ఆ ఒక్క సమాధానంతో విజేతలుగా మారారు..!

21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పంజాబ్ బ్యూటీ హర్నాజ్‌ సంధు ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు సుస్మితాసేన్‌, లారాదత్తా మాత్రమే విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. అలాగే మరికొంతమంది భామలు మిస్ వరల్డ్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.

Updated : 14 Dec 2021 21:08 IST

21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పంజాబ్ బ్యూటీ హర్నాజ్‌ సంధు ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు సుస్మితాసేన్‌, లారాదత్తా మాత్రమే విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. అలాగే మరికొంతమంది భామలు మిస్ వరల్డ్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అయితే అందాల పోటీలంటే కేవలం అందం మాత్రమే కాదు... పోటీదారుల ప్రతిభాపాటవాలను సైతం పరీక్షిస్తారు. ఈ క్రమంలో న్యాయనిర్ణేతలు అడిగే ప్రశ్నలకు అందాల భామలు ఇచ్చే సమాధానాలను బట్టే విజేతలను ప్రకటిస్తుంటారు. మరి, తాజాగా హర్నాజ్ సంధుతో పాటు ఇంతకుముందు ‘విశ్వ సుందరి’, ‘ప్రపంచ సుందరి’ కిరీటాలను సొంతం చేసుకున్న మన అందాల భామలను అడిగిన ప్రశ్నలు, వాటికి వారిచ్చిన సమాధానాలు ఏమిటో తెలుసుకోవడం ఆసక్తికరం.

మీ జీవితానికి మీరే లీడర్!

పంజాబ్‌కు చెందిన హర్నాజ్‌ సంధు 79 దేశాల సుందరీమణులను వెనక్కి నెట్టి ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటీల్లో భాగంగా తుది రౌండ్‌లో హర్నాజ్‌ను న్యాయనిర్ణేతలు ‘అమ్మాయిలు వివిధ రకాల ఒత్తిళ్లను, అవరోధాలను ధైర్యంగా ఎదుర్కోవాలంటే మీరిచ్చే సలహాలేంటి?’ అని అడిగారు. దీనికి బదులుగా ‘ఈ కాలపు అమ్మాయిలు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు. మనకు మనమే ప్రత్యేకం అన్న వాస్తవాన్ని గ్రహిస్తే ప్రతి ఒక్కరూ అందగత్తెలే అవుతారు. అందుకే మరొకరితో పోల్చుకోవడం మానుకొని.. చుట్టూ జరుగుతోన్న విషయాల గురించి చర్చించండి. ధైర్యంగా ముందుకొచ్చి.. మీలోని ప్రత్యేకతల గురించి మాట్లాడండి.. ఎందుకంటే మీ జీవితానికి మీరే లీడర్.. ఇలా నన్ను నేను నమ్ముకున్నాను కాబట్టే ఇక్కడి దాకా రాగలిగాను..’ అంటూ తన తెలివైన సమాధానంతో న్యాయనిర్ణేతల మనసు గెలుచుకుంది. కిరీటాన్ని సొంతం చేసుకుంది.


అత్యధిక వేతనం అమ్మకే..!

మానుషి.. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కి కిరీటాన్ని సంపాదించి పెట్టి మన దేశపు కీర్తికిరీటంలో తనో కలికితురాయిలా మారింది. ఆ పోటీల్లో ఆమె చెప్పిన సమాధానం కూడా ఇందుకు ఓ కారణమే.. 'ప్రపంచంలో ఏ వృత్తికి అత్యధిక జీతం దక్కాలని మీరు భావిస్తున్నారు.. ఎందుకు?' అని అడిగిన ప్రశ్నకు 'ఈ ప్రపంచంలో అత్యధిక జీతం అందాల్సిన వ్యక్తి అమ్మ. ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ ప్రేమ, గౌరవం దక్కాల్సిన వ్యక్తి తనే అని నాకనిపిస్తోంది. అత్యధిక జీతం అంటే కేవలం డబ్బు విషయం మాత్రమే కాదు.. వారిపై చూపించే ప్రేమాభిమానాలు కూడా. మా అమ్మ చిన్నతనం నుంచి నాకు స్ఫూర్తిదాతగా నిలిచింది. ప్రతి తల్లి తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. అందుకే అమ్మకే అందరికంటే ఎక్కువ జీతం దక్కాలని నేను భావిస్తున్నా..' అంటూ సమాధానమిచ్చింది మానుషి..


తనంటే నాకెంతో గౌరవం..

మానుషి కంటే ముందు ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలిచిన భారతీయురాలు ఎవరో మీకు తెలుసా? మన దేశీ గర్ల్ ప్రియాంకా చోప్రా. 2000 సంవత్సరంలో ఆమె ఈ కిరీటాన్ని గెలుచుకుంది. 'ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తి ఎవరని మీ భావన?' అంటూ ఎదురైన ప్రశ్నకు.. 'నేను ఆరాధించే వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అందులో మదర్ థెరిసా అంటే నాకెంతో గౌరవం. అన్నార్తుల కోసం తానెంతగానో తపించింది. ప్రేమామృతం కురిపించింది. అభాగ్యుల జీవితాల్లో వెలుగులు పూయించేందుకు తన జీవితాన్నే త్యాగం చేసింది..' అంటూ మదర్ థెరిసా త్యాగాన్ని గుర్తు చేసుకుంది.


పోటీలు స్వతంత్రంగా మారుస్తాయి..

2000 సంవత్సరంలో ప్రియాంక ప్రపంచ సుందరిగా గెలిస్తే.. అదే ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది అందాల తార లారా దత్తా. సమయస్ఫూర్తితో చక్కటి సమాధానమిచ్చి న్యాయనిర్ణేతలను ఆకట్టుకుందామె. 'మిస్ యూనివర్స్ పోటీలు మహిళల గౌరవాన్ని తగ్గించేవిగా ఉన్నాయని ప్రస్తుతం బయట చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారి భావన తప్పని నువ్వెలా నిరూపిస్తావు?' అన్న ప్రశ్నకు 'మిస్ యూనివర్స్‌లాంటి పోటీలు యువతులకు వారు కోరుకున్న వివిధ రంగాల్లో అడుగుపెట్టేందుకు, అందులో ముందుకెళ్లేందుకు ఎంతగానో తోడ్పడతాయి. అది ఏ రంగమైనా కావచ్చు.. అందులోకి ప్రవేశించడానికి ఇదో చక్కటి మార్గంలా పనిచేస్తుంది. ఈ పోటీలు మా అభిప్రాయాలను చెప్పేందుకు ఓ వేదికను కల్పిస్తూ.. మేం ప్రస్తుతం ఉన్నట్లుగా స్వతంత్రంగా, శక్తిమంతంగా మార్చడానికి ఎంతో తోడ్పడతాయి..' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.


తనలా మారాలని..

1999లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది అందాల భామ యుక్తా ముఖి. ఓ సింపుల్ ప్రశ్నకు చక్కటి సమాధానమిచ్చి ఆకట్టుకుంది. 'ఈ ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిగా మారేందుకు మీకు అవకాశం దొరికితే ఎవరిలా మారడానికి ఇష్టపడతారు?' అని అడిగిన ప్రశ్నకు 'నేను ఆడ్రీ హెప్‌బర్న్ (పాతతరం బ్రిటిష్ నటి)లా మారాలనుకుంటున్నా. తను చూడడానికి అందంగా ఉండడమే కాదు.. తన అంతఃసౌందర్యం, తన తేజస్సు, శాంతస్వభావం నన్నెంతో ఆకట్టుకుంటాయి. ఆమెలాంటి మహిళగా మారడం అంటే అదృష్టమని చెప్పుకోవాలి' అని సమాధానమిచ్చింది యుక్తాముఖి.


కలలు నిజం చేసుకోవాలని..

డయానా హెడెన్.. 1997లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన హైదరాబాదీ సొగసరి. 'మీరు మిస్ వరల్డ్ ఎందుకు కావాలనుకుంటున్నారు?' అంటూ పోటీదారులందరినీ కామన్‌గా అడిగిన ప్రశ్నకు 'గొప్ప కవి అయిన డబ్ల్యూ బీ యీట్స్ అందించిన కొటేషన్ నుంచి ఈ కిరీటాన్ని సాధించడానికి నేను స్ఫూర్తి పొందాను. 'కలల్లోనే బాధ్యతలు మొదలవుతాయి' అని వాట్స్ చెప్పినట్లు.. నా వరకూ చూసుకుంటే మిస్ వరల్డ్ టైటిల్ పొందడం అన్నది నా కల. ఆ కలను నెరవేర్చుకోవడం ద్వారా నేను నెరవేర్చే బాధ్యతలతో మరికొందరి కలలను కూడా నెరవేర్చగలుగుతాను. అది నాకెంతో ఆనందాన్ని అందిస్తుంది' అంటూ మిస్ వరల్డ్ కావాలన్న తన కోరికను బయటపెట్టి.. కిరీటాన్ని గెలుచుకుందామె.


