Updated : 30/09/2022 18:43 IST

బతుకమ్మ పూలతో పువ్వులా మెరిసేలా..!

'ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే..' అంటూ పూలలో పూవుగా ప్రతిఒక్కరూ మెరిసిపోయే పండుగ బతుకమ్మ. సాధారణంగానే పూల గురించి మాట్లాడితే.. అమ్మాయిలే గుర్తొస్తారు. ఎందుకంటే పూలలాంటి సున్నితమైన అందం  వారి సొంతం కాబట్టి..! మరి, పూలను పూజించే ఈ అపురూపమైన పండగ బతుకమ్మ సందర్భంగా పూలతో అందంగా మెరిసిపోతే ఎంత బాగుంటుందో కదూ. అదెలా సాధ్యమనుకుంటున్నారా? బతుకమ్మలో ఉపయోగించే కొన్ని పూలు, వాటి రేకలను ఉపయోగించి మన చర్మ ఆరోగ్యాన్ని చక్కగా సంరక్షించుకోవచ్చు. అందాన్ని కూడా ద్విగుణీకృతం చేసుకోవచ్చు. మరి, ఆ పూలేంటో.. బతుకమ్మలో వాడే ఆ పూలతో అందాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చో చూద్దాం రండి..

బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వులోనూ ఏదో ఒక ఆయుర్వేద గుణం తప్పకుండా ఉంటుంది. ఇవి మన శరీరాన్ని వివిధ ఆరోగ్య సమస్యల నుంచి దూరం చేయడమే కాదు.. చర్మాన్ని అందంగా మెరిపించడంలోనూ ఉపయోగపడతాయి. అలాంటి పూలలో ముఖ్యమైనవి తంగేడు, మందార, బంతి, చామంతి, గులాబీలు.. మరి, ఈ పూలతో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో.. ఈ పండగకు సహజసిద్ధమైన మెరుపును ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకుందాం రండి..

తంగేడుతో తళతళ..

బతుకమ్మ అనగానే ముందుగా గుర్తొచ్చే పువ్వు తంగేడు పువ్వు.. శాస్త్రానికి కనీసం ఒక్క తంగేడు పువ్వైనా లేకుండా బతుకమ్మను పేర్చకూడదంటారు పెద్దలు.. అంతటి ప్రాముఖ్యం ఉంటుంది తంగేడు పువ్వుకు.. ఈ పువ్వు సౌందర్యాన్ని కాపాడడంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని ఎండబెట్టి, రేకులను పొడి చేసి.. ఆ పొడిని ప్రతి రోజూ ఉపయోగిస్తే మంచి చర్మఛాయ సొంతమవుతుందట. దీనికోసం ఈ పూరేకల పొడిని మెత్తగా జల్లించుకొని అందులో శెనగపిండి, రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చక్కటి చర్మ ఛాయను సొంతం చేసుకోవచ్చు.

అలాగే తంగేడు పూల పొడితో స్క్రబ్‌ని కూడా తయారుచేసుకోవచ్చు. దీనికోసం నిమ్మతొక్కల పొడి, పెసర పిండి, శెనగపిండి, గులాబీ రెక్కల పొడి సమాన మొత్తాల్లో తీసుకొని బాగా మెత్తగా చేసుకొని జల్లించుకోవాలి. దీన్ని రోజూ స్నానం చేసేముందు శరీరానికి పట్టిస్తే చర్మం కాంతిమంతమవడమే కాదు.. ఎలర్జీల బారి నుంచి కూడా విముక్తి లభిస్తుంది. మచ్చలను దూరం చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.


