Maternity Benefits: ఆ తల్లుల కోసం మూడేళ్లుగా పోరాడుతోంది!

ఏళ్లు గడుస్తోన్నా పిల్లలు పుట్టకపోవడం, సామాజిక స్పృహ.. ఇలా కారణమేదైనా కొంతమంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని అమ్మానాన్నలుగా ఓ మెట్టు పైకెక్కుతుంటారు. అయితే ఇలాంటి చిన్నారులు కొత్త వాతావరణానికి, కుటుంబ సభ్యులకు అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఉద్యోగినుల విషయంలో.. కన్న తల్లులతో పోల్చితే పెంచిన తల్లులకు సమానమైన ప్రసూతి ప్రయోజనాలు దక్కట్లేదనే చెప్పాలి.

Updated : 17 Nov 2021 16:06 IST

(Image for Representation)

ఏళ్లు గడుస్తోన్నా పిల్లలు పుట్టకపోవడం, సామాజిక స్పృహ.. ఇలా కారణమేదైనా కొంతమంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని అమ్మానాన్నలుగా ఓ మెట్టు పైకెక్కుతుంటారు. అయితే ఇలాంటి చిన్నారులు కొత్త వాతావరణానికి, కుటుంబ సభ్యులకు అలవాటు పడడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఉద్యోగినుల విషయంలో.. కన్న తల్లులతో పోల్చితే పెంచిన తల్లులకు సమానమైన ప్రసూతి ప్రయోజనాలు దక్కట్లేదనే చెప్పాలి. బిడ్డను కన్నా, దత్తత తీసుకున్నా.. పెంచే విధానంలో తేడా లేనప్పుడు.. ప్రసూతి ప్రయోజనాలు అందించడంలో ఈ భేదాభిప్రాయాలు ఎందుకని ప్రశ్నిస్తోంది బెంగళూరుకు చెందిన హంసానందిని నండూరి. వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఆమె.. మూడేళ్ల క్రితం ఇద్దరు చిన్నారుల్ని దత్తత తీసుకుంది. అయితే ఈ క్రమంలో పెంపుడు తల్లులకు సరైన ప్రసూతి ప్రయోజనాలు దక్కట్లేదన్న విషయం గ్రహించిన ఆమె.. అప్పట్నుంచి వీటి కోసమే పోరాటం చేస్తోంది. చట్ట ప్రకారం పెంపుడు తల్లుల ప్రసూతి ప్రయోజనాల్లో మార్పులు చేర్పులు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిల్‌ కూడా దాఖలు చేసింది. పెంపుడు తల్లులందరి తరఫున నిలబడి న్యాయ పోరాటం చేస్తోన్న ఈ అమ్మ ఆవేదనేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1961 ప్రకారం.. ప్రసవించిన మహిళలు 26 వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు తీసుకోవచ్చన్న విషయం తెలిసిందే! అదే పెంపుడు తల్లులకు/దత్తత తీసుకున్న మహిళలకు 12 వారాల పాటు ప్రసూతి సెలవులిస్తున్నారు. అది కూడా మూడు నెలల్లోపు వయసున్న చిన్నారిని దత్తత తీసుకుంటేనే! ఇక మూడు నెలలు దాటిన చిన్నారులకు పెంపుడు తల్లులుగా మారిన ఉద్యోగినులకు ఎలాంటి ప్రసూతి ప్రయోజనాలు దక్కట్లేదు. నిజానికి ఇలాంటి పిల్లల పెంపకం కోసం, వారు కొత్త ఇంటికి-వాతావరణానికి అలవాటు పడేలా చేయడానికి, కుటుంబ సభ్యులతో మమేకమవడానికి.. బోలెడంత సమయం పడుతుంది. అందుకే దత్తత తీసుకున్న తల్లులకూ కన్నతల్లి మాదిరిగానే సమానమైన ప్రసూతి ప్రయోజనాలు దక్కాలని కోరుతోంది బెంగళూరుకు చెందిన హంసానందిని నండూరి.

ఆరు వారాల సెలవిచ్చారు!

