Published : 12/10/2022 13:41 IST

అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్..!

అట్లతద్దోయ్.. ఆరట్లోయ్..

ముద్దపప్పోయ్.. మూడట్లోయ్..

అంటూ పెళ్లీడు వచ్చిన ఆడపిల్లలు.. పెళ్లయిన మహిళలు తమ వైవాహిక జీవితం సాఫీగా సాగాలని జరుపుకొనే పండగే అట్లతదియ. రోజంతా ఆటపాటలతో మహిళలంతా ఉత్సాహంగా జరుపుకొనే పండగ ఇది. ఒప్పుల కుప్పలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలాటలతో ఈ రోజంతా సందడే సందడి. కోడి కూయక ముందు మొదలయ్యే అట్లతద్ది పండగ చంద్రోదయం అయిన తర్వాత గాని పూర్తవదు. అట్లతదియ సందర్భంగా ఈ పండగ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

గౌరీదేవికి ప్రీతికరం..

సాధారణంగా ప్రతి మాసంలోనూ వచ్చే తదియను గౌరీ దేవికి ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారు. మహిళలంతా తమకు గౌరీదేవి అంతటి మాంగల్యబలం కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే ఆ చల్లని తల్లిని వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటారు. అలాంటి రోజే ఈ అట్లతద్ది లేదా అట్లతదియ. ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షంలో వచ్చే తదియ రోజున ఈ పండగను జరుపుకొంటారు. పెళ్లీడుకొచ్చిన యువతులు, ముత్తయిదువలు ఆనందంగా జరుపుకొనే పండగ ఇది.

ముందు రోజే ఏర్పాట్లు..

తదియకు ముందు రోజైన విదియ నాడే పండగ జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం అభ్యంగన స్నానం చేసి చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఆ రోజు రాత్రి గౌరీదేవికి పూజ చేసి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. మరుసటి రోజైన తదియనాడు వేకువజామునే నిద్రలేచి స్నానం చేసి అమ్మవారికి నమస్కరించి.. రాత్రి నైవేద్యంగా పెట్టిన చద్ది అన్నాన్ని పదకొండు మంది ముత్తయిదువలతో కలసి భుజిస్తారు. గడ్డ పెరుగు, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పొట్లకాయ కూర, పులుసు లాంటి శరీరానికి వెచ్చదనాన్ని అందించే పదార్థాలను తింటారు. ఇదంతా సూర్యోదయానికి ముందే పూర్తయిపోతుంది. ఆ తర్వాత పచ్చి మంచినీటిని కూడా ముట్టుకోరు.

 

ఆటల పండగ..

సూర్యోదయానికి ముందే దగ్గరలో ఉండే తోటల్లోకి విహారానికి బయలుదేరతారు. అక్కడ చెట్లకు కట్టిన వూయల వూగుతూ రోజంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. అందుకే అట్లతదియను ‘ఆటల తదియ’గా కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే ఆడపిల్లలంతా కచ్చితంగా వూయల వూగుతారు. వనవిహారం చేస్తూ సేకరించిన ఆకులు, పూలను తీసుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. స్నానం చేసి వెంట తెచ్చుకున్న ఆకులు, పూలతో గౌరీ దేవిని పూజిస్తారు. ఆ తర్వాత చెరువులు, కాలువల దగ్గరకు వెళ్లి నీటిలో దీపాలను వదులుతారు. అనంతరం మినపప్పు, బియ్యం కలిపి తయారుచేసిన పిండితో అట్లు పోసి వాటిపై ముద్దపుప్పు, నెయ్యి వేసి పదకొండు అట్లు చొప్పున ముత్తయిదువలకు వాయనమిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వీటితో పాటు బియ్యప్పిండితో చేసిన ఇతర వంటకాలను కూడా వాయనంగా ఇస్తారు. బియ్యం చంద్రునికి, మినుములు రాహువుకి సంబంధించిన ధాన్యం. ఈ రెండింటితో అట్లు తయారు చేసి వాయనంగా ఇవ్వడం వల్ల ఈ గ్రహాలు శాంతిస్తాయని నమ్మకం. చంద్రోదయం అయ్యేలోపే ఈ తతంగం ముగుస్తుంది. అనంతరం చంద్రుణ్ని చూసిన తర్వాతే తిరిగి ఆహారాన్ని భుజిస్తారు. అందుకే దీన్ని ‘చంద్రోదయ గౌరీ వ్రతం’ అని కూడా పిలుస్తారు.


ఆరోగ్య రహస్యం..

✬ అట్లతద్దెలో ముఖ్యమైన ఘట్టం వూయల వూగడం. దీనివల్ల ఆడవారి నడుము గట్టిపడుతుంది.

✬ వేకువ జామునే నిద్ర లేవడం వల్ల జీవక్రియలు వేగవంతమవుతాయి.

✬ రోజంతా వివిధ రకాల ఆటలు ఆడటం వల్ల శరీరానికి వ్యాయామం లభించడంతో పాటు మానసికోల్లాసం కలుగుతుంది.

✬ చెట్ల మధ్యలో సమయం గడపడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

✬ గోంగూర ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది.

✬ పొట్లకాయలో ఉండే ఐరన్ రక్తవృద్ధి అయ్యేలా చేస్తుంది.

✬ ఉపవాసం వల్ల జీర్ణక్రియ క్రమబద్ధమవుతుంది.

✬ కాళ్లకు, చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మసంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

✬ అట్లు తినడం వల్ల గర్భధారణ సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

అట్లతదియ వ్రతం చేసుకోవడం వల్ల గ్రహదోషాలు తొలగిపోవడమే కాకుండా గౌరీదేవి ఆశీస్సులు లభించి కలకాలం సంతోషంగా ఉంటారని విశ్వసిస్తారు. ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెడితే.. మహిళల జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా సాగిపోవాలనే సందేశాన్ని ఈ పండగ తెలియజేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని