MasterChef Australia : ఆలూగోబీతో అశేష అభిమానుల్ని సంపాదించుకుంది!

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలే కాదు.. ఇక్కడి రుచులకూ విదేశీయులు ఫిదా అవుతుంటారు. తమకు నచ్చిన వంటకాల్ని నేర్చుకొని మరీ తమ ప్రియమైన వారికి వండి వార్చుతుంటారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన సారా టోడ్‌ మాత్రం తనకు నచ్చిన ఓ భారతీయ....

Published : 26 Apr 2022 18:22 IST

(Photos: Instagram)

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలే కాదు.. ఇక్కడి రుచులకూ విదేశీయులు ఫిదా అవుతుంటారు. తమకు నచ్చిన వంటకాల్ని నేర్చుకొని మరీ తమ ప్రియమైన వారికి వండి వార్చుతుంటారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన సారా టోడ్‌ మాత్రం తనకు నచ్చిన ఓ భారతీయ వంటకాన్ని ఏకంగా ‘మాస్టర్‌చెఫ్‌ ఆస్ట్రేలియా’ షోలో తనదైన స్టైల్‌లో తయారుచేసింది. తద్వారా న్యాయ నిర్ణేతల మెప్పు పొందడమే కాదు.. ప్రపంచవ్యాప్త గుర్తింపునూ సొంతం చేసుకుంది. ఈ ఆత్మవిశ్వాసమే తనను సెలబ్రిటీ చెఫ్‌గా, వ్యాపారవేత్తగా, రచయిత్రిగా ఎదిగేందుకు దోహదం చేసిందని చెబుతోంది సారా. ఇక ఇటీవలే నిర్వహించిన ఈ షో కొత్త సీజన్లో మరో భారతీయ వంటకంతో మాయ చేసిందీ కుకింగ్‌ క్వీన్‌. మరి, అవడానికి ఆస్ట్రేలియా అమ్మాయే అయినా భారతీయ వంటకాలకు మీరెలా ఫిదా అయ్యారని అడిగితే..? తన కుకింగ్‌ జర్నీ గురించి ఇలా పంచుకుంది సారా.

నాకు చిన్నతనం నుంచి వంటలన్నా, వంట చేయడమన్నా ఎంతో ఆసక్తి ఉండేది. అందుకే నా చదువు కూడా ఇదే దిశగా సాగింది. ఇక వంటల్లో మరిన్ని నైపుణ్యాలు నేర్చుకోవడానికి లండన్‌లోని ‘లే కార్డన్ బ్లూ’ వంటల స్కూల్లో చేరాను. అయితే ప్రత్యేకమైన కుకింగ్‌ స్టైల్స్‌ నేర్చుకున్నది మాత్రం ఇండియాలోనే!

ఆమే తొలి గురువు!

ఒక ఆస్ట్రేలియన్‌ అయి ఉండి.. భారతీయ వంటకాలపై ఎలా మనసు పడ్డారు? అని అడిగితే మాత్రం అందుకు మా అత్తగారే కారణం అని చెప్తా. తను పంజాబ్‌లోనే పుట్టిపెరిగారు. ఆమెకు వంటల్లో ప్రావీణ్యం ఎక్కువ! అదెంతలా అంటే.. ఎలాంటి కొలతలతో పనిలేకుండా అన్ని రుచుల్ని బ్యాలన్స్ చేస్తూ రుచికరంగా వంట చేసేంతలా! నా పెళ్లైన కొత్తలో తను వివిధ రకాల భారతీయ వంటకాల్ని తయారుచేసి పెట్టేవారు. వాటిని రుచి చూశాక నాకు ఒక్కటే అనిపించింది.. భారతీయ వంటకాల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులకు చేరువ చేయాలని! ఈ క్రమంలోనే మా అత్తగారి దగ్గర మెలకువలు నేర్చుకోవడంతో పాటు.. ఇక్కడి సంప్రదాయ వంటకాల గురించి తెలుసుకోవడానికి పదే పదే ఇండియాలో పర్యటించేదాన్ని. ఇక్కడ ఒక్కో రాష్ట్రానికి, ఒక్కో ప్రాంతానికి.. వంటకాల్లో, వండే విధానాల్లో ఉన్న తేడాల్ని అవపోసన పట్టాను. వచ్చిన ప్రతిసారీ వంటకానికి సంబంధించిన ఓ కొత్త టెక్నిక్‌ నేర్చుకునేదాన్ని.. ఓ కొత్త పదార్థం గురించి తెలుసుకునేదాన్ని. వీటిని ప్రత్యేకమైన స్టైల్స్‌లో ఎలా వండాలో ఇక్కడి కుకింగ్‌ స్కూల్స్‌లోనే ప్రావీణ్యం పొందా.

‘ఆలూ-గోబీ’తో తిరుగులేదు!

ఇలా పాకశాస్త్రంలో నైపుణ్యాలు సాధించిన నేను.. 2014లో ‘మాస్టర్ చెఫ్‌ ఆస్ట్రేలియా’ ఆరో సీజన్‌లో పాల్గొన్నా. ఇందులో భాగంగా నేను తయారుచేసిన ‘ఆలూ-గోబీ’ కర్రీ నా తలరాతనే మార్చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ వంటకం రుచి షో న్యాయనిర్ణేతల్ని మెప్పించడమే కాదు.. నా సోషల్‌ మీడియా ఫాలోవర్లను అమాంతం పెంచేసింది. వీరిలో భారత్‌ నుంచే 50 వేల మందికి పైగా నన్ను ఫాలో అవడం మొదలుపెట్టారు. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇదే ఉత్సాహంతో 2015లో గోవాలో నా తొలి రెస్టరంట్‌ ‘అంటారస్‌ రెస్టారంట్‌, బీచ్‌ క్లబ్‌’ని ప్రారంభించా. ఇక ఆ తర్వాత దీనిపై రూపొందించిన ‘మై రెస్టరంట్‌ ఇన్‌ ఇండియా’ టీవీ సిరీస్‌.. ఆస్ట్రేలియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో ప్రదర్శితమైంది.

నా సిద్ధాంతం అదే!

ఇక గోవాలో ఉన్నప్పుడు ‘సర్వ్‌ ఇట్‌ లైక్‌ సారా’ పేరుతో ఓ ఫుడ్‌ సిరీస్‌ కూడా రూపొందించాను. అది ఇండియాతో పాటు వివిధ దేశాల టీవీల్లో సందడి చేసింది. ఇలా నానాటికీ వంటలపై నేను పెంచుకున్న ప్రేమే ‘ది హెల్దీ మోడల్‌ కుక్ బుక్‌’ పేరుతో నా తొలి పుస్తకం రాసేలా ప్రేరేపించింది. ఇక 2019లో ‘ది వైన్‌ రాక్‌’ పేరుతో ముంబయిలో మరో రెస్టరంట్‌ ప్రారంభించా. ‘మై ఇండియన్‌ కిచెన్‌’ పేరుతో మరో పుస్తకాన్ని ఆహార ప్రియులకు చేరువ చేశా. నా రెస్టరంట్లో అయినా, నేను రాసిన పుస్తకాల్లో అయినా.. ఒక్కటే నియమం పాటిస్తుంటా. అదేంటంటే.. విభిన్న భారతీయ వంటకాల్ని నా ప్రత్యేకమైన స్టైల్లో ఆహార ప్రియులకు అందించాలని! నా పుస్తకాల్లో ఆయా వంటకాల రుచి పెంచేందుకు పలు చిట్కాల్ని కూడా పొందుపరిచాను. ఇక ఈసారీ ‘మాస్టర్ చెఫ్‌ ఆస్ట్రేలియా’ షోలో పాల్గొన్న నేను.. నా ఫేవరెట్‌ రాజస్థానీ వంటకం ‘లాల్‌ మాస్‌’ నాదైన స్టైల్‌లో తయారుచేసి మెప్పించా.

అమ్మగా సక్సెసయ్యా!

నా ఎనిమిదేళ్ల కుకింగ్‌ కెరీర్‌లో అంతర్జాతీయంగా పలువురు ప్రముఖ చెఫ్‌లతో కలిసి పనిచేసిన నేను.. ఈ రంగంలోకి రాకముందు మోడల్‌గానూ రాణించాను. నాకు చిన్నతనం నుంచి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడమంటే ఆసక్తి. ఈ క్రమంలోనే మోడలింగ్‌ నాకు పరిచయమైంది. ఇందులో భాగంగానే వివిధ అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించా. ఇక ఓ సింగిల్‌ మదర్‌గా నా జీవితంలో నేను సాధించిన విజయం ఏంటంటే.. నా తొమ్మిదేళ్ల కొడుకు ఫోనిక్స్‌ కూడా నాతో పాటు వంటల్లో పాలుపంచుకోవడం! తనకూ నాలాగే వంటలంటే ఇష్టం.. అందుకే తనను జూనియర్‌ మాస్టర్‌చెఫ్ కోసం సిద్ధం చేస్తున్నా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్