వృత్తిరీత్యా లాయర్ అయిన ఆమె.. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకొని అమ్మగా మారింది. అయితే పెంపుడు తల్లుల విషయంలో చట్టానికే కాదు.. ఈ సమాజానికీ చిన్న చూపే ఉందంటూ తన మనసులోని ఆవేదనను వెలిబుచ్చుతున్నారామె..
‘పెళ్లై ఐదేళ్లయ్యాక నేను, మా వారు ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అనుకున్నట్లుగానే ఏడాది బాబును, ఐదేళ్ల పాపను దత్తత తీసుకున్నాం. అయితే వాళ్లు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు.. మాదేమో బెంగళూరు.. ఇలా మాకు, వాళ్లకు భాషా భేదాలే కాదు.. ఆహారపుటలవాట్లూ విభిన్నంగానే ఉండేవి. పైగా నా పిల్లలిద్దరూ కాస్త ఎదిగిన వారు కాబట్టి.. వాళ్లు కొత్తింట్లో అలవాటు పడడానికి, కుటుంబ సభ్యులతో కలిసిపోవడానికి చాలా సమయం పట్టింది. ఈ క్రమంలో తల్లిగా అనుక్షణం వాళ్ల దగ్గరే ఉండి.. వాళ్లకు అన్ని అలవాట్లు నేర్పాల్సిన బాధ్యత నాదే! కాబట్టి అందుకు అనుగుణంగానే మా ఆఫీస్‌లో సెలవు కోసం అడిగాను. అయితే నియమనిబంధనల ప్రకారం ఆరు వారాలు మాత్రమే సెలవు మంజూరు చేశారు.

అన్నీ సమానమైనప్పుడు.. ఎందుకీ వివక్ష?!

కానీ నాకు ఆ సమయం సరిపోదనిపించింది. ఎందుకంటే.. కన్నా, దత్తత తీసుకున్నా పిల్లల పెంపకంలో ఎలాంటి తేడాలుండవు. అలాంటప్పుడు ప్రసూతి ప్రయోజనాల విషయంలో ఇలాంటి భేదాభిప్రాయాలుండడం సరికాదనిపించింది. నేనే కాదు.. మూడు నెలలు దాటిన పిల్లల్ని, కాస్త ఎదిగిన/లోకజ్ఞానం తెలిసిన చిన్నారుల్నీ దత్తత తీసుకునే తల్లిదండ్రులు ఈ సమాజంలో బోలెడంత మంది ఉన్నారు. అలాంటి వారు నాలా ఇబ్బందులు పడకూడదనుకున్నా.. అందుకే నా మనసులోని ఆవేదనంతా పిటిషన్‌ రూపంలో పొందుపరిచి ‘Change.org’లో సంతకాల సేకరణ చేపట్టా. ఇప్పటిదాకా సుమారు 36,700 మంది నా పిటిషన్‌పై సంతకాలు చేసి నాకు మద్దతు తెలిపారు. అంతేకాదు.. ఇదే విషయంపై సుప్రీం కోర్టులో పిల్‌ కూడా దాఖలు చేశా. కన్నతల్లులు, పెంచిన తల్లుల విషయంలో వివక్ష చూపకుండా.. పిల్లల వయసుతో సంబంధం లేకుండా.. వారి అవసరాలకు అనుగుణంగా ఇద్దరికీ సమానమైన ప్రసూతి ప్రయోజనాలు అందించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని.. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కార్మిక-మహిళా ఉపాధి మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖలను కోరుకుంటున్నా. ఈ క్రమంలో సానుకూలంగానే తీర్పు వస్తుందనుకుంటున్నా..’ అంటోందీ సూపర్‌ మామ్.

సమాజమూ మారాలి!

పెంపుడు తల్లుల్ని ఈ సమాజం కూడా వివక్షాపూరిత ధోరణిలోనే చూస్తుందంటోంది హంసానందిని. ‘కారణమేదైనా పిల్లల్ని దత్తత తీసుకోవడమనేది మంచి విషయం. సామాజిక స్పృహతో తీసుకునే నిర్ణయం. అయితే ఈ విషయంలో సమాజం నుంచి పెంపుడు తల్లులకు సరైన గౌరవమర్యాదలు దక్కట్లేదనే చెప్పాలి. నవమాసాలు మోసి కన్న తల్లికి.. పిల్లల పెంపకం విషయంలో ఎంతోమంది సలహాలిస్తుంటారు.. జాగ్రత్తలు చెబుతుంటారు. అదే ఓ బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు ఇలాంటి ఆదరణ దక్కట్లేదు.. కనీసం వారిని ఓ తల్లిగా అంగీకరించడానికి కూడా ఈ సమాజం ఇష్టపడట్లేదు. ఇలా పెంపుడు తల్లులకు ఇక్కడ కూడా వివక్షే ఎదురవుతుంది. కాబట్టి ఇలాంటి ధోరణిలో మార్పు రావాలి..’ అని కోరుతోందీ లాయర్‌ మామ్‌. మరి, అందరి సౌకర్యాన్ని కోరుకునే ఈ అమ్మ ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం!

ఈ క్రమంలో- హంసానందిని మనోవేదనపై మీ స్పందనేంటి? తల్లులందరికీ సమాన ప్రసూతి ప్రయోజనాలు దక్కాలంటే చట్టంలో ఇంకా ఎలాంటి మార్పులు చేయాలి? పెంపుడు తల్లులపై సమాజంలో ఉన్న వివక్ష తొలగిపోవాలంటే ఏం చేయాలి? మీ అభిప్రాయాలు, సలహాలను మాతో పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్