్డ్‌ జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చింది.

పొల్లబి దెబ్రోయ్‌.. అసోంలోని కరీమ్‌గంజ్‌ జిల్లాకు చెందిన ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ స్కూల్లో సంస్కృతం టీచర్‌గా పని చేస్తోంది. చేతి కళలంటే చిన్నతనం నుంచీ ఆమెకు విపరీతమైన మక్కువ! ఈ ఇష్టంతోనే రీసైకిల్‌ చేసిన వస్తువులతో విభిన్న కళాకృతులు తయారుచేసి ఇంట్లో అలంకరించేది దెబ్రోయ్‌. ఇలా తన కూతురిలోని ప్రతిభను గుర్తించిన ఆమె తల్లి.. ఓ రోజు ఓ అద్భుతమైన ఐడియా చెప్పింది. అదేంటంటే.. ఇవే రీసైకిల్‌ చేసిన వస్తువులతో అతిపెద్ద దుర్గామాత విగ్రహం తయారుచేయమని!

రెండు నెలల శ్రమ ఇది!

2018 దుర్గా నవరాత్రులు సమీపిస్తున్న రోజులవి. అప్పటికే దుర్గా మాత విగ్రహాలను తయారుచేస్తోన్న శిల్పులను చూసి.. ఈసారి తన వంతుగా ఏదైనా కొత్తగా చేయాలని సంకల్పించుకుంది దెబ్రోయ్‌. అదే సమయంలో అమ్మ చెప్పిన ఈ ఐడియా తనకు నచ్చడంతో వెంటనే ఆ పనులు మొదలు పెట్టానంటోందామె.

‘చేతివృత్తుల్లో నాకు నైపుణ్యం ఉంది. రీసైకిల్‌ చేసిన వస్తువులతో ఆభరణాలు, అలంకరణ వస్తువులు.. ఇలా అన్ని రకాల ఐటమ్స్‌ తయారుచేయడం నాకు అలవాటు. అయితే 2018లో దుర్గా నవరాత్రులకు ముందు అమ్మ నాకో అద్భుతమైన ఐడియా ఇచ్చింది. ‘రీసైకిల్‌ చేసిన వస్తువులతో ఇన్ని తయారుచేస్తున్నావు.. ఈసారి దుర్గామాత విగ్రహం కూడా తయారుచేయి’ అంది. అప్పటికే ఈసారి నవరాత్రుల్లో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తోన్న నాకు అమ్మ ఐడియా వెంటనే నచ్చడంతో ఆ పనులు మొదలుపెట్టా. ప్లాస్టిక్‌ ప్యాకెట్స్‌, ప్లాస్టిక్‌ స్పూన్స్‌, అల్యూమినియం షీట్స్‌, కార్డ్‌బోర్డులు.. వంటివి ఉపయోగించి ఆరడుగుల దుర్గామాత విగ్రహం తయారుచేశా. ఇందుకు నాకు సుమారు రెండు నెలల సమయం పట్టింది..’ అంటూ చెప్పుకొచ్చింది దెబ్రోయ్.

వాళ్ల సలహా వర్కవుటైంది!

ఇలా దెబ్రోయ్‌ తయారుచేసిన అమ్మవారి విగ్రహం స్థానికంగానే కాదు.. ఆ సమయంలో దేశవ్యాప్తంగా వైరలైంది. అయితే కొన్నాళ్లకు ఈ విషయాన్ని పక్కన పెట్టినా.. తెలిసిన వారి సలహా మేరకు ప్రపంచ రికార్డు కోసం ఓ ప్రయత్నం చేశానంటోందామె.
‘నేను చేసిన అమ్మవారి విగ్రహం దేశవ్యాప్తంగా ఇంత వైరలవుతుందని ఊహించలేదు. ఆ సంతోషంలోనే కొన్ని నెలలు గడిచిపోయాయి. అందరిలాగే నేనూ ఈ విషయాన్ని పక్కన పెట్టేశాను. అయితే నాకు తెలిసిన వారొకరు ‘నువ్వు ప్రపంచ రికార్డు కోసం ఎందుకు ప్రయత్నించకూడదు?!’ అని సలహా ఇచ్చారు. దాంతో నేను తయారుచేసిన అమ్మవారి విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, తయారీ వీడియోను ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారికి పంపించాను. వాళ్లన్నీ పరిశీలించి అంతా ఓకే అనుకునే లోపే కరోనా మొదలైంది. దాంతో రికార్డు ప్రాసెస్‌ అంతా ఆలస్యమవుతూ వచ్చింది. ఆఖరికి ఈ ఆగస్టు 31న నా రికార్డును కన్‌ఫర్మ్‌ చేస్తూ ఆ సంస్థ నుంచి లెటర్ వచ్చింద’ని సంతోషంగా పంచుకుంది దెబ్రోయ్. ఈ నేపథ్యంలో ఇటీవలే కరీంగంజ్‌ డిప్యూటీ కమిషనర్‌ చేతుల మీదుగా మెడల్‌, ప్రశంసాపత్రం అందుకుంది దెబ్రోయ్.

అందుకే ఈ ప్రయత్నం!

రికార్డు మాట ఎలా ఉన్నా.. అందరిలో పర్యావరణ స్పృహ పెంచడానికే ఈ ప్రయత్నానికి పూనుకున్నానంటోంది దెబ్రోయ్‌. ‘ఇంటర్నేషనల్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇది నేను ఊహించనిది. అంతకంటే ముఖ్య విషయం ఏంటంటే.. రీసైకిల్‌ చేసిన వస్తువులపై ఎక్కువమంది ఆసక్తి చూపరు. కానీ వీటితోనూ అందమైన కళాకృతుల్ని తయారుచేయచ్చని చెప్పడానికే నేను ఈ అమ్మవారి విగ్రహం తయారుచేశాను. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత! కాబట్టి వాతావరణానికి నష్టం కలగకుండా చూసుకుందాం..!’ అంటూ తన ప్రతిభతో చక్కటి సందేశం ఇస్తోందీ అసోం అమ్మాయి.

వ్యాపారంలోనూ రాణిస్తోంది!

* చేతి కళలంటే ప్రాణం పెట్టే దెబ్రోయ్‌.. ప్రస్తుతం స్కూల్లో తన పిల్లలకు సంస్కృతం పాఠాలతో పాటు ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌, పెయింటింగ్‌-డ్రాయింగ్‌లోనూ నైపుణ్యాలు నేర్పుతోంది.

* అంతేకాదు.. తాను తయారుచేసిన ఆభరణాలు, వస్తువుల్ని ‘Crafter Pollabi Rokz’ అనే ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్ట్‌ చేస్తూ విక్రయిస్తోంది కూడా! ఇలా ఓ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌గానూ తనను తాను నిరూపించుకుంటోందీ అసోం గర్ల్.* సాహసాలంటే ఇష్టపడే దెబ్రోయ్‌.. ‘Miss Adventures 2019’ అవార్డు కూడా అందుకుంది.



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్