Fit@50+ : అది నిరూపించడానికే ఇంతటి సాహసం చేశారు!

ఫిట్‌నెస్‌.. ఇది ఒక వయసుకే పరిమితం అనుకుంటారు చాలామంది. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం, శారీరక దృఢత్వంపై పట్టు సడలుతుందనుకుంటారు. కానీ ఆ భావన తప్పని నిరూపించారు 12 మంది మహిళలు. సుమారు ఐదు వేల కిలోమీటర్ల కఠినమైన మార్గాన్ని ఐదు నెలల్లో దాటి....

Updated : 06 Sep 2022 15:25 IST

(Photo: Instagram)

ఫిట్‌నెస్‌.. ఇది ఒక వయసుకే పరిమితం అనుకుంటారు చాలామంది. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం, శారీరక దృఢత్వంపై పట్టు సడలుతుందనుకుంటారు. కానీ ఆ భావన తప్పని నిరూపించారు 12 మంది మహిళలు. సుమారు ఐదు వేల కిలోమీటర్ల కఠినమైన మార్గాన్ని ఐదు నెలల్లో దాటి ఫిట్‌నెస్ విషయంలో ఆడ, మగ తేడా లేదని చాటి చెప్పారు. ఇక ఇందులో ఉన్న మహిళలంతా 50 ఏళ్లు పైబడిన వారే కావడం గమనార్హం. ప్రముఖ పర్వతారోహకురాలు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత బచేంద్రీ పాల్‌ నాయకత్వంలో కొనసాగిన ఈ ‘విమెన్స్‌ ట్రాన్స్‌ హిమాలయన్‌ యాత్ర’.. తాజాగా లద్దాఖ్‌లోని కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుంది. ‘కార్గిల్‌ విజయ్‌ దివస్’ (జులై 26) సందర్భంగా భారత సైన్యం ఈ సాహస మహిళా బృందాన్ని సత్కరించింది. ఈ నేపథ్యంలో వీళ్ల సాహసయాత్ర విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

‘ఏ వయసులో ఉన్న మహిళలకైనా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం.. అప్పుడే వాళ్లు అటు ఇంటి పనులు, ఇటు ఆఫీస్ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించగలుగుతారు..’ తాజాగా పూర్తైన ‘ఫిట్‌@50+’ సాహస యాత్ర ముఖ్యోద్దేశమిదే. జులై 26న ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ను పురస్కరించుకొని ‘టాటా స్టీల్‌ అడ్వెంచర్‌ ఫౌండేషన్‌’, ‘భారత యువజన వ్యవహారాలు-క్రీడల మంత్రిత్వ శాఖ’ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సాహస యాత్ర విజయవంతంగా పూర్తైంది.

అప్పుడే జరగాల్సింది.. కానీ!

కరోనా ప్రతికూల పరిస్థితుల రీత్యా ఎన్నో కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.. మరెన్నో రద్దయ్యాయి. అలా వాయిదా పడ్డ ఈవెంట్లలో ఈ ‘విమెన్స్‌ ట్రాన్స్‌ హిమాలయన్‌ యాత్ర’ కూడా ఒకటి. నిజానికి గతేడాదే ఈ యాత్ర నిర్వహించాలని తలపెట్టినా కరోనా కారణంగా ఈ ఏడాది మార్చికి వాయిదా వేశారు. ఇక ఈ యాత్రలో 50 ఏళ్లు పైబడిన మహిళలు 12 మంది పాల్గొన్నారు. ఈ బృందానికి ప్రముఖ పర్వతారోహకురాలు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బచేంద్రీ పాల్‌ నాయకత్వం వహించారు. అంతేకాదు.. ఈ టీమ్‌లో ఆమెతో పాటు మరో ఇద్దరు ఎవరెస్ట్‌ను అధిరోహించిన వారూ ఉన్నారు.

37 శిఖరాల్ని దాటుకొని..!

సాధారణ రహదారిలో ఎన్ని కిలోమీటర్లైనా నడవచ్చు.. అదే రాళ్లు-రప్పలు, ఎగుడు-దిగుడుగా, ఏటవాలుగా ఉన్న మార్గంలో కొంత దూరం నడిచే సరికే అలసట వచ్చేస్తుంది. అయితే తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇలాంటి అత్యంత క్లిష్టమైన మార్గాన్నే ఎంచుకుంది పాల్‌ బృందం. మార్చి 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకొని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాంగ్‌-సా-పాస్‌ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర.. అసోం, పశ్చిమబంగ, సిక్కిం, నేపాల్‌, కుమాన్‌, ఘర్వాల్‌, హిమాచల్‌ప్రదేశ్‌, లేహ్‌, లద్దాఖ్‌.. మీదుగా సాగి తాజాగా ద్రాస్‌లోని కార్గిల్‌ అమర వీరుల స్థూపం వద్దకు చేరుకోవడంతో పూర్తైంది. ఇలా తూర్పు హిమాలయాల నుంచి పశ్చిమ హిమాలయాలకు.. ఐదు నెలల పాటు సాగిన ఈ సాహస యాత్రలో భాగంగా.. సుమారు 37 పర్వత శిఖరాల్ని, అడుగడుగునా ఉండే క్లిష్టమైన దారుల్ని దాటుకొని.. 4,977 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి లక్ష్యాన్ని చేరుకుందీ బృందం. ఈ క్రమంలో భారత సైన్యం కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్దే ఈ బృందాన్ని సత్కరించింది.

ఇది వాళ్లకు స్ఫూర్తి!

తమ యాత్ర అన్ని వర్గాల మహిళల్లో స్ఫూర్తి నింపుతుందని అంటున్నారు బృంద నాయకురాలు బచేంద్రీ పాల్‌. ‘మహిళలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఎందుకు ఉండాలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లో మనకు అర్థమైంది. ఆ సమయంలో వాళ్లు అటు ఇంటిని, ఇటు వృత్తిని సమర్థంగా నిర్వర్తించేందుకు ఎంతో కష్టపడ్డారు. అందుకే ఏ వయసులో ఉన్న మహిళలైనా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. తలచుకుంటే ఇది సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.. ఈ విషయం నిరూపించడానికే ఈ సాహస యాత్ర చేపట్టాం. మా బృందంలో ముగ్గురు పర్వతారోహకులతో పాటు పదవీ విరమణ పొందిన వారు, గృహిణులు సైతం భాగమయ్యారు..’ అంటూ తమ యాత్ర విశేషాలు పంచుకున్నారామె.


స్కూలుకెళ్లకుండా చదువుకొని..!

హిమాలయాల్లోని నకురి అనే కుగ్రామంలో 1954లో పుట్టారు బచేంద్రీ పాల్‌. ఆ సమయంలో అబ్బాయిలకు తప్ప అమ్మాయిలకు చదువుకోవడానికి అనుమతి లేదు. అయినా విద్యపై మక్కువ చూపారామె. ఈ క్రమంలోనే స్కూలుకెళ్లకుండా సొంతంగా ఇంట్లోనే పాఠాలు నేర్చుకున్నారు. ప్రతిభకు, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో ఎంఏ-బీఈడీ పూర్తిచేశారామె. ఈ క్రమంలోనే కళాశాలలో లెక్చరర్ల సలహాతో పర్వతారోహణపై ప్రేమ పెంచుకున్న ఆమె.. ‘నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌’లో శిక్షణ తీసుకున్నారు. అయితే చిన్న వయసు నుంచే కట్టెలు తేవడానికి, మేకలు మేపడానికి అక్కడి కొండలు, గుట్టలు ఎక్కే అలవాటున్న పాల్‌కు ఈ శిక్షణ మరింత ఉపయోగపడింది. దీంతో 1984లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ను అధిరోహించి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కారామె.

‘రిస్క్‌’ చేయాలి!

అయినా ‘పేరుకే కానీ.. ఇదేమైనా మూడు పూటలా అన్నం పెడుతుందా?!’ అన్నారంతా. కానీ ఈ విమర్శల్ని తిప్పి కొడుతూ.. ‘టాటా స్టీల్‌ అడ్వెంచర్‌ ఫౌండేషన్‌’లో స్పోర్ట్స్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించారామె. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఇదే సంస్థతో మమేకమైన ఆమె.. మహిళల్ని పర్వతారోహణ దిశగా ప్రోత్సహిస్తున్నారు.. వాళ్లలో స్ఫూర్తి నింపేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా పూర్తైన ‘ఫిట్‌@50+’ యాత్ర కూడా అలాంటిదే. ‘రిస్క్‌ లేని జీవితం చాలా ప్రమాదకరమైందన్నది నా నమ్మకం. అందుకే చిన్నప్పట్నుంచి ఎలాంటి రిస్క్‌ చేయడానికైనా వెనకాడకపోయేదాన్ని. నిజానికి ఇదే మనల్ని శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఎమోషనల్‌గా మరింత దృఢంగా మార్చుతుంది. మన శక్తియుక్తుల్ని, ప్రత్యేకతల్ని ప్రపంచానికి చాటుతుంది..’ అంటారీ ఎవరెస్ట్‌ ఉమన్‌. పాల్‌ సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2019లో ‘పద్మ భూషణ్‌’ అవార్డుతో సత్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్