ఆ రథం లాగేది... మహిళలే!

ఆషాఢమాసం అనగానే చాలామందికి గుర్తొచ్చేది పూరీ ‘జగన్నాథ రథయాత్ర’! పెద్ద పెద్ద రథాలు... కోట్ల సంఖ్యలో పాల్గొనే భక్తులతో ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా దీనికి గుర్తింపు. సుమారు 12వ శతాబ్దం నుంచి నిర్వహిస్తోన్న ఈ వేడుకలో మహిళలకీ ప్రత్యేక ప్రాధాన్యముందని తెలుసా?

Published : 08 Jul 2024 02:19 IST

ఆషాఢమాసం అనగానే చాలామందికి గుర్తొచ్చేది పూరీ ‘జగన్నాథ రథయాత్ర’! పెద్ద పెద్ద రథాలు... కోట్ల సంఖ్యలో పాల్గొనే భక్తులతో ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకగా దీనికి గుర్తింపు. సుమారు 12వ శతాబ్దం నుంచి నిర్వహిస్తోన్న ఈ వేడుకలో మహిళలకీ ప్రత్యేక ప్రాధాన్యముందని తెలుసా?

ఓరోజు సుభద్రా దేవికి బంధువు ‘గుండీచ’ ఇంటికి వెళ్లాలన్న కోరిక కలిగిందట. అదే విషయం అన్నలు జగన్నాథుడు, బలభద్రులకు చెబుతుంది. చెల్లెను ఒంటరిగా పంపలేక అన్నలిద్దరూ ఆమె వెంట బయల్దేరారు. అలా ముగ్గురూ ఒక్కో రథంలో ‘గుండీచ’ వెళతారు. దీన్నే పూరీలో ఏటా గుండీచ యాత్ర, రథయాత్రగా నిర్వహిస్తారు. తన భక్తురాలైన గుండీచ భక్తికి మెచ్చి ఏటా ఆమె ఇంట్లో బస చేసేలా జగన్నాథస్వామి వరమిచ్చారని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ యాత్రలో వాడే ఒక్కో రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వైశాల్యంలో ఉంటాయి. ఒకసారి కనీసం నాలుగు వేల మంది లాగితే కానీ రథం ముందుకు కదలదు. దీన్ని లాగడానికి దేశం నలుమూలల నుంచి కోట్లకొద్దీ భక్తులు తరలి వస్తారు. కనీసం తాకినా చాలని తాపత్రయపడతారు. అలాంటిది ఒకరోజు పూర్తిగా మనకే... మహిళలకే ప్రాధాన్యమిస్తారని తెలుసా? అయితే ఇది పూరీలో కాదు... బారిపదాలో!

పూరీలో ప్రారంభమైన రెండోరోజు ఇక్కడ రథయాత్ర మొదలవుతుంది. దీన్ని ‘ద్వితీయ శ్రీక్షేత్ర’గా పిలుస్తారు. జగన్నాథస్వామి అన్నాచెల్లెళ్లతో కలిసి, రెండోరోజుకు బారిపదా చేరుకుంటారని ఇక్కడివారు నమ్ముతారు. ఇదీ ఏళ్లనాటి నుంచి వస్తున్న సంప్రదాయమే! ఇక్కడా పూరీలోలానే ఒక్కో మూర్తికి ఒక్కో రథాన్ని సిద్ధం చేస్తారు. ఇక్కడ రథయాత్ర ఏకంగా 3 రోజులు సాగుతుంది. తొలిరోజు బలభద్రుడు, రెండోరోజు సుభద్రా దేవి, మూడోరోజు జగన్నాథస్వామి రథాలను లాగుతారు. సుభద్రా దేవి రథాన్ని ఒకరోజు పూర్తిగా మహిళలే లాగుతారు. అయితే ఈ సంప్రదాయానికి బీజం పడింది మాత్రం 1950ల్లో! అప్పట్లో రథాన్ని లాగాలి... కనీసం దాన్ని తాకాలని ప్రయత్నించిందో మహిళ. ఈ క్రమంలో కింద పడిపోయింది. ఒకతను సమయానికి స్పందించడంతో బతికిపోయింది. ఈమెలాగే ఎంతోమంది మహిళలు ఇబ్బంది పడేవారట. అందుకని కొందరు మహిళలు అప్పటి డిస్ట్రిక్‌ మెజిస్ట్రేట్‌కి ‘కేవలం ఆడవాళ్ల’కే ఓ అవకాశమివ్వమని అర్జీ చేసుకున్నారు. అధికారులూ దాన్ని ఆమోదించడంతో 1975 నుంచి ఈ సంప్రదాయం అమల్లోకి వచ్చింది. తొలిరోజుల్లో శాస్త్రానికి పదిమందితో తాడును పట్టించినా... రానురానూ పూర్తిగా వాళ్లే ముందుకు నడిపిస్తున్నారు. అందుకే దీని వెనక భక్తి కోణమున్నా... స్త్రీ సాధికారతకు గుర్తుగానూ అభివర్ణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్