కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Updated : 07 Jul 2021 19:29 IST

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

అందరు పిల్లల్లాగే నేనూ నా చిన్నతనంలో బామ్మ చెప్పే కథల కోసం రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేదాన్ని. నిజంగా నా జీవితంలో అదో అందమైన జ్ఞాపకం. కానీ నాకు దక్కిన ఈ అదృష్టం నా చెల్లెలికి దక్కలేదనే చెప్పాలి. ఎందుకంటే నా చిన్నతనంలో మేమంతా రాజస్థాన్‌లోని మా బామ్మ-తాతయ్యల దగ్గరే ఉండేవాళ్లం. నేను అక్కడే పెరిగాను. కానీ కొన్నేళ్లు పోయాక మా ఫ్యామిలీ బెంగళూరుకు మకాం మార్చాల్సి వచ్చింది. దాంతో నేను, నా చెల్లి మా గ్రాండ్‌ పేరెంట్స్‌ని బాగా మిస్సయ్యే వాళ్లం. చదువు బిజీతో మేము.. ఉద్యోగాల్లో క్షణం తీరిక లేక మా తల్లిదండ్రులు.. ఇలా రాన్రానూ వాళ్లను కలవడం అరుదుగా మారింది. ఇక మా బామ్మ దగ్గర నేను విన్నన్ని కథలు కూడా నా చెల్లెలు వినలేదు.

‘వర్ణన్‌’ అలా ప్రారంభమైంది!

నా చిన్నతనంలో మా బామ్మ స్కూల్‌ పుస్తకాల్లో లేని ఎన్నో కథలు చెప్పేది. చరిత్రలోని ధైర్యవంతులైన స్త్రీ పురుషులు, పౌరాణిక పాత్రలు, విశ్వాసమైన జంతువులు.. వంటి కథలెన్నో ఆమె దగ్గర్నుంచి విన్నా. బోలెడన్ని విషయాలు నేర్చుకున్నా. ఇక ఇప్పుడైతే చాలామంది తల్లిదండ్రులు వృత్తి ఉద్యోగాలు, ఇతర కారణాల రీత్యా తమ వాళ్లకు దూరంగా ఉండాల్సి వస్తోంది. దాంతో వాళ్ల పిల్లలు తమ గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే నీతి కథల్ని చాలా మిస్సవుతున్నారు. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరిగిందని చెప్పాలి. అందుకే ఇలా తమ గ్రాండ్‌ పేరెంట్స్‌ చెప్పే కథల్ని మిస్సయ్యే చిన్నారులకు నేనే బామ్మలా మారి కథలు చెప్పాలని నిర్ణయించుకున్నా. ఈ ఆలోచనకు ప్రతిరూపమే ‘వర్ణన్‌’ వెబ్‌సైట్‌.

వినోదం-విజ్ఞానం!

ఇందులో కథలు రాయడానికి నాకంటూ ఓ చిన్న బృందం ఉంది. మా కుటుంబ సభ్యులు, స్నేహితులే ఈ బృంద సభ్యులు. దేశ చరిత్ర, సంస్కృతీ-సంప్రదాయాలు, పురాణ గాథలు.. వంటి వాటికి సంబంధించిన కథలు వారు రాస్తుంటారు. చరిత్రకు సంబంధించి పాఠ్య పుస్తకాల్లో పొందుపరచని, ఎక్కువ మందికి తెలియని వ్యక్తుల గురించి వెతికి.. క్లుప్తంగా, ఆసక్తికరంగా, సరళంగా కథ రాస్తుంటారు. ఇలాంటి కథల వల్ల పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందుతుంది. ఇక కథ రడీ అయ్యాక ఎడిటింగ్‌ పనంతా నేనే చూసుకుంటాను. ఈ క్రమంలో నాన్న కూడా నాకు సహాయం చేస్తున్నారు. చివరగా కథకు చక్కటి ఇలస్ట్రేషన్‌ జోడించి, అందంగా డిజైన్‌ చేయించి.. మా వెబ్‌సైట్‌లో ప్రచురిస్తున్నాం. ఆరేళ్ల పిల్లలకు కూడా మా కథలు సులభంగా అర్థం కావాలన్నదే మా ఆశయం!

అదే నా లక్ష్యం!

అయితే మా కథలు చదవాలనుకునే వారు వెబ్‌సైట్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉచితంగా అయితే నెలలో వారానికో కథ చొప్పున, నెలకు 2 డాలర్లు (సుమారు రూ. 150) చెల్లిస్తే వారానికి ఐదు కథల చొప్పున, అదే సంవత్సరానికి 20 డాలర్లు (సుమారు రూ. 1486) చెల్లిస్తే రోజుకో కథ చొప్పున సంవత్సరమంతా కథల్ని ఆస్వాదించచ్చు. ఇలా ఇప్పటిదాకా ప్రింట్‌ వెర్షన్‌లో కొనసాగిన మా కథలు ఇకపై ఆడియో వెర్షన్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మా టీమ్‌ అదే పని మీద ఉంది. భవిష్యత్తులో యానిమేషన్‌ వీడియోల రూపంలో కథలు రూపొందించాలని ఉంది. ఇలా కేవలం మన దేశ సంస్కృతీ సంప్రదాయాలే కాదు.. ఇతర దేశాల సంప్రదాయాల్ని కూడా కథల రూపంలో అక్కడి చిన్నారులకు చేరవేయాలనుకుంటున్నా. ఆ లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్