Published : 11/01/2023 20:13 IST

చెప్పుల్లేకుండా నడవనివ్వండి!

చిన్న పిల్లల్ని చెప్పుల్లేకుండా కాలు బయటపెట్టనివ్వం. పాదాలకు మట్టి అంటుతుందని, లేలేత పాదాలు కందిపోతాయని.. సాక్సులు, షూలు తొడిగేస్తుంటాం. అయితే ఈ అతి జాగ్రత్త అన్ని సందర్భాల్లో పనికి రాదంటున్నారు నిపుణులు. చిన్నారులు చెప్పుల్లేకుండా ఒట్టి కాళ్లతో నేలపై, పచ్చటి గడ్డిపై నడవడం వల్ల ఆరోగ్యపరంగా, మానసికంగా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కంటి చూపు మెరుగు..!

ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు చిన్న వయసులోనే కళ్లద్దాలు రావడం చూస్తున్నాం. ఇందుకు గ్యాడ్జెట్లు ఒక కారణమైతే, సరైన పోషకాహారం తీసుకోకపోవడం మరో కారణం అని చెప్పచ్చు. అయితే పిల్లలకు నడక వచ్చినప్పట్నుంచే వారిని చెప్పుల్లేకుండా నేలపై, పచ్చటి గడ్డిపై నడిపించడం కంటి ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. కంటికి అనుసంధానమైన నాడులకు సంబంధించిన ప్రెస్సింగ్‌ పాయింట్స్‌ పాదాల్లో ఉంటాయి. నేలపై నడవడం వల్ల వాటిపై ఒత్తిడి పడుతుంది. తద్వారా కళ్లకు సరైన రక్తప్రసరణ జరిగి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక పచ్చటి గడ్డిని చూడడం వల్ల కంటిలోని కండరాలు రిలాక్సవుతాయి. పెద్దైనా ఈ అలవాటును ఇలాగే కొనసాగించడం వల్ల ఇతర కంటి సంబంధిత సమస్యల్లేకుండా జాగ్రత్తపడచ్చు.

మెదడు చురుగ్గా..!

చిన్న వయసులో చెప్పులతో తిరిగిన పిల్లలతో పోల్చితే చెప్పుల్లేకుండా నేలపై తిరిగిన చిన్నారుల్లో మెదడు మరింత చురుగ్గా పనిచేస్తున్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందుకు మెదడుతో అనుసంధానమై ఉన్న ప్రెజర్‌ పాయింట్స్‌పై ఒత్తిడి పడడమే కారణం! దీనివల్ల మెదడులోని నాడులు ఉత్తేజితమవుతాయి. తద్వారా వారిలో ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తి.. వంటివి మెరుగుపడతాయి. అందుకే చెప్పుల్లేకుండా పిల్లల్ని వివిధ ఉపరితలాలపై నడిపించమని చెబుతున్నారు నిపుణులు. ఇక రోజూ కాసేపు పచ్చటి గడ్డిలో ఆడించడం, చెప్పుల్లేకుండా తిప్పడం.. వంటివి చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. హ్యాపీ హార్మోన్లుగా పిలిచే వీటి వల్ల మనసులోని టెన్షన్లన్నీ మాయమై.. మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. ఇక చెప్పుల్లేకుండా పచ్చటి గడ్డిపై నడవడం వల్ల ఒత్తిడి స్థాయులు 62 శాతం తగ్గినట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది.

సుఖ నిద్రకు..!

చిన్న పిల్లలు సమయానికి ఓ పట్టాన పడుకోరు. పైగా స్కూల్‌ ఉన్న రోజు, సెలవు రోజుల్లో వారి నిద్ర సమయాలు వేరుగా ఉంటాయి. నిజానికి దీనివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మెదడు ఎదుగుదల పైనా దీని ప్రభావం పడుతుంది. మరి, ఈ సమస్యల్లేకుండా.. రోజూ ఒకే రకమైన నిద్ర సమయాల్ని వారికి అలవాటు చేయాలంటే.. కాసేపు చెప్పుల్లేకుండా నేలపై, పచ్చటి గడ్డిపై నడిపించాలని చెబుతున్నారు నిపుణులు. ఈ ప్రక్రియ వల్ల శరీరంలోని హార్మోన్లు సమతులమవుతాయి. తద్వారా సుఖంగా నిద్ర పట్టడంతో పాటు ఇతర అనారోగ్యాల బారిన పడకుండా కూడా జాగ్రత్తపడచ్చు.

నెగెటివిటీ దూరం!

ప్రతికూల ఆలోచనలు పెద్దవారిలోనే కాదు.. చిన్న పిల్లల్లోనూ కలుగుతుంటాయి. పెద్దయ్యే క్రమంలో అవి వారిని మరింత నెగెటివిటీలోకి నెట్టేస్తుంటాయి. వాటిని కట్టిపెట్టి చిన్నతనం నుంచే వారిలో సానుకూల దృక్పథం నింపాలంటే.. రోజూ కాసేపు ఒట్టి కాళ్లతో నేలపై నడవనివ్వాలంటున్నారు నిపుణులు. దీనివల్ల భూమిలోని పాజిటివ్‌ ఎలక్ట్రాన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇదే సమయంలో శరీరంలోని నెగెటివ్‌ ఎలక్ట్రాన్లను భూమి గ్రహిస్తుంది. ఫలితంగా ప్రతి విషయంలోనూ సానుకూలంగా ఆలోచించచ్చు. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

అయితే పిల్లలు చెప్పుల్లేకుండా ఒట్టి కాళ్లతో నడవడం, ఆడుకోవడం మంచిదే అయినప్పటికీ.. ఈ సమయంలో వారిపై ఓ కన్నేసి ఉంచడం, ప్రమాదాలు కొనితెచ్చుకోకుండా, గాయాలు కాకుండా కాపాడుకోవడం.. తల్లిదండ్రుల బాధ్యతే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని