Updated : 26/07/2021 18:50 IST

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొనాలంటే ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ చేయాలి. ప్రొఫెషనల్‌ అథ్లెట్స్‌గా రాణించాలి. అర్హత పోటీలతో పాటు అంతకుముందు జరిగే పోటీల్లో విజయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో ఎలిమినేషన్లు, వడపోతల తర్వాత ఈ విశ్వ క్రీడల కోసం అథ్లెట్లను ఎంపిక చేస్తారు. అభిమానులూ వాళ్ల పైనే ఆశలు పెట్టుకుంటారు. అయితే ఇలాంటి అంచనాలేవీ లేకుండానే ఈసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది ఆస్ట్రియాకు చెందిన సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, మెడల్‌ ఫేవరెట్‌ అయిన డచ్‌ క్రీడాకారిణి అన్నేమిక్‌ వాన్‌ వూటెన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టింది. మహిళల వ్యక్తిగత రోడ్‌ రేస్‌ ఈవెంట్‌లో భాగంగా.. అన్నా, వాన్‌ కంటే 75 సెకన్ల ముందు లక్ష్యాన్ని అధిగమించడంతో పసిడిని తన సొంతం చేసుకుంది.

పరుగుతో మొదలైంది!

అన్నాకు చిన్నతనం నుంచే చదువంటే ప్రాణం. గణిత శాస్త్రంపై మక్కువ చూపించే ఆమె.. ఇదే సబ్జెక్టులో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసింది. 2016లో పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ ఆఫ్ కెటలోనియా నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకుంది. ప్రస్తుతం Ecole Polytechnique Federale de Lausanne (EPFL)లో పోస్ట్‌ డాక్టొరల్ రీసెర్చర్‌గా కొనసాగుతోన్న ఈ గణిత మేధావి.. గణిత భౌతిక శాస్త్రాల్లో ఉత్పన్నమయ్యే Nonlinear Partial Differential Equations పై పరిశోధనలు జరిపే బృందంలో భాగమయ్యారు. ఇలా ఓవైపు చదువుకుంటూనే మరో వైపు పరుగుపై ఆసక్తి పెంచుకున్నారు అన్నా. ఈ క్రమంలోనే 2011-2013 వరకు ట్రయాథ్లాన్‌, డ్యూయథ్లాన్‌.. వంటి పరుగు ఈవెంట్లలో పాల్గొన్నారు. ఆ తర్వాత గాయం కారణంగా పరుగు పోటీల్లో పాల్గొనడం తగ్గించుకొని సైక్లింగ్‌పై దృష్టి పెట్టారామె. అలా 2014లో ప్రారంభమైన తన సైక్లింగ్‌ పతకాల వేట నేటికీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. తన కెరీర్‌లో 2019లో నేషనల్‌ రోడ్‌ రేస్‌ ఛాంపియన్‌షిప్స్‌, 2019, 2020, 2021.. వరుసగా మూడేళ్లలో నేషనల్‌ టైమ్‌ ట్రయల్‌ ఛాంపియన్‌షిప్స్‌ పోటీల్లో పలు పతకాలు గెలుచుకుందామె.

మరపురాని విజయమిది!

అనుకోకుండా వరించిన విజయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటోంది అన్నా. ‘అందరికంటే ముందుగా లక్ష్యాన్ని దాటానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నా నుంచి టీమ్‌కు గట్టి పోటీ అయితే ఇవ్వాలనుకున్నా.. ఎందుకంటే పోటీలో పాల్గొన్న బృంద సభ్యులంత అనుభవం నాకు లేదు. కానీ అందరినీ వెనక్కి నెట్టి పసిడి గెలుచుకోవడం అద్భుతంగా అనిపిస్తోంది. మొత్తానికి ఎలాంటి ఒత్తిడి లేకుండానే రేసు పూర్తి చేశాను..’ అంటోంది అన్నా. ఎంతటి ప్రతిష్ఠాత్మక పోటీ అయినా.. భయపడకుండా మనపై మనం పూర్తి నమ్మకముంచితే విజయం కచ్చితంగా వరిస్తుందంటూ చెప్పకనే చెప్పారీ గణిత మేధావి. ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అన్నాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

కంగ్రాట్స్‌ అన్నా!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని