Published : 07/02/2022 19:00 IST

వాటిని ఎదుర్కోవాలంటే ఇవి తప్పవు..!

కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, తృణ ధాన్యాలు, పెరుగు.. తదితర ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుందన్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో- అందులోనూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో- ఇమ్యూనిటీని పెంచే బలవర్ధకమైన ఆహారం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో- ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంపై దృష్టి పెట్టక తప్పదు.

ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!

* శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో పండ్లు, కూరగాయలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, ఫైటో న్యూట్రియంట్స్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

* పుల్లటి పండ్లలో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి నిమ్మ, బత్తాయి, కమలా పండ్లను అధికంగా తీసుకుంటే మంచిది. వీటితో పాటు  బొప్పాయి, జామ, యాపిల్‌, ద్రాక్ష,  తదితర పండ్లను కూడా తీసుకోవాలి.

* పెరుగులో పలు సూక్ష్మ పోషకాలుంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌ లాంటి వ్యాధికారక క్రిములను నశింపజేస్తాయి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇక పెరుగును రోజూ తీసుకుంటే అజీర్తి లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

* ప్రాసెస్డ్‌ ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పండ్ల రసాలను కూడా పరిమితంగా తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌, కార్బొనేటెడ్‌ పానీయాలకు స్వస్తి చెప్పండి.

* చికెన్‌, మటన్‌, గుడ్లు.. మొదలైనవాటిని తినేముందు బాగా శుభ్రం చేసుకుని, పూర్తిగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి.

* ఏ రూపంలో అయినా సరే- రోజూ కచ్చితంగా మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు శరీరానికి అందాలి.

* చేపలు, పీతలను కూడా ఆహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా పీతల్లో జింక్‌ లాంటి సూక్ష్మ పోషకాలు ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* కొవ్వు పదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి (రోజుకు 30 గ్రాముల కంటే ఎక్కువ ఫ్యాట్‌ తీసుకోకూడదు).

* ఉప్పును మితంగా వాడండి (రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ వాడరాదు).

* చక్కెర పదార్థాలను కూడా తగ్గించండి.

* మద్యపానం, ధూమపానం అలవాటున్న వారు ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది.

* మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారు వైద్య నిపుణులు సూచించిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి.

* వీటితో పాటు వంట చేయడానికి ముందు, తినే ముందు చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి.  అలాగే వ్యక్తిగత పరిశుభ్రత గురించి విడిగా చెప్పక్కర్లేదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని