Updated : 15/07/2022 19:44 IST

Monsoon Food: వర్షాకాలంలో.. వీటికి దూరంగా..!

ఇంకా వివిధ ప్రాంతాల్లో వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వానలు వస్తూ వస్తూ వివిధ అనారోగ్యాలను కూడా మోసుకొస్తాయి. ప్రత్యేకించి ఈ కాలంలో తినే కొన్ని పదార్థాల ద్వారా వివిధ అంటువ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. ఈ క్రమంలో- ఆహారం విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మీకోసం...

ఫ్రైడ్ ఫుడ్

నూనెలో బాగా వేయించిన పదార్థాలంటే ఎవరికైనా ఇష్టమే. ముఖ్యంగా పకోడీ, మిర్చీబజ్జీ.. వంటి కరకరలాడే స్నాక్స్ ఇంట్లోనే పరిశుభ్రంగా తయారుచేసుకున్నప్పటికీ అవి ఈ కాలంలో ఆరోగ్యానికి అంతగా మంచివి కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వానాకాలంలో వాతావరణంలో తేమ అధికమై, శరీరంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో నూనె సంబంధిత పదార్థాలు తినడం వల్ల అవి తొందరగా జీర్ణం కావు. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఫ్రై చేసిన ఆహార పదార్థాల వల్ల శరీరంలో అనవసర కొవ్వు నిల్వలు పెరిగి వూబకాయం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో ఇలాంటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

వీటికి బై బై..

వర్షం పడుతున్న సమయంలో మనం బయట ఉన్నామనుకోండి. ఆ పక్కనే ఓ చాట్ బండి ఉంది.. అప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది.. ఇంకేమనిపిస్తుంది.. వెంటనే మనం, మన పక్కన ఉన్న స్నేహితులు.. ఎవరైనా సరే- అందరూ కలిసి చాట్, పానీపూరీ, భేల్ పురీ, దహీ పురీ.. వంటివి ఎంతో ఇష్టంగా లాగించేస్తారు కదూ.. ఇలా తినేటప్పుడు ఎంజాయ్‌మెంట్ వరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఆ తర్వాతే మొదలవుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో ఇలాంటి బయటి ఆహార పదార్థాలు తినడం వల్ల విరేచనాలు, పచ్చకామెర్లు.. వంటి సమస్యల బారిన పడక తప్పదు. ఇందుకు వాటి తయారీలో పరిశుభ్రమైన నీరు వాడకపోవడం కూడా ఓ కారణమే. కాబట్టి వాన పడుతున్నప్పుడు ఈ తరహా ఆహార పదార్థాలకు స్వస్తి పలకడమే ఉత్తమం. వీటితో పాటు బయట దొరికే పండ్ల రసాలకు కూడా దూరంగా ఉండాలి. ఒకవేళ అంతగా తీసుకోవాలని కోరికగా ఉంటే ఇంట్లోనే శుభ్రంగా తయారుచేసుకొని తాగడం మంచిది.

ఆకుకూరల విషయంలో జాగ్రత్త..

వర్షాకాలంలో ఆకుకూరల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి మట్టిలో మొలకెత్తుతాయి. వీటిని నేరుగా భూమిలోంచి పీకి కట్టలు కట్టి అమ్ముతుంటారు. వాటిలో ఉండే తేమ కారణంగా మట్టిలో ఉండే పలు రకాల క్రిములు మొక్కల్లోనే తమ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. కొన్ని రకాల పురుగులు కూడా ఆకుల రంగుల్లో కలిసిపోయి మనం గమనించే వీలు ఉండకపోవచ్చు. ఫలితంగా వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ క్రిములు మన శరీరంలోకి సులభంగా ప్రవేశించి అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. కాబట్టి వర్షాకాలంలో ఆకుకూరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని నిశితంగా పరిశీలించి పురుగుల్లాంటివేమీ లేకుండా ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి, ఆ తర్వాతే వాడాలి. అలాగే ఈ కాలంలో పుట్టగొడుగులకు కూడా దూరంగా ఉండటం మంచిది. ఇతర కూరగాయలను కూడా శుభ్రంగా కడిగి మరీ వండుకోవడం ఆరోగ్యదాయకం అని గుర్తుంచుకోండి.

ముందే కోసినవి..

'ఉదయాన్నే సమయం ఉండదు కదా!' అని ఆఫీసుకు తీసుకెళ్లే పండ్లు, కూరగాయలు ముందురోజు రాత్రే కట్ చేసుకొని పెట్టుకుంటారు చాలామంది. అయితే వర్షాకాలంలో ఈ పద్ధతికి చరమగీతం పాడడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో వాతావరణంలో అధికంగా ఉండే తేమ వల్ల మనం కట్ చేసుకొని పెట్టుకున్న పండ్ల ముక్కల్ని ఎంత జాగ్రత్తగా భద్రపరచినప్పటికీ వాటిపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అలాగే తీసుకోవడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యల్ని కొనితెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి, తాజాగా కట్ చేసిన పండ్లను మాత్రమే తినడం అత్యుత్తమం.

మాంసాహారం..

ఇదేవిధంగా వర్షాకాలంలో మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మన జీర్ణ వ్యవస్థ నెమ్మదించడమే ఇందుకు కారణం. అలాగే పచ్చిగా ఉండే ఇలాంటి మాంసాహారంలో వాతావరణంలోని బ్యాక్టీరియా త్వరగా చేరి మన ఆరోగ్యానికి హాని కలిగించచ్చు. తద్వారా పచ్చకామెర్లు, విరేచనాలు, టైఫాయిడ్, వైరల్ ఫీవర్.. వంటి అనారోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి వానాకాలంలో వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండడమే శ్రేయస్కరం. వీటితో పాటు చేపలు, రొయ్యలు.. వంటి సీఫుడ్‌కు సైతం స్వస్తి పలకడం మంచిది. దీనికీ ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఈ సమయంలో సముద్ర జీవులు ప్రత్యుత్పత్తి దశలో ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల కొంతమందికి అజీర్తి, వాంతులు కావడం.. వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి వర్షాకాలంలో మాంసాహారంతో పాటు సీఫుడ్‌కు కూడా కాస్త దూరంగానే ఉండటం మంచిది.

ఇవి కూడా గుర్తుంచుకోండి..

బయట వర్షం పడుతోందని బద్ధకించి వ్యాయామానికి మంగళం పలకకూడదు. వర్షాకాలమైనా సరే వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని వ్యర్థాలు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతాయి.

వర్షాకాలంలో ఆహారం కాస్త తక్కువగానే తీసుకోవాలి. తద్వారా ఎలాంటి అజీర్తి సమస్యల బారిన పడే అవకాశం ఉండదు.

దాహం వేయట్లేదు కదా అని నీరు తాగకుండా ఉంటే అది క్రమంగా డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. కాబట్టి పరిశుభ్రమైన నీరు నిర్ణీత వ్యవధిలో తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఏదైనా తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం.. వంటి అలవాట్లు పాటించడం వల్ల వర్షాకాలంలోనూ ఆరోగ్యంగా ఉండచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని