ఇంట్లో ఇవి ఉంటే ఎయిర్‌ ప్యూరిఫయర్‌తో పనేముంది!

ప్రస్తుత రోజుల్లో పీల్చే గాలిలో కూడా నాణ్యత కరువవుతోంది. దీంతో గాలిని శుభ్రం చేయడానికి కొంతమంది ఇంట్లో ఎయిర్‌ ప్యూరిఫయర్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వేలకు వేలు డబ్బులు పోసి దాన్ని కొనే అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఇంటి గాలిని....

Published : 09 Apr 2023 12:32 IST

ప్రస్తుత రోజుల్లో పీల్చే గాలిలో కూడా నాణ్యత కరువవుతోంది. దీంతో గాలిని శుభ్రం చేయడానికి కొంతమంది ఇంట్లో ఎయిర్‌ ప్యూరిఫయర్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వేలకు వేలు డబ్బులు పోసి దాన్ని కొనే అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఇంటి గాలిని శుద్ధి చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇంట్లో గాలిని కొన్ని సహజ చిట్కాలతో ఎలా శుభ్రం చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి...

ఈ రెండూ ఉంటే చాలు!

తాజా వేపాకులు, అరటీస్పూన్‌ పసుపు.. ఈ రెండింటినీ ఒక బౌల్‌లో తీసుకొని అందులో నిండా నీళ్లు పోసి ఓసారి కలుపుకోవాలి. అంతే.. ఈ బౌల్‌ని గదిలో ఓ మూలన లేదా టేబుల్‌పై ఉంచితే ఆ గదిలోని గాలి ఇట్టే శుభ్రపడుతుంది. అంతేకాదు.. ఈ మిశ్రమంతో చేతుల్ని కూడా శానిటైజ్‌ చేసుకోవచ్చు.

దేంతో.. ఏం ఉపయోగం?

వేపాకుల్ని సహజసిద్ధమైన ఎయిర్‌ ఫిల్టర్స్‌గా పిలుస్తారు. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఫంగల్‌.. వంటి ఎన్నో గుణాలు ఈ ఆకుల్లో ఉన్నాయి. వీటి ఉపరితలం గాలిలోని కార్బన్‌ డయాక్సైడ్‌తో పాటు ఇతర కాలుష్య కారకాలను, దుమ్ము-ధూళిని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. తద్వారా గాలి శుభ్రపడుతుంది.

ఇక పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడతాయి.

ఇవి కూడా!

గదిలోని గాలి పరిశుభ్రంగా ఉండాలంటే సరైన వెంటిలేషన్‌ ఉండడం తప్పనిసరి. లేదంటే ఆ గదిలోని తేమ అక్కడి గాలిని కలుషితం చేస్తుంది.

ఇక కిచెన్‌లో వెలువడే ఘాటైన వాసనల్ని బయటికి పంపించేయడానికి ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ని అమర్చుకోవాలి. ఇది ఇంట్లోని కలుషితమైన గాలిని కూడా బయటికి పంపించడంలో సహకరిస్తుంది.

చాలామంది ఇంట్లో సువాసన కోసం సెంటెడ్‌ క్యాండిల్స్‌ని వినియోగిస్తుంటారు. అయితే వీటిలోని రసాయనాల వల్ల గాలి మరింత కలుషితమవుతుంది. అందుకే వీటికి బదులుగా బీస్‌వ్యాక్స్‌ క్యాండిల్స్‌ని ఉపయోగించడం ఉత్తమం. ఇవి నెమ్మదిగా కరగడంతో పాటు వీటి నుంచి ఎలాంటి పొగ వెలువడదు. అలాగే ఇంట్లోని గాలిని శుద్ధి చేయడానికీ ఇవి చక్కగా ఉపయోగపడతాయి.

సాల్ట్‌ ల్యాంప్స్‌ కూడా సహజసిద్ధమైన ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌గా ఉపయోగపడతాయి. ఇవి ఇంట్లోని గాలిలో ఉండే విషపదార్థాలను ఆకర్షించి.. గాలిని శుద్ధి చేస్తాయి.

వెదురు కర్రలను మండించగా తయారైన బొగ్గుని కూడా న్యాచురల్‌ ఎయిర్‌ ప్యూరిఫయర్‌గా పిలుస్తారు. ఇది ఎలాంటి వాసనను వెదజల్లదు.. సరికదా గాల్లోని విషపదార్థాలను, కాలుష్య కారకాలను, బ్యాక్టీరియా, వైరస్‌లను ఆకర్షించే గుణం దీనికి చాలా ఎక్కువ.

ఇక ఇంట్లోని గాలిని శుద్ధి చేసుకోవడానికి ఇండోర్‌ ప్లాంట్స్‌ కూడా చక్కగా దోహదం చేస్తాయి. ముఖ్యంగా కలబంద, తులసి, బోస్టన్‌ ఫెర్న్‌, మనీ ప్లాంట్‌, స్నేక్‌ ప్లాంట్‌, రబ్బర్‌ మొక్కలు, పీస్‌ లిల్లీ, చామంతి.. వంటి మొక్కల కుండీలను ఆయా గదుల్లో అమర్చడం వల్ల అక్కడి గాలి శుద్ధవుతుంది.

గాలిలోని వివిధ సూక్ష్మక్రిములను పారదోలే శక్తి అత్యవసర నూనెలకు ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అందుకే రోజ్‌మేరీ, టీట్రీ, నిమ్మ, లవంగం, గ్రేప్‌ ఫ్రూట్‌.. వంటి అత్యవసర నూనెల్లో ఏదో ఒకదాన్ని కొన్ని కాటన్‌ బాల్స్‌పై వేసి ఆయా గదుల్లో అక్కడక్కడా అమర్చుకోవడం వల్ల అక్కడి గాలి శుభ్రపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్