కరుణే అన్నింటికంటే ప్రధానం..

ఎంతోమంది అభిమానులను తన నీలికళ్లతో ఆకట్టుకున్న సుందరి ఐశ్వర్యా రాయ్. 1994లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ఐష్ ఇప్పటికీ 'ప్రపంచ సుందరి'గానే కితాబులందుకుంటూ అభిమానులు మెచ్చిన తారగా వెలుగొందుతోంది. మిస్ వరల్డ్‌కి ఉండాల్సిన లక్షణాల గురించి చక్కగా వివరించి కిరీటాన్ని సాధించిందీ భామ.

'మీ దృష్టిలో మిస్ వరల్డ్ 1994కి ఉండాల్సిన ప్రత్యేకమైన లక్షణాలేంటి' అంటూ ఎదురైన ప్రశ్నకు 'ఇప్పటివరకూ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న వారంతా కరుణ హృదయాన్ని కలిగి ఉన్నవారే. దీనులు, నిరుపేదల పట్ల కరుణే వారిని మిగిలిన వారికి విభిన్నంగా మార్చింది. దీంతో పాటు మనుషులు ఏర్పాటు చేసుకున్న అడ్డుగోడలు అవి దేశాల సరిహద్దులైనా, రంగైనా.. మరేదైనా వాటిని పట్టించుకోని వ్యక్తులు వారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నవారు మిస్ వరల్డ్ అవడమే కాదు.. ఓ నిజమైన వ్యక్తి అని కూడా అనిపించుకోగలరు' అంది ఐశ్వర్య.


అవన్నీ కలిపితేనే నిజమైన మహిళ!

1994లో ఐష్ ప్రపంచ సుందరిగా మారిన కొన్ని రోజులకే విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది సుస్మితా సేన్. మన దేశం నుంచి మొట్టమొదటిసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిన వ్యక్తి ఆమే కావడం విశేషం. 'మీ దృష్టిలో ఒక నిజమైన మహిళ అంటే ఏంటి?' అని అడిగిన ప్రశ్నకు 'ఒక మహిళగా పుట్టడం అనేదే దేవుడు అందించిన వరం అని నా భావన. దీన్ని అందరూ గుర్తించాలి. ఒక బిడ్డను కనేది అమ్మ అంటే ఒక స్త్రీ. ఒక మహిళే మగవాడిపై చిన్నతనం నుంచీ ప్రేమ చూపిస్తూ.. ప్రేమ, జాలి విలువను తెలియజేయడమే కాదు.. ఇతరులతో పంచుకోవడాన్ని నేర్పిస్తుంది. నా దృష్టిలో ఇవన్నీ కలిపితేనే ఓ నిజమైన మహిళ' అని సమాధానమిచ్చింది సుస్మిత.


అందుకే డాక్టర్ కావాలనుకుంటున్నా..

ఐష్ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకోవడానికి 28 సంవత్సరాల ముందు మన దేశం నుంచి మొదటి ప్రపంచ సుందరిగా మారి.. మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి కిరీటాన్ని సాధించింది రీటా ఫారియా. 'నువ్వు డాక్టర్ ఎందుకు కావాలనుకుంటున్నావు' అని న్యాయనిర్ణేతలు ఆమెను ప్రశ్నించగా 'భారత్‌లో చాలామంది గైనకాలజిస్టుల అవసరం ఉంది' అని సమాధానమిచ్చింది రీటా. దీనికి వారు నవ్వుతూ 'ఇప్పటికే మీ దేశంలో చాలామంది పిల్లలున్నారు కదా..' అంటూ భారత జనాభాపై ఓ జోక్ విసిరారు. దీనికి రీటా 'దాన్ని తగ్గించడానికే ఎక్కువమంది గైనకాలజిస్టులు అవసరం' అంటూ దీటుగా సమాధానమిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్