నా దృష్టిలో విడాకులు అంటే మనల్ని మనం ఎంచుకోవడం!

విడాకులు... జీవితంలో ఎవరూ కోరుకోని అత్యంత కఠినమైన మలుపు. కడదాకా కలిసుందామని కలలు కన్న జీవిత భాగస్వామితో విడిపోవడం..ఇక తను లేకుండా మిగిలిన జీవితాన్ని గడిపేయాలన్న ఆలోచన ఎవరికైనా తీరని ఆవేదన కలిగిస్తుంది.

Updated : 09 Sep 2021 21:35 IST

(Photo: Instagram)

విడాకులు... జీవితంలో ఎవరూ కోరుకోని అత్యంత కఠినమైన మలుపు. కడదాకా కలిసుందామని కలలు కన్న జీవిత భాగస్వామితో విడిపోవడం..ఇక తను లేకుండా మిగిలిన జీవితాన్ని గడిపేయాలన్న ఆలోచన ఎవరికైనా తీరని ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళల జీవితంపై విడాకులు బాగా ప్రభావం చూపుతాయి. దీనికి తోడు భర్తతో విడిపోయిన స్త్రీలంటే సమాజం చూసే చిన్న చూపు వారిని మరింత అగాథంలోకి నెడుతుంది. ఇదిలా ఉంటే విడాకులకు సంబంధించి కొన్ని శక్తిమంతమైన అర్థాలను చెప్పుకొచ్చింది అయేషా ముఖర్జీ. ప్రముఖ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌తో విడిపోతున్నట్లు ప్రకటించిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

తొమ్మిదేళ్ల బంధం విడిపోయింది!

ఫేస్‌బుక్‌లో మొదటిసారిగా కలుసుకున్న అయేషా- ధావన్ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2014లో వీరికి జొరావర్‌ అనే బాబు పుట్టాడు. తొమ్మిదేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా కలిసున్న ఈ జంట హఠాత్తుగా విడిపోతున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేసిన అయేషా ఇలా రాసుకొచ్చింది.

నా భయాన్ని పోగొట్టుకున్నా..!

‘వివాహం, విడాకులు అనే పదాలు చాలా శక్తిమంతమైన అర్థాలు కలిగి ఉంటాయి. రెండోసారి విడాకులు తీసుకునే వరకు విడాకులు అనేది నాకు ఓ చెత్త పదంలా అనిపించేది. మొదటిసారి డైవోర్స్ తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను. జీవితంలో ఓడిపోయినట్లు, ఏదో తప్పు చేస్తున్నట్లు అనిపించింది. నా స్వార్థం కోసం తల్లిదండ్రులు, పిల్లలను ఇబ్బంది పెట్టినట్లు భావించాను. అలాంటిది ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాను. ఇది తలచుకుంటేనే ఎంతో భయంకరంగా అనిపించింది. కానీ ఈ సమయంలోనే నేనేంటో మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నాతో నేను కూర్చొని బాగా ఆలోచించి నా భయాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను మరింత శక్తిమంతురాలిగా తయారయ్యాను. ఇప్పుడు నా దృష్టిలో విడాకులు అంటే... మనల్ని మనం ఎంచుకోవడం, ఒంటరిగా మన లక్ష్యాల వైపు ప్రయాణించడం..కొన్నిసార్లు మన కలల ప్రయాణానికి చేరుకోకపోవచ్చు. అయినా వచ్చే నష్టమేమీ లేదు. మనల్ని మనం మరింత బలంగా మార్చుకోవాలి’ అని స్ఫూర్తిదాయక మాటలు రాసుకొచ్చింది అయేషా.

కిక్‌బాక్సర్‌గా రాణించి!

అయేషా ఓ ఆంగ్లో- ఇండియన్‌. తల్లి బ్రిటిష్‌ దేశస్థురాలు కాగా తండ్రిది పశ్చిమబెంగాల్‌. అయేషా పుట్టిన తర్వాతే కుటుంబమంతా మెల్‌బోర్న్‌కు వెళ్లి స్థిరపడింది. అక్కడే కిక్‌ బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందిన అయేషా...జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంది. ఇక ధావన్‌ను వివాహం చేసుకోవడానికి ముందు అయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరిద్దరి దాంపత్య బంధానికి గుర్తుగా రియా, అలియా అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అయితే ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు.

ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారి!

ధావన్‌, అయేషాలు ఫేస్‌బుక్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. మరో క్రికెటర్‌ హర్భజన్ సింగ్‌ వీరిద్దరికీ కామన్‌ ఫ్రెండ్‌ కావడంతో ఫేస్‌బుక్‌లో అయేషాను చూసిన ధావన్‌ వెంటనే ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపాడు. ఆమె కూడా యాక్సెప్ట్‌ చేయడంతో వీరి స్నేహానికి దారులు తెరచుకున్నాయి. ఇద్దరి మనసులు కూడా కలవడంతో 2012లో కుటుంబ సభ్యుల అనుమతితో పెళ్లిపీటలెక్కారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్