Jiya Rai: ‘ఆటిజం’ను ఎదిరించి.. స్విమ్మర్‌గా రాణిస్తోంది!

పిల్లల్లో శారీరక, మానసిక లోపాలున్నా తమకంటూ ఆసక్తి ఉన్న అంశాలు కొన్నుంటాయి. తల్లిదండ్రులు వాటిని పసిగట్టి ప్రోత్సహిస్తే వాళ్లూ అరుదైన శిఖరాలు అందుకోగలరు. ఇందుకు తాజా ఉదాహరణే.. 13 ఏళ్ల జియా రాయ్‌. రెండేళ్ల వయసులో ఆటిజం సమస్య బారిన పడిన ఆమె.. ఇప్పుడు ఈతలో ప్రపంచ రికార్డులు.....

Published : 26 Mar 2022 13:09 IST

(Photos: Facebook)

పిల్లల్లో శారీరక, మానసిక లోపాలున్నా తమకంటూ ఆసక్తి ఉన్న అంశాలు కొన్నుంటాయి. తల్లిదండ్రులు వాటిని పసిగట్టి ప్రోత్సహిస్తే వాళ్లూ అరుదైన శిఖరాలు అందుకోగలరు. ఇందుకు తాజా ఉదాహరణే.. 13 ఏళ్ల జియా రాయ్‌. రెండేళ్ల వయసులో ఆటిజం సమస్య బారిన పడిన ఆమె.. ఇప్పుడు ఈతలో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలే 29 కిలోమీటర్ల పాక్‌ జలసంధిని 13 గంటల 10 నిమిషాల్లో ఈది.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా, అత్యంత వేగవంతమైన మహిళా స్విమ్మర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇదే కాదు.. గతంలోనూ పలు రికార్డులు ఆమెకు దాసోహమన్నాయి. మరి, ప్రత్యేక అవసరాలున్న ఈ అమ్మాయికి ఇదంతా ఎలా సాధ్యమైంది? తెలుసుకుందాం రండి..

అంగ వైకల్యం, మనో వైకల్యం.. వంటి సమస్యలున్న పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. కానీ ఇది నూటికి నూరుపాళ్లు తప్పని నిరూపిస్తోంది ముంబయికి చెందిన జియా రాయ్‌. ప్రస్తుతం 13 ఏళ్ల వయసున్న ఈ అమ్మాయి ఈతలో అనితర సాధ్యమైన రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది.

‘ఆటిజం’ను ఎదిరించి..!

జియా తండ్రి మదన్‌రాయ్‌ ఇండియన్‌ నేవీలో ఉన్నత హోదాలో పని చేస్తున్నారు. ఆమెకు రెండేళ్ల వయసున్నప్పుడు ఆటిజం లక్షణాలు కనిపించడం, మాటలు రావడం ఆలస్యమవడం కారణంగా వైద్యుల్ని సంప్రదించారు జియా తల్లిదండ్రులు. ఈ క్రమంలో ఆమెలో Repetitive Knocking (ఒక వస్తువును పదే పదే తట్టడం/కొట్టడం) అలవాటుందని గ్రహించిన డాక్టర్‌.. ఆమెకు జలక్రీడల్ని థెరపీగా సూచించారు. అలా తన చిన్న వయసులో ఈతను తొలిసారి పరిచయం చేసుకుంది జియా. నిజానికి ఈ థెరపీ తన సమస్యకు ఓ పరిష్కారం చూపడమే కాదు.. తన భవిష్యత్తు లక్ష్యమేంటో తనకు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈత పట్ల తన కూతురు పెంచుకున్న ఆసక్తిని గమనించిన ఆమె తల్లిదండ్రులు ఈ దిశగానే జియాను ప్రోత్సహించారు. అటు చదువుతో పాటు ఇటు స్విమ్మింగ్‌లోనూ ఆమెను వెన్నుతట్టారు. ప్రస్తుతం ముంబయిలోని నేవీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోన్న జియా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో నిర్వహించే పలు ఈత పోటీల్లో పాల్గొని తనకెదురులేదనిపిస్తోంది.

మోదీ ప్రశంసలు!

‘భారత పారా స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌’ ఆధ్వర్యంలో ఇటీవలే నిర్వహించిన ఓ పోటీలో పాల్గొంది జియా. ఇందులో భాగంగా 29 కిలోమీటర్ల పాక్‌ జలసంధిని 13 గంటల 10 నిమిషాల్లో ఈదింది. శ్రీలంకలోని తలైమనార్‌ వద్ద ఉదయం 4.22 గంటలకు ప్రారంభమైన తన ప్రయాణం.. ఆ రోజు సాయంత్రం 5.32 గంటలకు తమిళనాడులోని ధనుష్కోటి చేరుకోవడంతో ముగిసింది. ఇలా ఈ మొత్తం దూరాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలిగా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మహిళా స్విమ్మర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిందీ ముంబయి గర్ల్‌. గతంలో ఈ రికార్డు పశ్చిమ బంగకు చెందిన బ్యూలా ఛౌదరి పేరిట ఉంది. 2004లో ఆమె ఈ దూరాన్ని 13 గంటల 52 నిమిషాల్లో పూర్తి చేసింది. ఇక ఈ విజయంతో జియా గోలి శ్యామల, ఆర్‌ జై జస్వంత్‌, కుట్రాలీశ్వరన్‌.. వంటి మేటి స్విమ్మర్స్‌ సరసన చేరింది. తన మానసిక వైకల్యాన్ని ఎదిరించి తాజాగా అరుదైన రికార్డు సాధించిన జియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని మోదీ కూడా ‘మన్‌ కీ బాత్‌’లో జియా పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసించారు.

దాసోహమన్న రికార్డులు!

మనో వైకల్యాన్ని జయించి తన అసమాన ప్రతిభతో ఓపెన్‌ వాటర్‌ స్విమ్మర్‌గా ఎదిగిన జియా.. ఆటిజంపై అందరిలో అవగాహన పెంచే ముఖ్యోద్దేశంతో పలు ఈవెంట్లు, క్రీడల్లో పాల్గొంటోంది. లోపం మన ప్రతిభకు అడ్డు కానే కాదని తన విజయాలతో నిరూపిస్తోందీ ట్యాలెంటెడ్‌ గర్ల్‌. అందుకే ఇప్పుడే కాదు.. గతంలోనూ పలు ప్రపంచ రికార్డులు ఆమెకు దాసోహమన్నాయి.

* గతేడాది జనవరిలో ముంబయిలోని ఆర్నాలా కోట - వసాయ్‌ కోట.. మధ్య గల 22 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల 4 నిమిషాల్లో ఈది.. ఈ ఘనత సాధించిన తొలి పారా స్విమ్మర్‌గా నిలిచింది.

* అదే ఏడాది ఫిబ్రవరిలో బాంద్రాలోని వర్లి సముద్ర తీరం నుంచి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వరకు గల 36 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల 40 నిమిషాల్లో ఈదింది. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా, ప్రత్యేక అవసరాలున్న అమ్మాయిగా చరిత్ర సృష్టించింది.

* ఇక 2020లో, ఎలిఫెంటా ఐలాండ్‌ నుంచి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా మధ్య గల 14 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల 27 నిమిషాల్లో ఈదిన.. ప్రపంచంలోనే తొలి ఆటిజం అమ్మాయిగా నిలిచింది జియా.

* తన అరుదైన విజయాలకు గుర్తింపుగా ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ జియా తన పేరును నమోదు చేసుకుంది.

* 2020లో జరిగిన ‘పారా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌’లో భాగంగా 3 బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకుందీ బ్రిలియంట్‌ స్విమ్మర్‌. మరోవైపు.. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో నిర్వహించిన పోటీల్లో మొత్తంగా 24 బంగారు, ఒక వెండి పతకం సాధించిందీ యువ స్విమ్మర్.

* గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఈత కొట్ట గల ప్రత్యేక అవసరాలున్న మహిళగానూ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుందీ ముంబయి గర్ల్.

* ఈతలో ఆమె సృష్టిస్తోన్న రికార్డులు, గెలుచుకుంటోన్న పతకాలకు గుర్తింపుగా పలు అవార్డులు-రివార్డులు అందుకున్న ఈ పారా స్విమ్మర్‌.. ఈ ఏడాది ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’ అందుకుంది.

ఒలింపిక్స్‌ లక్ష్యంగా!

నీళ్లు కనిపిస్తే చాలు చేప పిల్లలా ఈత కొట్టాలని పరితపించే జియాకు మైఖేల్‌ ఫిలిప్స్‌ రోల్‌ మోడల్‌ అట. అతని లాగే ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోందీ యంగ్‌ స్విమ్మర్‌. మరోవైపు సముద్రాల పైనా ఓ కన్నేసింది జియా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సప్త సముద్రాల్ని దాటడమే లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన అతిపిన్న పారా స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించాలని రాత్రింబవళ్లూ శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే ఓవైపు చదువును కొనసాగిస్తూనే.. మరోవైపు ఉదయం, సాయంత్రం ఈత సాధన చేస్తోంది.

ఇలా తన కూతురు సాధిస్తోన్న విజయాలకు ఆమె తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. శారీరక, మానసిక వైకల్యాలున్నా.. పిల్లల్ని తమకు నచ్చిన రంగాల్లో ప్రోత్సహిస్తే ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పకనే చెబుతున్నారు.

గుడ్‌ లక్‌ జియా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్