మెరిసే మోముకు మందార

మందారం చర్మ ఆరోగ్యానికే కాదు.. జుట్టు పట్టులా మెరిసేందుకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం మందార పూలను ఎండబెట్టి ఆ పొడిని నూనెలో వేసుకొని తలకు పట్టించవచ్చు. దీంతో జుట్టు బాగా పెరిగే వీలుంటుంది. ఇక చర్మ సౌందర్యం కోసం కూడా మందారను ఉపయోగించవచ్చు. దీనికోసం మందార పూరేకుల పొడి, బియ్యప్పిండి సమాన మొత్తాల్లో తీసుకొని, దానికి విటమిన్ ఇ ఆయిల్ కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి రుద్దుకొని ఓ అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తడి గుడ్డతో తుడిచి, కడిగేసుకోవాలి. దీన్ని ఉపయోగించడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు చర్మం కూడా కాంతిమంతమవుతుంది.


ముద్దబంతిలాంటి ముఖానికి..

బతుకమ్మలో ఎన్ని రకాల పూలను పేర్చినా.. అన్నింటికంటే బాగా హైలైట్ అయ్యి దాని అందాన్ని పెంచేవి బంతి పూలు మాత్రమే.. అందమైన ముద్దబంతిలాంటి మోము కావాలంటే ముద్దబంతి రేకులను చర్మ సంరక్షణలో ఉపయోగిస్తే సరి. దీనికోసం 10 నుంచి 15 బంతిపూల రేకులను తీసుకొని, అందులో ఐదారు తేనె చుక్కలు, టీస్పూన్ క్రీమ్, అర టీస్పూన్ శెనగ పిండి వేసి బాగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకోవాలి. కళ్ల కింది భాగాన్ని మాత్రం విడిచిపెట్టాలి. అలా 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి, తడి బట్టతో తుడిచేయాలి. దీనివల్ల సహజసిద్ధమైన కాంతి చర్మానికి అందుతుంది. ఇంతే కాదు.. పాల పొడి, బంతి పూరేకులు, పెరుగు, తురిమిన క్యారట్ కలిపి మెత్తగా చేసిన ప్యాక్‌ని కూడా చర్మానికి అప్త్లె చేసుకోవచ్చు. దీన్ని తరచూ వేసుకొని పావు గంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తూ ఉండడం వల్ల చర్మంపై ఉన్న మృత చర్మం పోయి చర్మఛాయ పెరుగుతుంది.


చక్కటి సౌందర్యానికి చామంతి

చామంతి కూడా అందాన్ని ఇనుమడింపజేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. దీని మెత్తని పూరేకులు సహజసిద్ధమైన ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని మెత్తగా, పట్టులా మెరిసేలా చేస్తాయి. చర్మపు రంధ్రాల నుంచి మలినాలను తొలగించి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతాయి. దీనికోసం పది- పదిహేను చామంతి రేకులను తీసుకొని నీళ్లలో వేసి మెత్తగా తయారుచేసుకోవాలి. దీనికి టీస్పూన్ తేనె, కొన్ని పాలు కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మంలోని మృత కణాలన్నీ తొలగిపోతాయి.. దీంతో పాటు చామంతి రేకులు, తేనె, శెనగపిండి కలిపి చర్మానికి పట్టించి, పదిహేను నిమిషాలాగిన తర్వాత తడి బట్టతో తుడిచేస్తే సరి. మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.


గులాబీ మెరుపులతో..

గులాబీ మన చర్మానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. అందుకే చర్మ సంరక్షణలో భాగంగా మనం రోజ్‌వాటర్‌ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ప్రకాశవంతమైన చర్మం కోసం గులాబీ రేకల పొడిలో కొన్ని పాలు, కొన్ని గోధుమ ఫ్లేక్స్ వేసి దాన్ని బాగా రుబ్బి చర్మానికి పట్టించాలి. పూర్తిగా ఆరిన తర్వాత తుడుచుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు.. రెండు టేబుల్ స్పూన్ల చందనం, రెండు టేబుల్‌స్పూన్ల గులాబీ రెక్కల పొడి తీసుకొని నీళ్లు కలుపుతూ మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్త్లె చేసి, అరగంట పాటు అలాగే ఉంచుకొని.. ఆ తర్వాత కడిగేసుకుంటే సరి. గులాబీలాంటి మెరుపు సొంతమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని