Updated : 19/10/2021 19:47 IST

క్యారట్‌తో కాంతులీనే చర్మం..!

క్యారట్- కొందరు బాగా ఇష్టంగా తింటారు.. మరికొందరు కష్టంగా తింటారు. దీని వల్ల అటు ఆరోగ్యపరంగానే కాకుండా ఇటు సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ 'ఎ', యాంటీఆక్సిడెంట్లు.. మొదలైనవన్నీ చర్మ సౌందర్యానికి దోహదం చేస్తాయి. ఇన్ని సుగుణాలున్న క్యారట్‌ను ఉపయోగించి వివిధ రకాల ఫేస్‌ప్యాక్స్, మాస్క్స్.. ఇలా చర్మ సౌందర్యం ఇనుమడించడానికి రకరకాల చిట్కాలు పాటించవచ్చు. సహజసిద్ధంగా లభించే క్యారట్‌ను, ఇంట్లో అందుబాటులో ఉండే ఇతర వస్తువులతో కలిపితే పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మైమరిపించే అందాన్ని సొంతం చేసుకోవచ్చు.

పాలు, క్యారట్ ఫేస్ ప్యాక్

చర్మంలోని జీవకణాలు పాడైతే కొత్త కణాలు ఏర్పడకపోవడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. అయితే క్యారట్లలో ఉండే బీటాకెరోటిన్లు చర్మకణాలు నాశనమవకుండా ఉండటానికి సహాయపడతాయి. ఫలితంగా వార్థక్యపు ఛాయలు అంత తొందరగా దరి చేరకుండా ఉంటాయి. అలా ఉపకరించే ఫేస్‌ప్యాక్స్‌లో ఇది కూడా ఒకటి.

కావాల్సినవి:

క్యారట్- 1

పచ్చిపాలు- 1 టేబుల్‌స్పూన్

తేనె- 1 టేబుల్‌స్పూన్

తయారీ:

క్యారట్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉడికించుకోవాలి. తర్వాత మెత్తని మిశ్రమంలా చేయాలి. ఈ మిశ్రమం చల్లారాక దానికి పచ్చిపాలు, తేనె జత చేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖచర్మానికి తేమ అందడంతో పాటు, పాలు చర్మంలో పేరుకుపోయిన మురికిని తొలగించి మచ్చలు లేకుండా చేస్తుంది.


క్యారట్, తేనెతో..

శరీరంలో పొటాషియం లోపిస్తే చర్మం ఎక్కువగా పొడి బారుతుంది. ఫలితంగా ముఖం నిర్జీవంగా మారుతుంది. దీన్ని నివారించాలంటే పొటాషియం అధికంగా లభించే క్యారట్‌ని ఆహారంలో భాగం చేసుకోవాలి. క్యారట్ తినడం ఇష్టం లేకపోతే ఈ ఫేస్ ప్యాక్ ప్రయత్నించి చూడండి.

కావాల్సినవి:

క్యారట్- 3

తేనె- 2 టేబుల్‌స్పూన్స్

ఆలివ్ ఆయిల్- 1 టేబుల్‌స్పూన్

నీళ్లు- కలపడానికి సరిపడా.

తయారీ:

ముందుగా క్యారట్‌ని తొక్క తీసేసి బాగా ఉడికించాలి. తర్వాత ఉడికిన క్యారట్‌ని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు అందులో తేనె, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఒకవేళ ఈ మిశ్రమం బాగా గట్టిగా ఉన్నట్లనిపిస్తే కొద్దిగా నీళ్లు జత చేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ ప్యాక్ అప్త్లె చేసే ముందు గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా చర్మగ్రంథులు తెరుచుకుంటాయి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని అప్త్లె చేసుకుని 20నిమిషాల పాటు ఆరనివ్వాలి. కాసేపటికి ఫేస్ ప్యాక్ ఆరి పొరలా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్లీ గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారానికోసారి చేస్తే చర్మం కాంతులీనడం ఖాయం. ఇందులో క్యారట్ చర్మ సౌందర్యానికి ఉపకరిస్తే, ఆలివ్ ఆయిల్ పొడిబారిన చర్మానికి జీవాన్నిస్తుంది.


నవ యవ్వన చర్మం కోసం..

క్యారట్‌లో ఉండే విటమిన్ 'ఎ' చర్మం బిగుతుదనం కోల్పోకుండా చేసి యవ్వనంగా ఉండేలా చేయడంలో తోడ్పడుతుంది. చర్మం ఎప్పుడూ అలాగే ఉండాలంటే విటమిన్-ఎ తగినంత పరిమాణంలో శరీరానికి తప్పకుండా అందాలి.

కావాల్సినవి:

క్యారట్ జ్యూస్- 1 టేబుల్‌స్పూన్

గుడ్డు- 1

ఆలివ్ ఆయిల్- 1 టీస్పూన్

పెరుగు- టేబుల్‌స్పూన్

తయారీ

ముందుగా క్యారట్‌ని గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ ఒక టేబుల్‌స్పూన్ తీసుకొని దానికి గుడ్డులోని తెల్లసొన జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి పెరుగు కలిపి మరోసారి మెత్తగా అయ్యే వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో ఆలివ్ ఆయిల్ కూడా కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలా మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్త్లె చేసుకుని 25 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


మృతకణాలు తొలగించే.. స్క్రబ్!

క్యారట్‌తో స్క్రబ్ తయారు చేసుకోవడం చాలా సులభం. దీని వల్ల ప్రయోజనాలు కూడా ఎక్కువే. మార్కెట్‌లో లభించే ఇతర స్క్రబ్‌ల కన్నా ఇది ఉత్తమంగా పని చేస్తుంది. పైగా ఖర్చు కూడా తక్కువ. ఈ స్క్రబ్‌ని తయారు చేసుకోవడం ఎలాగంటే..

కావాల్సినవి:

క్యారట్- 1 (మధ్య సైజు)

పంచదార- 1 టేబుల్‌స్పూన్

పాల పొడి- 1 టేబుల్‌స్పూన్

తయారీ:

క్యారట్‌ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలకి పాలపొడి, పంచదార జత చేయాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. మనకి కావాల్సింది స్క్రబ్ కాబట్టి మిశ్రమం మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖంపై మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. స్క్రబ్ చేయడం వల్ల చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి కాబట్టి చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది. అంతేకాకుండా బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ కూడా తగ్గుముఖం పడతాయి.

మేకప్‌కి ముందు!

మనం వేసుకునే మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉండాలంటే చర్మంలోని తేమశాతం బాగుండాలి. అందుకే మేకప్ వేసుకోవడానికి ముందు అరటేబుల్ స్పూన్ క్యారట్ జ్యూస్‌కి, అరటేబుల్ స్పూన్ కమలారసం జతచేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మేకప్ వేసుకుంటే ఆ ప్రభావం ఎక్కువసేపు కనిపిస్తుంది.


పిగ్మెంటేషన్ సమస్యకూ..

మీరు పిగ్మెంటేషన్ సమస్యతో సతమతమవుతున్నారా?? అయితే ఈ ప్యాక్ ప్రయత్నించి చూడండి..

కావాల్సినవి:

క్యారట్‌జ్యూస్- 2 టేబుల్‌స్పూన్స్

ఓట్స్ పౌడర్- 1 టేబుల్‌స్పూన్

పసుపు- తగినంత

చక్కెర- 1 టేబుల్‌స్పూన్

తయారీ:

ముందుగా క్యారట్‌ని తరిగి గ్రైండ్ చేసి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్‌కి ఓట్స్ పౌడర్‌ని జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మెత్తని పేస్ట్‌లా అయ్యాక దానికి కాస్త పసుపు, పంచదార జత చేయండి. బాగా మిక్స్ చేశాక ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని మృదువుగా మర్దన చేయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపు మేని ఛాయని మెరుగుపరిస్తే, క్యారట్ జ్యూస్ చర్మం కాంతులీనడానికి సహాయ పడుతుంది. పంచదార, ఓట్స్ పౌడర్ స్క్రబ్‌లా పనిచేస్తాయి.

ఇవే కాకుండా క్యారట్‌ను ఉపయోగించి వార్థక్యాన్ని నివారించే, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే రకరకాల ఫేస్‌ప్యాక్స్, మాస్క్స్ కూడా చేసుకోవచ్చు. ఇన్ని మంచి సుగుణాలు క్యారట్ సొంతం కాబట్టే చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. పైగా ఇంట్లో సులభంగా లభించేదే కాబట్టి అందుబాటు బడ్జెట్‌లోనే కాంతులీనే చర్మాన్ని సొంతం చేసేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని